Fact Check: మిలాద్ ఊరేగింపు సందర్భంగా చార్మినార్ సమీపంలోని భాగ్యలక్ష్మి అమ్మవారి మందిరంపై దాడి జరగలేదు

సెప్టెంబర్ 19న ఈద్-ఇ-మిలాద్-ఉన్-నబీ ఊరేగింపు సందర్భంగా సెట్ చేసిన DJ జనరేటర్ నుండి చెలరేగిన మంటలను నియంత్రించడానికి పోలీసులు గుంపును చెదరగొట్టిన వీడియో అది.

By Newsmeter Network  Published on  20 Sep 2024 11:58 AM GMT
Fact Check: మిలాద్ ఊరేగింపు సందర్భంగా చార్మినార్ సమీపంలోని భాగ్యలక్ష్మి  అమ్మవారి మందిరంపై దాడి జరగలేదు
Claim: సెప్టెంబర్ 19, 2024న ఈద్-ఎ-మిలాద్-ఉన్-నబీ ఊరేగింపులో పాల్గొన్న ముస్లింలు హైదరాబాద్‌లోని చార్మినార్ సమీపంలోని భాగ్యలక్ష్మి మందిరంపై దాడి చేశారు.
Fact: హైదరాబాద్ పోలీస్ కమీషనర్, శ్రీ భాగ్యలక్ష్మి మందిర్ ట్రస్టీ శశికళ, ఊరేగింపు ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించలేదని. మంటలు ఆలయానికి వ్యాపించలేదని ధృవీకరించారు.

కొంత మంది బారికేడ్లను దాటకుండా పోలీసులు అడ్డుకుంటూ ఉండడం, గందరగోళం నెలకొనడం వంటి విజువల్స్ తో నిండిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. ఈద్-ఎ-మిలాద్-ఉన్-నబీ ఊరేగింపులో పాల్గొన్న ముస్లింలు హైదరాబాద్ లో విధ్వంసం సృష్టించారంటూ పోస్టులు వైరల్ చేస్తున్నారు. హైదరాబాద్‌లోని చార్మినార్ సమీపంలోని భాగ్యలక్ష్మి మఠం మందిరం దగ్గర బారికేడ్లను దాటి మరీ విధ్వంసం చేశారనే ఆరోపణతో ఫుటేజీని వైరల్ చేస్తున్నారు.

ఒక X వినియోగదారుడు “ఈద్-ఎ-మిలాద్-ఉన్-నబీ ర్యాలీలో పాల్గొన్న వ్యక్తులు హింసాత్మకంగా ప్రవర్తించారు. బారికేడ్‌లను ఛేదించుకుని చార్మినార్‌లోని భాగ్యలక్ష్మి మఠం మందిరానికి సమీపంలోకి దూసుకెళ్లారు. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వ కనుసన్నల్లోనే ఇదంతా జరుగుతోంది. సనాతన సోదరులు ఆ ప్రదేశంలో ఉన్నారు, ఆలయాన్ని కాపాడుతున్నారు!" అంటూ పోస్టు పెట్టారు. (Archive)


మరొక ఎక్స్ వినియోగదారుడు “It’s clear the Congress government will fail to protect our #BhagyalakshmiTemple. Hindus must now march in a powerful and peaceful protest to defend our heritage.” అంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ పోస్టు పెట్టాడు. కాంగ్రెస్ ప్రభుత్వం భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని రక్షించడంలో విఫలమైందంటూ అందులో ఆరోపించారు. (Archive)

Fact Check

NewsMeter వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదని గుర్తించింది. సెప్టెంబర్ 19న ఈద్-ఇ-మిలాద్-ఉన్-నబీ ఊరేగింపు సందర్భంగా సెట్ చేసిన DJ జనరేటర్ నుండి చెలరేగిన మంటలను నియంత్రించడానికి పోలీసులు గుంపును చెదరగొట్టిన వీడియో అది.

శ్రీ భాగ్యలక్ష్మి మందిర్ ధర్మకర్తలలో ఒకరైన శశికళ సౌత్ చెక్ తో మాట్లాడుతూ, ఊరేగింపు సమయంలో ఆలయ ప్రాంగణం మీద ఎవరూ ఎలాంటి దాడి చేయలేదని, అలాగే ఆలయానికి మంటలు వ్యాపించలేదని స్పష్టం చేశారు. ఊరేగింపు సమయంలో కొందరు వ్యక్తులు కాల్చిన బాణసంచాకు మంటలు వ్యాపించిన కారణంగా DJ జనరేటర్‌లో మంటలు చెలరేగాయి” అని ఆమె వివరించారు.

