హైదరాబాద్: 2025 మే 7, బుధవారం నాడు భారత సాయుధ దళాలు 'ఆపరేషన్ సింధూర్' పేరిట పాకిస్థాన్, పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ (PoJK)లోని ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేశాయని ప్రభుత్వం ప్రకటించింది. ఈ దాడులు లష్కర్-ఎ-తోయిబా (LeT), జైష్-ఎ-మహ్మద్ (JeM), హిజ్బుల్ ముజాహిదీన్ వంటి నిషేధిత ఉగ్రవాద సంస్థల శిబిరాలపైనే జరిగాయని, పాక్ సైనిక స్థావరాలను తాకలేదని అధికారులు తెలిపారు.
ఈ సమయంలో, Xలో ఒక యూజర్ (@VijayaReddy_R) వీడియో పోస్ట్ చేస్తూ, "పరుగులు తీస్తున్న పాకిస్తాన్ ఉగ్రవాదులు. ఆపరేషన్ సిందూర్ లో పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థల పై విరుచుకుపడుతున్న భారత సైన్యం" అని రాశారు.(Archive)
అదే వీడియోను @RTVnewsnetwork అనే X ఖాతా కూడా షేర్ చేస్తూ, "ఆపరేషన్ సింధూర్' తో పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరి.అర్థరాత్రి 1.44 గంటలకు మిస్సైళ్లతో దాడి. 9 స్థావరాలపై భారత్ దాడి చేసినట్లు సమాచారం" అని రాసింది.(Archive)
వీడియోలో రాత్రి సమయంలో పెద్ద పేలుళ్లు, మంటలు, ఒక భవనం వెనుక భాగంలో కనిపిస్తాయి. ముందు భాగంలో తెల్లటి టెంట్లు, చెట్టు, పేలుళ్ల నుంచి పరుగెత్తుతున్న వ్యక్తులను చూడవచ్చు.
ఫ్యాక్ట్ చెక్
ఈ వాదనను న్యూస్‌మీటర్ పరిశీలించగా, అది తప్పని తేలింది. ఈ వీడియో భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ లో పాకిస్థాన్‌లో దాడి చేసినది కాదు. ఇది 2023 నవంబర్‌లో గాజాలోని ఇండోనేషియన్ హాస్పిటల్‌పై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిని చూపిస్తుంది. ఈ వీడియోను మొదట అల్ జజీరా ప్రసారం చేసింది.
వీడియోలో అల్ జజీరా లోగో, 'InShOT' వాటర్‌మార్క్ కనిపించాయి. ఇది InShot యాప్‌తో ఎడిట్ చేయబడినట్లు సూచిస్తుంది.
వీడియో నుంచి ఒక కీలక ఫ్రేమ్‌ను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, 2023 నవంబర్ 10న 'ది సన్' పత్రికలో ప్రచురితమైన కథనం లభించింది
ఈ కథనం గాజాలోని ఇండోనేషియన్ హాస్పిటల్‌పై ఇజ్రాయెల్ దాడిని వివరిస్తూ, అల్ జజీరా అందించిన అదే వీడియోను చూపించింది. వీడియోలో పేలుళ్లు, తెల్లటి టెంట్లు, పరుగెత్తుతున్న వ్యక్తులు స్పష్టంగా కనిపిస్తాయి.
అలాగే, అల్ జజీరా ఇంగ్లీష్ X ఖాతా (@AJEnglish) 2023 నవంబర్ 9న ఇదే వీడియోను షేర్ చేస్తూ, ఇది గాజాలోని ఇండోనేషియన్ హాస్పిటల్‌పై ఇజ్రాయెల్ దాడి అని పేర్కొంది.
వైరల్ వీడియో, అల్ జజీరా వీడియోలు ఒకే సంఘటనను చూపిస్తాయి, కానీ కొద్దిగా భిన్నమైన కోణాల నుంచి రికార్డ్ చేసినట్లు ఉన్నాయి. వైరల్ వీడియోలో 'InShOT' వాటర్‌మార్క్ ఉండటం వల్ల ఇది ఎడిట్ చేయబడింది. అయితే, తెల్లటి గుడారాలు, పేలుడు, పరిగెత్తుతున్న వ్యక్తి - అల్ జజీరా ఫుటేజ్‌కి అనుగుణంగా ఉన్నాయి..
ఇక్కడ ఒక పోలిక ఉంది:
వైరల్ వీడియో ఆఆపరేషన్ సింధూర్ లో భారత సైన్యం పాక్ ఉగ్రవాదులపై దాడి చేస్తున్నట్లు చూపించడం పూర్తిగా తప్పు. ఇది 2023 నవంబర్‌లో గాజాలోని ఇండోనేషియన్ హాస్పిటల్‌పై ఇజ్రాయెల్ జరిపిన దాడికి సంబంధించిన అల్ జజీరా వీడియో. ఈ వీడియోకు భారత సైన్యం లేదా ఆపరేషన్ సింధూర్ తో ఎలాంటి సంబంధం లేదు.