Fact Check: వీసా రద్దు తర్వాత పారిపోతున్న పాకిస్తాన్ జనం? లేదు, నిజం ఇక్కడ తెలుసుకోండి
భారత ప్రభుత్వం వీసాలు రద్దు చేసిన తర్వాత పాకిస్తాన్ జనం పారిపోతున్నారనే క్లెయిమ్‌లతో ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
By K Sherly Sharon
Claim:వీసా రద్దు తర్వాత పారిపోతున్న పాకిస్తాన్ పౌరులను చూపిస్తున్న వీడియో.
Fact:లేదు, ఇది ఫిబ్రవరి 1,2 తేదీల్లో నవీ ముంబైలో జరిగిన ఖార్ఘర్ ఇజ్తేమాకు సంబంధించిన వీడియో.
Hyderabad: 2025 ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్రవాద దాడికి పాల్పడిన ఉగ్రవాదులకు పాకిస్తాన్ మద్దతు ఇస్తోందని ఆరోపిస్తూ భారత ప్రభుత్వం తీవ్రగా స్పందించింది. దాడి జరిగిన రెండు రోజుల తర్వాత, పాకిస్తాన్ పౌరులకు భారతదేశం జారీ చేసిన అన్ని చెల్లుబాటు అయ్యే వీసాలను రద్దు చేసినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది.
దీని తర్వాత, పాకిస్తాన్ పౌరులు పారిపోతున్నారు అనే క్లెయిమ్‌లతో ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. "భారత ప్రభుత్వం వీసాలు రద్దు చేసిన 48 గంటల్లో దేశం వదిలి వెళ్ళమనడంతో ఎలా పరుగులు తీస్తున్నారో పాకిస్తాన్ వాళ్ళు" అని వీడియోలో రాశారు.
ఈ వీడియోను ఇంస్టాగ్రామ్‌లో షేర్ చేశారు. (ఆర్కైవ్)
ఇవే క్లెయిమ్స్ చేస్తున్న పోస్ట్‌లను ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. (ఆర్కైవ్ 1, ఆర్కైవ్ 2, ఆర్కైవ్ 3)
Fact Check
న్యూస్‌మీటర్ ఈ క్లెయిమ్ తప్పు అని కనుగొంది. ఈ వీడియో నవీ ముంబైలో జరిగిన ఖార్ఘర్ ఇజ్తేమాకు సంబంధించినది. భారత ప్రభుత్వం ఇటీవల వీసాలను రద్దు చేసిన తర్వాత పాకిస్తాన్ పౌరులు పారిపోవడాన్ని ఈ వీడియో చూపించడం లేదు.
భారత ప్రభుత్వం వీసా రద్దు చేశాక పాకిస్తాన్ పౌరులు పారిపోతున్నారు అని వైరల్ వీడియోని చూపిస్తున్న వార్త కథనాలు ఏవి దొరకలేదు.
వైరల్ వీడియో కీ ఫ్రేమ్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ ద్వారా, వైరల్ వీడియోనే చూపిస్తున్న మరికొన్ని సోషల్ మీడియా పోస్టులు కనిపించాయి. అయితే ఈ పోస్టుల పైన '3/2/2025 ముంబై... ఖార్ఘర్ ఇజ్తేమా' అని రాసి ఉంది. ఈ వీడియోలు 2025 ఫిబ్రవరి 5 నుండి ఫిబ్రవరి 10 మధ్యలో పోస్ట్ చేయబడినట్లు కనిపిస్తుంది. ఈ పోస్టులను ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. (ఆర్కైవ్ 1, ఆర్కైవ్ 2, ఆర్కైవ్ 3)
కీ వర్డ్ సెర్చ్ ద్వారా 'chal_mumbai' అనే ఇంస్టాగ్రామ్ అకౌంట్ పోస్ట్ చేసిన వీడియో దొరికింది. ఈ వీడియోలో కూడా వైరల్ వీడియోలో కనిపించినట్లు భారీ జనం ఓ రైల్వే స్టేషన్లో కనిపిస్తున్నారు, వారిలో చాలా మంది టోపీలు వేసుకొని ఉన్నారు. ఈ వీడియో మీద "2/2/2025... ఖార్ఘర్ ఇజ్తేమా ముగింపులో, భారీ జనం... ఖార్ఘర్ స్టేషన్, నవీ ముంబై" అని రాశారు. (ఆర్కైవ్)
ఖార్ఘర్ ఇజ్తేమాకు సంబంధించిన మరో ఇంస్టాగ్రామ్ వీడియో కూడా దొరికింది.