సెప్టెంబరు 20న ఆలయం సురక్షితంగా ఉందని ధృవీకరిస్తూ ఆలయంలో ఉదయం ప్రార్థనల వీడియోను కూడా ఆమె పంచుకున్నారు.

పోలీస్ కమిషనర్ సి.వి. ఆనంద్, సౌత్ చెక్ తో మాట్లాడుతూ, “ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు, ర్యాలీ విజయవంతంగా సాగింది. అగ్ని ప్రమాదంలో ఎవరూ గాయపడకుండా చూసేందుకు, ప్రధానంగా DJ దగ్గర చెలరేగిన మంటలను అదుపు చేసేందుకు పోలీసులు గుంపును చెదరగొట్టాల్సి వచ్చింది." అని తెలిపారు.

C.V. ఆనంద్ X పోస్ట్‌లో, పండుగలు శాంతియుతంగా ముగిశాయని వివరించారు. "మిలాద్ బందోబస్తును ముగించే సమయానికి, తిరుగు ప్రయాణాలలో ఎటువంటి ఘర్షణలు జరగకుండా ఉండేందుకు రాత్రంతా ఎస్కార్టింగ్, వీధుల్లో గస్తీ తిరుగుతూ తెల్లవారుజాము అయింది. రెండు పండుగలకు సంబంధించిన ఊరేగింపులు శాంతియుతంగా ముగిశాయి. హైదరాబాద్ సంస్కృతిని, మత సామరస్యాన్ని ప్రదర్శించారు" అని తెలిపారు.

"గత 15 రోజులుగా శాంతిభద్రతల పరిరక్షణలో భాగమైన పోలీసులకు, సహకరించిన ఇతర విభాగాలకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నగర పోలీసు యంత్రాంగం మొత్తం అలసిపోయింది. కొంత విశ్రాంతి అవసరం" అని ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

ఆ రాత్రి ఘటనాస్థలిని సందర్శించిన హైదరాబాద్‌కు చెందిన జర్నలిస్టు ఆసిఫ్ యార్ ఖాన్ కూడా ఆలయంపై దాడి జరగలేదని ధృవీకరించారు. “మంటలను అదుపు చేయడానికి ప్రజలు బారికేడ్లను దాటకుండా పోలీసులు అడ్డుకున్నట్లు వీడియో చూపిస్తుంది." అని తెలిపారు.

సియాసత్ డైలీ సెప్టెంబర్ 19న ఈ ఘటనకు సంబంధించిన నివేదికను ప్రచురించింది. నివేదిక ప్రకారం, మిలాద్ ఊరేగింపు సందర్భంగా DJ, సౌండ్ సిస్టమ్‌లో మంటలు చెలరేగడంతో గందరగోళం ఏర్పడింది. కొందరు వ్యక్తులు బారికేడ్లను దాటేందుకు ప్రయత్నించగా, పోలీసులు వారిని చెదరగొట్టారని తెలిపారు.


కాబట్టి, మిలాద్ ఊరేగింపు సందర్భంగా మంటలు శ్రీ భాగ్య లక్ష్మీ మందిరానికి వ్యాపించాయని జరుగుతున్న ప్రచారం అవాస్తవమని మేము నిర్ధారించాము.

Claim Review:సెప్టెంబర్ 19, 2024న ఈద్-ఎ-మిలాద్-ఉన్-నబీ ఊరేగింపులో పాల్గొన్న ముస్లింలు హైదరాబాద్‌లోని చార్మినార్ సమీపంలోని భాగ్యలక్ష్మి మందిరంపై దాడి చేశారు.
Claimed By:X users
Claim Reviewed By:NewsMeter
Claim Source:X
Claim Fact Check:False
Fact:హైదరాబాద్ పోలీస్ కమీషనర్, శ్రీ భాగ్యలక్ష్మి మందిర్ ట్రస్టీ శశికళ, ఊరేగింపు ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించలేదని. మంటలు ఆలయానికి వ్యాపించలేదని ధృవీకరించారు.
Next Story