Hyderabad: ముస్లిం సైనికులు పాకిస్తాన్‌తో పోరాడటానికి నిరాకరించడంతో 1965లో భారత సైన్యంలోని ముస్లిం రెజిమెంట్ రద్దు చేయబడిందని అని క్లెయిమ్ చేస్తున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
'ఇండియన్ ఆర్మీలో ముస్లిం రెజిమెంట్ ను తీసుకురావాలి - ముస్లిం నేత ఫరూఖ్ శిబ్లి' అని వీడియోపై రాసి ఉంది.
వీడియోలో ముస్లిం నేత ఫరూఖ్ శిబ్లి మాట్లాడుతూ, "ఈ దేశ ప్రధాని గౌరవ నరేంద్ర మోదీగారిని నేను డైరెక్టుగా విన్నవించుకుంటున్నాను, అదే విధంగా రాజ్‌నాథ్ సింగ్‌ని కూడా నేను విన్నవించుకుంటున్నాను, ఏ రకంగా అయితే మన ఆర్మీలో సిఖ్ రెజిమెంట్ ఉందొ, అదే విధంగా గోర్ఖ రెజిమెంట్ అని సెపరేటుగా ఉన్నాయో, ముస్లిం రెజిమెంట్ని ఫారం చేయాల్సిన అవసరం ఉంది. ఇది నేను ముస్లిం సోదరుల తరుఫు నుండి డిమాండ్ చేస్తున్నాను," అని అన్నారు.
దీనికి సమాధానంగా వీడియోలో, "1965 వరకు భారత సైన్యంలో ముస్లిం రెజిమెంట్ ఉంది. కానీ 1965 తర్వాత ముస్లిం రెజిమెంట్ను తొలగించారు ఎందుకంటె 1965 ఇండో-పాక్ సమయంలో 30,000 భారత సైనికులతో కూడిన ముస్లిం రెజిమెంట్ పాకిస్తాన్‌తో యుద్ధం చేసేందుకు నిరాకరించి, భారత్ సిద్ధం చేసిన ఆయుధాలతో సహా పాకిస్తాన్ వైపు మద్దతుగా వెళ్లిపోయారు," అని అన్నారు.
"#ఇండియన్ #ఆర్మీ లో ముస్లిం రెజిమెంట్ తీసుకురావాలి.. - ముస్లిం నేత ఫరూఖ్ శిబ్లి Vs ఇండియన్ ఆర్మీ లో ముస్లిం రెజిమెంట్ ఎందుకు లేదు అంటే," అనే క్యాప్షన్‌తో ఫేస్‌బుక్‌లో ఈ వీడియో పోస్టు చేశారు. (ఆర్కైవ్)
Fact Check
న్యూస్‌మీటర్ ఈ క్లెయిమ్ తప్పు అని కనుగొంది. భారత సైన్యంలో ముస్లిం రెజిమెంట్ అనే రెజిమెంట్ ఎప్పుడూ లేదు.
భారత సైన్యంలో ముస్లిం రెజిమెంట్ ఉనికి గురించిన వాదనలను ధృవీకరించడానికి, భారత సైన్యం వెబ్‌సైట్‌ను వెతికాము. ఈ వెబ్‌సైట్‌లో ఎక్కడా ముస్లిం రెజిమెంట్ గురించి ప్రస్తావన లేదు.
భారత సైన్యం యొక్క లెఫ్టినెంట్ జనరల్ సయ్యద్ అతా హస్నైన్ రాసిన Times of Indiaలో నవంబర్ 29, 2017లో ప్రచురితమైన ''ఉనికిలో లేని' ముస్లిం రెజిమెంట్: సమగ్ర ఖండన లేకుండా, పాకిస్తాన్ ప్రచారం అన్ని విధాలా మోసం చేయడానికి చూస్తుంది' అనే కథనం దొరికింది.
"అసలు ముస్లిం రెజిమెంట్ ఎప్పుడూ లేదు, 1965లో ఖచ్చితంగా లేదు" అని ఆయన అన్నారు. 1965,1971 ఇండో-పాక్ యుద్ధాలలో పాల్గొన్న ముస్లిం సైనికుల గురించి మాట్లాడారు. 1965లో ముస్లిం రెజిమెంట్ని రద్దు చేశారనే క్లెయిమ్ పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ISPR) చేసే తప్పుడు ప్రచారం తప్ప మారేది కాదు అన్నారు.
2020 అక్టోబర్ 25న NDTV ప్రచురించిన వీడియో కథనం ""రద్దీ చేయబడిన ముస్లిం రెజిమెంట్ ఒక అబద్ధం": మాజీ సైనికులు ప్రధానమంత్రి, రాష్ట్రపతికి లేఖ రాశారు" దొరికింది. ఈ కథనంలో, "ముస్లిం సైనికులను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో ప్రమాదకరమైన ధోరణి ఉందని భారత మాజీ సైనికులు రాష్ట్రపతి, ప్రధానమంత్రికి లేఖ రాశారు... ఈ దురుద్దేశపూరిత ఆరోపణలు ముస్లింలపై సాధారణంగా అనుమానాలను రేకెత్తించడానికి. సాయుధ దళాల నైతికతను తగ్గించడానికి రూపొందించబడినవని అధికారులు చెబుతున్నారు," అని పేర్కొన్నారు.
"ఈ 'ముస్లిం రెజిమెంట్' పోస్టులు పూర్తిగా అబద్ధం, ఎందుకంటే భారత సైన్యంలో 1965లో లేదా ఆ తర్వాత ముస్లిం రెజిమెంట్ లేదు" అని లేఖలో పేర్కొన్నట్లు నివేదిక పేర్కొంది.
ఇదే క్లెయిమ్‌ని ఉద్దేశించి India Today, BBC Hindi, The Wire సంస్థలు గతంలో ఫాక్ట్ చెక్ కథనాలను ప్రచురించాయి.
కాబట్టి న్యూస్‌మీటర్ ఈ క్లెయిమ్ తప్పు అని నిర్ధారించింది. 1965లో ముస్లిం రెజిమెంట్ను భారత సైన్యం తొలగించలేదు. అసలు భారత సైన్యంలో ముస్లిం రెజిమెంట్ ఎప్పుడూ లేదు.