హైదరాబాద్: లాస్ ఏంజెల్స్, లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్ ద్వారా పాములను దిగుమతి చేస్తున్నారన్న క్లెయిమ్ తో, కార్గో బాక్స్ నుండి పాములులాంటి జీవులు జారిపోయి, విమానాశ్రయంలోని టార్మాక్‌పై పడుతున్న వీడియో వైరల్‌గా మారింది.
ఈ వీడియోను ఒక ఫేస్‌బుక్ యూజర్ “లుఫ్తాన్స ఎయిర్ లైన్స్ లాస్ ఏంజిల్స్ లో పాములు దిగుమతి” అనే క్యాప్షన్‌తో షేర్ చేశారు. ఈ వీడియో క్లిప్ మీద ఉన్న టెక్స్ట్ కూడా అదే విషయాన్ని చూపించింది. (ఆర్కైవ్)
ఫ్యాక్ట్ చెక్
న్యూస్‌మీటర్ ఈ క్లెయిమ్‌ను తప్పని నిర్ధారించింది. వైరల్ వీడియో లుఫ్తాన్స ఎయిర్ లైన్స్ లేదా లాస్ ఏంజెలిస్‌కు సంబంధించినది కాదు. ఇది కెనడాలోని వాంకోవర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (YVR) లో జరిగిన సంఘటనకు సంబంధించింది.
వీడియో నుండి తీసిన ఒక కీఫ్రేమ్‌కు రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ‘కెనడా విమానాశ్రయం యొక్క టార్మాక్‌పై ఈల్స్ మెలికలు తిరుగుతున్నట్లు చూపించే వీడియోపై ఇంటర్నెట్ సందడి చేస్తోంది’ (ఆంగ్లం నుండి తెలుగులో అనువాదించబడింది) అనే టైటిల్‌తో ఇండియా టీవీ ప్రచురించిన ఆర్టికల్ కనిపించింది. ఇది 2024 జూలై 12న ప్రచురించబడింది.
ఆ నివేదికలో విమానాశ్రయం టార్మాక్‌పై మెలికలు తిరుగుతున్న జీవుల వీడియో స్క్రీన్‌షాట్లు కనిపించాయి. ఈ నివేదిక ప్రకారం, ఈ ఘటన వాంకోవర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో జరిగింది. అక్కడ కొన్ని ఈల్స్ కార్గో బాక్స్ నుంచి బయటకు వచ్చి టార్మాక్‌పై పడి కదులుతున్నాయి.
ఈ నివేదిక తెలిపిన వివరాల ప్రకారం, ఈ ఈల్స్ టొరంటో నుంచి వాంకోవర్‌కు ఎయిర్ కెనడా కార్గో విమానం ద్వారా రవాణా చేయబడ్డాయి. ఈ కంటైనర్ కన్వేయర్ బెల్ట్ మీద ఉండగా బాక్స్ పాడవ్వడంతో ఈల్స్ బయటకు వచ్చాయి. టార్మాక్‌పై సుమారు 12 ఈల్స్ కదులుతున్నట్లు నివేదిక పేర్కొంది.
ఇంకా, ఇండియా టీవీ నివేదికలో ‘వాంకోవర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (YVR), కెనడా, జూలై 9’ అని పేర్కొన్న ఒక X పోస్ట్ వీడియోతో పాటు కనిపించింది. ఇది ఘటనను మరో యాంగిల్ నుంచి చూపిస్తుంది.
వీడియో యొక్క పోలిక ఇక్కడ ఉంది.
ఈ ఘటనపై డైలీ హైవ్ అనే వెబ్‌సైట్ జూలై 10న నివేదిక కూడా ప్రచురించింది. ఇది కూడా అదే వీడియోను నివేదికలో ఎంబెడ్ చేసింది.
అంతేకాకుండా, ఎన్డీటీవీ, న్యూస్18 వంటి ప్రముఖ మీడియా సంస్థలు జూలై 12, 2024న ఈ సంఘటన గురించి కథనాలను ప్రచురించాయి. గ్లోబల్ న్యూస్ మరియు సీబీసీ బ్రిటిష్ కొలంబియా కూడా తమ యూట్యూబ్ ఛానళ్లలో ఈ వీడియోను జూలై 11, 2024న పోస్టు చేశాయి.
కాబట్టి, ఈ క్లెయిమ్ తప్పు అని స్పష్టమవుతోంది. వైరల్ వీడియో సర్పాలకు సంబంధించినది కాదు, లుఫ్తాన్స ఎయిర్ లైన్స్ లేదా లాస్ ఏంజెలిస్‌కు సంబంధం లేదు.