కొరటాల శివ దర్శకత్వం లో జూనియర్ ఎన్టీఆర్ మరియు జాన్వీ కపూర్ నటించిన దేవర సినిమా, శుక్రవారం నాడు, సెప్టెంబర్ 27, 2024 న విడుదల అయ్యింది.
ఈ సందర్భంలో సామాజిక మాధ్యమాలలో ఒక 14 సెకెన్ల వీడియో వైరల్ అవుతుంది. ఇందులో జూనియర్ ఎన్టీఆర్ కటౌట్ మంటలలో కాలిపోవడం కనిపిస్తుంది. దీనిని షేర్ చేసి, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు సినిమా బాగా లేకపోవడం వలన హైదరాబాద్ లో ఒక థియేటర్ లో తన కటౌట్ తగలపెట్టారు అని రాసుకొచ్చరు.
ఒక ఎక్స్ వినియోగదారుడు, తన పోస్టులో, “దేవర సినిమా మంచిగా లేకపోవడం అండ్ పూర్ టాక్ రావడం వల్ల జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు హైదరాబాద్ లోని ఒక థియేటర్ లో ఎన్టీఆర్ కటౌట్ ను తగలబెట్టారు.” ఇలాంటి మరిన్ని పోస్టుల ఆర్కైవ్ ఇక్కడ, మరియు ఇక్కడ చూడవచ్చు.
Fact Check
కానీ వైరల్ అవుతున్న వీడియో లో ఎలాంటి నిజమూ లేదు.
వైరల్ వీడియో లో కీ ఫ్రేమ్ ను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, మా ఇండియా టుడే ఛానల్ తమ యూట్యూబ్ లో షేర్ చేసిన వీడియో ఒకటి లభించింది. ఈ వీడియోను, సెప్టెంబర్ 27, 2024 నాడు షేర్ చేశారు. దీనికి శీర్షిక గా, హైదరాబాద్ లోని సుదర్శన్ థియేటర్ లో దేవర సినిమా సంబరాలు మంటలు చెలరేగినట్లు రాసుకొచ్చారు.
ఇక్కడ వీడియోలో జూనియర్ ఎన్టీఆర్ కటౌట్ ముందు టపాసులు నెల మీద పేర్చడం దగ్గర నుంచి దానికి నిప్పు వెలిగించటం, ఆ తర్వాత టపాసుల నుంచి నిప్పు రవ్వలు ఎగసి పడి, జూనియర్ ఎన్టీఆర్ కట్ అవుట్ మీద ఉన్న దండ నుండి మంట మొదలవ్వటం మనం చూడవచ్చు. దీని ద్వారా, ఇది అభిమానులు కావాలని చేసిన పని కాదు అని తెలుసుకోవచ్చు.
పైగా ఈ విషయం గురించి అనేక వార్తా కథనాలు కూడా మనకు లభించాయి. టైమ్స్ అఫ్ ఇండియా, సియాసత్ మరియు ఇతర వార్తా కథనాలు అదే విధమైన వివరాలను సమకూర్చాయి. వీటి ప్రకారం, జూనియర్ ఎన్టీఆర్ కట్ అవుట్ కి మంటలు చెలరేగడం హైదరాబాద్ లోని సుదర్శన్ థియేటర్ లో చోటు చేసుకుంది అని, అభిమానులు సినిమా విడుదల సందర్భంగా సంబరాలు జరుపుకుంటున్న సమయం లో టపాసులు పేల్చడం జరిగింది అని, అదే సమయం లో నిప్పు రవ్వలు పడటం వలన కట్ అవుట్ కి వేసిన దండ కు మంటలు అంటుకుని కట్ అవుట్ పూర్తిగా దఘ్నం అయింది అని రాసి ఉంది.
కట్ అవుట్ లోని ప్లాస్టిక్ పూలు మంటకు దారితీసాయి
ఈ విషయం గురించి నిర్ధారణ కోసం, న్యూస్ మీటర్, చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ ను సంప్రదించింది.
చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఏ సీతయ్య వివరిస్తూ అభిమానులు కట్ అవుట్ ను తగలబెట్టారు అనే విషయం లో వాస్తవం లేదు అని తెలిపారు. ఈ సంఘటన గురించి మరింత వివరిస్తూ, “ఆ సంఘటన అభిమానులు టపాసులు పేల్చిన సందర్భంలో నిప్పు రవ్వ తగిలి జరిగింది. జూనియర్ ఎన్టీఆర్ కట్ అవుట్ వేసిన పూల మాల కి నిప్పు రవ్వ తగిలి తగలబడింది. ఈ పూల మాల లో ప్లాస్టిక్ పువ్వులు ఉండటం వలన మంట తొందరగా అంటుకుంది,” అని తెలియజేసారు. పైగా, ఈ సంఘటనకు సంబంధించి ఎటువంటి కేసు నమోదు అవ్వలేదు అని కూడా ఆయన మాకు తెలిపారు.
దీని ఆధారంగా, వైరల్ అవుతున్న వీడియో తప్పు దారి పట్టే విధంగా ఉంది అని మనం నిర్ధారించవచ్చు. దేవర సినిమా బాగా లేకపోవడం వల ఎన్టీఆర్ కటౌట్ తగలపెట్టారు అని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్ట్ లో వాస్తవం లేదు.