Hyderabad: వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ దేశమంతటా నిరసనలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నేత దిలీప్ ఘోష్‌ను చంపడానికి ఒక ముస్లిం గుంపు ఆయనపై దాడి చేసింది అనే క్లెయిమ్‌లతో ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ వీడియోలో కొంతమంది వ్యక్తులు దిలీప్ ఘోష్‌పై దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు చూడవచ్చు, అతని బాడీగార్డ్‌లు వారిని ఆపుతున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండగా, బాడీగార్డులలో ఒకరు తుపాకీని తీసి దుండగులలో ఒకరిపై గురిపెట్టాడు. దిలీప్ ఘోష్‌పై దాడికి పాల్పడింది 'జిహాదీలు' అనే క్లెయిమ్‌లతో వీడియో షేర్ చేయబడింది.
ఈ వీడియోని ఫేస్‌బుక్‌లో షేర్ చేస్తూ క్యాప్షన్‌లో ఇలా రాశారు: " బెంగాల్ సీనియర్ బీజేపీ నేత #దిలిప్_ఘోష్ ను చంపడానికి జెహా*దీల గుంపు దాడి... బెంగాల్ పూర్తిగా జిహాదీలు, ఉ#గ్రవాదుల కబ్జాలో ఉంది, ఈ దేశద్రోహులను విడుదల చేయడం చాలా ప్రమాదకరం.. భద్రతా బలగాల పట్ల భయం లేదు.. ధైర్యం ఎంత ఉంటుందో మీరే ఊహించండి… బెంగాల్ తగలబడుతోంది హిందువులు చస్తున్నారు కాలుతున్నారు దోచుకుంటున్నారు." (ఆర్కైవ్)
ఇవే క్లెయిమ్స్ చేస్తున్న పోస్ట్ ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. (ఆర్కైవ్ 1, ఆర్కైవ్ 2)
Fact Check
న్యూస్‌మీటర్ ఈ క్లెయిమ్ తప్పు అని నిర్ధారించింది. ఈ ఘటన ఇటీవల జరిగింది కాదు, ఇది సెప్టెంబర్ 2021లో దిలీప్ ఘోష్‌పై జరిగిన దాడిని చూపిస్తుంది.
కీ వర్డ్ సెర్చ్ ద్వారా బీజేపీ నేత దిలీప్ ఘోష్‌పై ఇటీవల దాడి జరిగిందని చూపించే వార్త కథనాలు, సోషల్ మీడియా పోస్టులు లేవని గుర్తించాం.
ఈ వీడియో కీ ఫ్రేమ్‌లను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా 27 సెప్టెంబర్ 2021లో X పోస్టులో షేర్ చేసిన వీడియో కనిపించింది. ఈ పోస్టులో ఉన్నది కూడా వైరల్ వీడియోనే అని గుర్తించాం. ఈ వీడియోని షేర్ చేస్తూ క్యాప్షన్‌లో ఇలా రాశారు "ఇది పశ్చిమ బెంగాల్. #మమతాబెనర్జీ గూండాలు @BJP4India జాతీయ ఉపాధ్యక్షుడు శ్రీ @DilipGhoshBJP పై దాడి చేశారు. ఇదేనా ప్రజాస్వామ్యం?"
కీ వర్డ్ సీర్చేస్ ద్వారా 28 సెప్టెంబర్ 2021 న ప్రచురింపబడిన India Today కథనాన్ని కనుగొన్నాం. ఈ కథనం శీర్షిక, "భవానీపూర్ ప్రచారంలో బిజెపి నాయకుడు దిలీప్ ఘోష్ పై దాడి కేసులో ఎఫ్ఐఆర్ నమోదు తర్వాత 8 మంది అరెస్టు."
27 సెప్టెంబర్ 2021న భవానీపూర్ ఉప ఎన్నికల ప్రచారం చివరి రోజు దిలీప్ ఘోష్‌పై ఈ దాడి జరిగినట్లు పేర్కొన్నారు. ప్రచారం చివరి రోజున రాజకీయ వాతావరణం వేడెక్కడంతో నిరసనలు, తోపులాటలు జరిగాయని దిలీప్ ఘోష్ బాడీ గార్డ్స్ గన్ బైటికి తీశారని రాశారు.
అదే రోజు TV9 Telugu యూట్యూబ్‌లో అప్లోడ్ చేసిన వార్త బులెటిన్లో కూడా వైరల్ వీడియోలో ఉన్న దృశ్యాలను ప్రసారం చేస్తూ ఇది 27 సెప్టెంబర్ 2021న భవానీపూర్‌లో దిలీప్ ఘోష్‌పై జరిగిన దాడిగా పేర్కొన్నారు.
తనపై జరిగిన దాడిని చూపిస్తున్న వీడియోని దిలీప్ ఘోష్ Xలో 27 సెప్టెంబర్ 2021న పోస్టు చేసి ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) వర్గాలు చేసిన దాడి అని ఆరోపించారు. "ఈరోజు భవానీపూర్‌లోని జగబబర్ బజార్‌లో జరిగిన దాడిని టీఎంసీ గూండాలు, దుండగులు నన్ను చంపడానికి చేసిన కుట్ర అని చెప్పవచ్చు. ఇది అధికార పార్టీ యొక్క హేయమైన, భయంకరమైన స్వభావాన్ని హైలైట్ చేస్తుంది. ఈ సంఘటన తర్వాత ఆరోగ్యకరమైన ఎన్నికలు నిర్వహించవచ్చా ??" అన్నారు.
వైరల్ వీడియోలో ఉన్న దృశ్యాలు 2021లో జరిగిన దాడికి సంబంధించినవి అని తేలింది. దాడి చేసింది టీఎంసీ కార్యకర్తలేనని ఘోష్ ఆరోపించారు.
కాబట్టి వైరల్ క్లెయిమ్స్ తప్పు అని న్యూస్‌మీటర్ నిర్ధారించింది.