ఇదే వీడియో News18 LokmatTV యూట్యూబ్ ఛానెల్లో అప్లోడ్ చేయబడింది. ముంబైలోని ఖార్ఘర్ స్టేషన్లో జరిగినట్లు పేర్కొన్నారు.
Lokmat Times 2025 ఫిబ్రవరి 1 న ప్రచురించిన "నవీ ముంబై ట్రాఫిక్ అప్‌డేట్: ఖార్ఘర్‌లోని ఇజ్తేమాకు ప్రవేశం లేదు, పార్కింగ్ లేదు; వివరాలను తనిఖీ చేయండి" అనే కథనం దొరికింది. ఫిబ్రవరి 1, 2న జరిగే మతపరమైన సమావేశం (ఇజ్తేమా) సందర్భంగా ఖార్ఘర్‌లో ట్రాఫిక్ సజావుగా సాగేలా చూసేందుకు నవీ ముంబై ట్రాఫిక్ పోలీసులు చేసిన ప్రకటనను ఈ కథనం చూపిస్తోంది. ఖార్ఘర్ ఇజ్తేమా 2025 ఫిబ్రవరి 1, 2 తేదీల్లో జరిగినట్లు అర్ధం అవుతోంది.
Galli News అనే వార్త వెబ్సైటులో జనవరి 31న ప్రచురింపబడిన కథనం దొరికింది. నవీ ముంబైలోని ఖార్ఘర్ ప్రాంతంలో ఈ వారం ఆఖర్లో, అంటే జనవరి 31, ఫిబ్రవరి 1, 2 తేదీల్లో వైభవంగా మతపరమైన సమావేశం జరగబోతోంది, లక్షలాది మంది ఇందులో పాల్గొంటారు అని రాశారు.
Ambur Express అనే ఫేస్‌బుక్ అకౌంట్ ఖార్ఘర్ ఇజ్తేమా గురించి ఒక వీడియోని షేర్ చేసి ఈ విధంగా రాశారు, "ముంబై ఇజ్తేమా 2025 మహారాష్ట్రలోని ఖార్ఘర్‌లో ప్రారంభమైంది - ఒక గొప్ప ఆధ్యాత్మిక సమావేశం. చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఇజ్తేమా ముంబై 2025 మహారాష్ట్రలోని ఖార్ఘర్‌లో జరుగుతోంది, ఆధ్యాత్మిక సమావేశం కోసం వేలాది మందిని ఒకచోట చేర్చింది. తబ్లిఘి జమాత్ నిర్వహించిన ఈ కార్యక్రమం విశ్వాసం, ఐక్యత. మతపరమైన బోధనలపై దృష్టి పెడుతుంది. దేశవ్యాప్తంగా భక్తులు దువా, నమాజ్, ఇస్లామిక్ చర్చలలో పాల్గొనడానికి గుమిగూడారు."
లేదు, ఇది ఫిబ్రవరి 1,2 తేదీల్లో నవీ ముంబైలో జరిగిన ఖార్ఘర్ ఇజ్తేమాకు సంబంధించిన వీడియో.
వైరల్ వీడియోలో ఉన్న ప్రాంతాన్ని స్వతంత్రంగా ధృవీకరించలేకపోయాము. అయితే ఈ వీడియో నవీ ముంబైలో జరిగిన ఖార్ఘర్ ఇజ్తేమాకు సంబంధించినదని అర్ధం అవుతోంది. భారత ప్రభుత్వం ఇటీవల వీసాలను రద్దు చేసిన తర్వాత పాకిస్తాన్ పౌరులు పారిపోవడాన్ని ఈ వీడియో చూపించడం లేదు. కాబట్టి, వైరల్ క్లెయిమ్స్ తప్పు అని న్యూస్‌మీటర్ నిర్ధారించింది.