Hyderabad: ఆర్మీ వాహనాలను కొంత మంది అడ్డుకున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడీయో పశ్చిమ బెంగాల్‌లో జరిగిన ఘటనను చూపిస్తుంది అనే క్లెయిమ్‌లతో షేర్ చేయబడుతోంది.
ఈ వీడియోలలో టోపీలు పెట్టుకున్న కొంత మంది వ్యక్తులు కర్రలతో రోడ్డు మీద ఉన్నట్లు కనిపిస్తుంది. రెండు ఆర్మీ వాహనాలు వెళ్తుండగా వాటిని ముందుకి వెళ్లకుండా అడ్డుకుంటున్నట్లు చూడగలం. రెండవ వాహనంలో గాయపడిన సైనికుడిని తరలిస్తున్నట్లు కనిపిస్తుంది.
ఈ వీడియోని ఫేస్‌బుక్‌లో షేర్ చేసి, క్యాప్షన్‌లో ఈ విధంగా రాశారు:
"రేపు కేంద్రంలో కాంగ్రెస్ వస్తే.. ప్రతి రాష్ట్రంలో ఇదే పరిస్థితి!! మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించండి!!* హిందువులారా మేల్కొనండి..!!! జై హింద్... బెంగాల్‌లో గాయపడిన ఆర్మీ జవాన్‍ని ఆస్పత్రికి తీసుకెళ్తుండగా వాహనం ఆగిపోయింది.. ఇదీ పరిస్థితి. బెంగాల్లో మమతా బెనర్జీ ప్రభుత్వం ఇస్తున్న మద్దతు వల్ల వీళ్ళు సైన్యం మీదే తిరగబడుతున్నారు. ఇక మన పరిస్థితి ఏంటి? హిందువుల కళ్ళు మూసుకుపోయాయి. హిందువుల శత్రువులు హిందువులే!! రేపు కేంద్రంలో BJP ని గెలిపించండి!! లేకపోతే ప్రతి రాష్ట్రంలోనూ హిందువులకి భద్రత ఉండదు? ఇకనైనా వాస్తవాలను గ్రహించి హిందువులు కళ్ళు తెరవకపోతే? తోటి వారి పట్ల కనీస మానవత్వం? కృతజ్ఞతా భావం లేని? ముస్లింల చేతిలో బలికాక తప్పదు!! ఈ మెసేజ్ మరియు వీడియో అందరి మొబైల్ లో ఉండాలి. వీలైనంతమందికి షేర్ చేయండి జైశ్రీరామ్ జయ జయహో భారత్ జై హింద్" (ఆర్కైవ్)
Fact Check
న్యూస్‌మీటర్ ఈ క్లెయిమ్స్ తప్పు అని కనుగొంది. ఈ వీడియోలో కనిపిస్తున్న ఘటన బంగ్లాదేశ్‌లో జరిగినది, పశ్చిమ బెంగాల్‌లో కాదు.
ఈ వీడియో ఇవే క్లెయిమ్‌లతో 2023లో కూడా వైరల్ అయ్యింది అని గుర్తించాం, అప్పటి న్యూస్‌మీటర్ కథనాన్ని ఇక్కడ చూడవచ్చు.
ఈ వీడియో కీ ఫ్రేమ్‌లను పరిశీలించగా, వీడియోలో జరుగుతున్న సంభాషణలు బంగ్లా భాషలో ఉన్నాయని గుర్తించాం. అయితే వీడియోలో కనిపిస్తున్న వాహన నెంబర్ ప్లేట్లు ప్రాంతీయ భాషలో రాసినట్లు గమనించాం. భారతదేశంలో ఈ విధంగా ప్రాంతీయ భాషలలో నెంబర్ ప్లేట్స్ రాయరు.
వీడియోలో ఉన్న సైనికుల యూనిఫామ్‌ల మీద, వాహనం మీద ఉన్న ఒక లోగో కనిపించింది. ఇది బంగ్లాదేశ్ ఆర్మీ లోగో అని గుర్తించాం.
సైనికుల యూనిఫామ్ మీద "AMC" అని ఉండడం గమనించాం, కీవర్డ్ సెర్చ్ చేయగా, బంగ్లాదేశ్‌కు చెందిన ఆర్మీ మెడికల్ కార్ప్స్ అని తేలింది.
వీడియో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఫేస్‌బుక్‌లో 29 మర్చి 2021లో వైరల్ వీడియోని అప్లోడ్ చేసిన పోస్టు దొరికింది. ఈ వీడియో క్యాప్షన్‌లో బాంగ్లాదేశ్ ఆర్మీ మీద హెఫాజత్ ఉగ్రవాదులు చేసిన దాడి అని పేర్కొన్నారు. "అనారోగ్యంతో ఉన్న ఒక ఆర్మీ సభ్యుడిని అంబులెన్స్‌లో CMHకి తీసుకెళ్తున్నారు. వైద్య నివేదిక చూపించిన తర్వాత కూడా వారిని వెళ్లనివ్వలేదు," అని రాశారు.
వైరల్ వీడియో కనీసం 2021 నుండి ఇంటర్నెట్‌లో ఉన్నట్లు గుర్తించాం. కాబట్టి వీడియోలో కనిపిస్తున్న సంఘటన బంగ్లాదేశ్‌లో జరిగింది అని, పశ్చిమ బెంగాల్‌లో కాదు అని తేలింది.
న్యూస్‌మీటర్ వైరల్ క్లెయిమ్స్ తప్పు అని నిర్ధారించింది.