Hyderabad: డిసెంబర్ 10న మంచు కుటుంబంలో జరుగుతున్న వివాదాన్ని కవర్ చేయడానికి వెళ్లిన జర్నలిస్టుపై మోహన్ బాబు దాడి చేశారు. దీన్ని ఖండిస్తూ జర్నలిస్ట్ సంఘాలు ధర్నా చేపట్టాయి. ఈ నేపథ్యంలో మంచు కుటుంబంలో జరుగుతున్న గొడవలకు భారత్ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆరే కారణం అని తప్పుడు వార్తతో కూడిన ఓ ఫోటో వైరల్ అవుతుంది.
ఈ వైరల్ ఫోటోలో, "మా కుటుంబంలో జరుగుతున్న గొడవలకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కారణమని మంచు లక్ష్మి మీడియాకు తెలిపారు," అని వ్రాశారు.
"బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఫోన్ టాపింగ్ చేసి తన తండ్రి మోహన్ బాబు ఫోన్ కాల్ రికార్డింగ్ తమ్ముడు మనోజ్‌కు, మనోజ్ ఫోన్ కాల్ రికార్డింగ్ మోహన్ బాబుకు పంపించే వాడని అప్పటినుండి తమ కుటుంబంలో నిత్యం గొడవలు జరుగుతున్నాయని ఈరోజు అవి తారాస్థాయికి చేరుకున్నాయని తెలిపారు," అని వైరల్ ఫోటో పేర్కొంది.
ఈ ఫొటోను ఫేస్‌బుక్‌లో షేర్ చేశారు. (ఆర్కైవ్)
ఇదే క్లెయిమ్‌లను చేస్తున్న పోస్ట్‌ను ఇక్కడ చూడవచ్చు. (ఆర్కైవ్)
Fact Check
న్యూస్ మీటర్ ఈ క్లెయిమ్ తప్పు అని నిర్ధారించింది.
మంచు కుటుంబంలో జరుగుతున్న వివాదాలకు కేటీఆర్ కారణమని మంచు లక్ష్మి చెప్తున్నట్లు విశ్వసనీయమైన సమాచారం ఏదీ మాకు దొరకలేదు.
వైరల్ అవుతున్న న్యూస్ కార్డు Way2News ద్వారా ప్రచురించబడినట్లు, ఫొటోలో లోగో నుండి అర్ధమవుతుంది. కానీ, ఈ విషయం మీద స్పందిస్తూ...ఇది Way2News ప్రచురించిన కథనం కాదు అని స్పష్టం చేశారు.
డిసెంబర్ 11న Way2News Fact Check సోషల్ మీడియాలో వైరల్ ఫోటోపై స్పందిస్తూ.. "ఇది ఒక @way2_news కథ కాదు . తప్పుడు ఉద్దేశ్యంతో కొన్ని గ్రూపులు మా ఫార్మాట్‌లో తప్పుడు సమాచారాన్నిషేర్ చేస్తున్నాయి," అని రాశారు. (ఆర్కైవ్)
కీవర్డ్ సెర్చ్ ద్వారా Hindustan Times డిసెంబర్ 12న ప్రచురించిన "తండ్రి మోహన్ బాబు, సోదరుడు మంచు మనోజ్ మధ్య వైరం మధ్య లక్ష్మి మంచు గుప్తమైన నోట్స్ పోస్ట్ చేసింది" అనే అనే కథనాన్ని కనుగొన్నాం. "
ఈ కథనంలో.. “గురువారం ఉదయం, లక్ష్మి మాజీ రోమన్ చక్రవర్తి మార్కస్ ఆరేలియస్ యొక్క కోట్‌ను X (గతంలో ట్విట్టర్)లో పంచుకున్నారు. "ప్రపంచంలో ఏదీ మీకు చెందనప్పుడు, మీరు ఏమి కోల్పోతారని భయపడుతున్నారు” అని రాసుకొచ్చారు.
ఇదే కథనంలో "మోహన్ బాబు, అతని కుమారుడు మంచు మనోజ్ మధ్య కుటుంబ కలహాల గురించి వార్తలు బయటకు వచ్చినప్పటినుండి లక్ష్మి మంచు ఈ సమస్యపై మౌనంగానే ఉంది." అని రాశారు.
Hindustan Times కథనం ప్రకారం... ఇప్పటి వరకు మంచు కుటుంబంలో జరుగుతున్న వివాదంపై లక్ష్మి ప్రత్యక్షంగా స్పందించలేదు, మీడియాతో కూడా మాట్లాడలేదు అని తెలుస్తుంది.
వైరల్ ఫోటోను Way2News ప్రచురించలేదు, మంచు లక్ష్మీ కుటుంబంలో గొడవలకు కేటీఆర్ కారణం అని మీడియాతో చెప్పలేదు కాబట్టి వైరల్ క్లెయిమ్ తప్పు అని న్యూస్‌మీటర్ నిర్ధారించింది.