Fact Check : పవన్ కళ్యాణ్ క్రిస్టియన్ అని డిక్లరేషన్ ఇచ్చాడు అనే క్లెయిమ్ లో వాస్తవం లేదు
వైరల్ అవుతున్న పోస్ట్ తప్పుదారి పట్టించే విధంగా ఉంది, ఎందుకంటే ఆ వీడియో వాస్తవమైనప్పటికీ డిక్లరేషన్ పై పవన్ కళ్యాణ్ సంతకం పెట్టింది తన కోసం కాదు, తన కూతురు కోసం.
By Newsmeter Network Published on 8 Oct 2024 12:28 PM ISTClaim: పవన్ కళ్యాణ్ డిక్లరేషన్ మీద సంతకం పెట్టాడు అంటే క్రిస్టియన్ అని ఒప్పుకున్నట్టు.
Fact: పవన్ కళ్యాణ్ తన చిన్న కుమార్తె క్రిస్టియన్ అని డిక్లరేషన్ ఇచ్చాడు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, జనసేన పార్టీ ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ ముఖ్యమంత్రిగా ప్రభుత్వం ఏర్పడడం జరిగింది. నారా చంద్రబాబు నాయుడు ఒక పార్టీ మీటింగ్ లో మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి హయాంలో తిరుపతి లడ్డు అపవిత్రం అయిందని, అక్కడ వాడే నెయ్యిలో జంతు కొవ్వు కలిసి కల్తీ జరిగిందని ఆరోపించారు.
ఈ క్రమంలో కొంత మంది రాజకీయ నాయకులు, హిందువులు నుంచి నిరసనలు వెల్లువెత్తాయి. ఈ నేపధ్యం లో పవన్ కళ్యాణ్, పదకొండు రోజుల ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టడం జరిగింది. ఆ దీక్ష ముగింపు తిరుపతి లో చేశారు. పవన్ కళ్యాణ్ నడక మార్గం ద్వారకా తిరుపతి నుంచి వెంకటేశ్వర స్వామి కొలువైవున్న తిరుమల వెళ్ళాడు. ఈ క్రమం లో పవన్ కళ్యాణ్ పిల్లలు కూడా వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం జరిగింది.
ఈ నేపథ్యంలో సామాజిక మాధ్యమాలలో ఒక నిమిషం వ్యవధి ఉన్న వీడియో వైరల్ అవుతుంది. ఇందులో కాషాయ వస్త్రాలు ధరించి ఉన్న పవన్ కళ్యాణ్ ను మరియు తన ఇద్దరు కూతుర్లను మనం చూడవచ్చు. ఈ వీడియోలో కొంతమంది ఒక ఫారంను ఫిల్ చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ సంతకం చేయడం మనం చూడవచ్చు ఆ తర్వాత తన కుమార్తె పలీనా అంజని కొణిదెల సంతకం చేయడం మనం చూడవచ్చు.
ఒక X వినియోగదారుడు ఈ వీడియోని షేర్ చేసి, తన పోస్ట్ లో, “డిక్లరేషన్ మీద సంతకం పెట్టాడు అంటే క్రిస్టియన్ అని ఒప్పుకున్నట్టు. క్రిస్టియన్స్ దీక్షలు చేస్తారా. క్రిస్టియన్స్ సనాతన ధర్మ రక్షకులు అవుతారా?” అని రాసుకొచ్చాడు ఇలాంటి. ఇలాంటి మరిన్ని పోస్టుల ఆర్కైవ్ ఇక్కడ, మరియు ఇక్కడ చూడవచ్చు.
Fact Check
కానీ వైరల్ అవుతున్న పోస్ట్ తప్పుదారి పట్టించే విధంగా ఉంది.
వైరల్ వీడియో లో కీ ఫ్రేమ్ ను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, మాకు NDTV వెబ్సైట్ లో ప్రచురితమైన ఒక కథనం లభించింది, ఇక్కడ వైరల్ వీడియో మాదిరి ఫొటోలు ప్రచురించి ఉన్నాయి. ఈ కథనం ప్రకారం పవన్ కళ్యాణ్ చిన్న కుమార్తె, పలీనా అంజని పర మతస్థురాలు అవడం చేత టీటీడీ కట్టుబాటు ప్రకారం డిక్లరేషన్ సంతకం చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ కు మూడో భార్య అన్న లేజ్హ్నేవ పర మతస్థురాలు, ఈవిడకు కలిగిన రెండవ సంతానం పలీనా అంజని కొణిదెల. కుమార్తె మైనర్ అయిన కారణం వలన పవన్ కళ్యాణ్ సంతకం చేయడం జరిగింది అని రాసుకొచ్చారు. NDTV కథనం లో గుడి ఆచారం ప్రకారం పర మతస్థురాలు మరియు పరదేశస్థులు ఖచ్చితముగా, తమకు తిరుమల వెంకటేశ్వర స్వామి పైన నమ్మకం ఉంది అని డిక్లరేషన్ ఇవ్వాలి. దీనిలో భాగంగా మైనర్ అయిన కూతురు పలీనా అంజని కొణిదెల తరుపున పవన్ కళ్యాణ్ సంతకం చేశారు అని పేర్కొంది.
ఇదే విషయం గురించి మరిన్ని వార్తా కథనాలు కూడా మాకు లభించాయి, TOI, Deccan Chronicle, TV 9 కూడా ఇలాంటి వివరాలనే పొందుపరిచారు. ఇంకాస్త పరిశోధించగా, పవన్ కళ్యాణ్ తన కూతురు తరపున సంతకం చేయడం జరిగింది, ఆయనే స్వయంగా ప్రస్తావించిన వీడియో కూడా లభించింది. ఈ వీడియోలో 0:20 సెకన్ల వద్ద పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, తన రష్యన్ ఆర్థోడాక్స్ భార్య వలన జన్మించిన కూతురు, ఇటీవల కాలంలో తిరుపతి వెళ్లగా, తనతో కూడా డిక్లరేషన్ పై సంతకం చేయించి తన ‘చిత్త శుద్ధి’ చూపించినట్టు పవన్ ప్రస్తావించాడు.
ఇదే విషయం గురించి జన సేన పార్టీ అధికారిక ఎక్స్ అకౌంట్ కూడా ఫొటోలను జతపరిచి పవన్ కళ్యాణ్ తన మైనర్ కుమార్తె తరపున డిక్లరేషన్ సంతకం చేసినట్టు రాసుకొచ్చారు.
ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి చిన్న కుమార్తె పలీనా అంజని కొణిదెల తిరుమల శ్రీవారి దర్శనానికి డిక్లరేషన్ ఇచ్చారు. టిటిడి ఉద్యోగులు తీసుకువచ్చిన డిక్లరేషన్ పత్రాలపై సంతకాలు చేశారు. పలీనా అంజని మైనర్ అయినందున తండ్రిగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ పత్రాలపై సంతకాలు చేశారు.… pic.twitter.com/Lg8zUEfl6l
— JanaSena Party (@JanaSenaParty) October 2, 2024
దీని ఆధారంగా, వైరల్ అవుతున్న వీడియో తప్పు దారి పట్టే విధంగా ఉంది అని మనం నిర్ధారించవచ్చు, ఎందుకంటే, ఈ వీడియో వాస్తవం అయినప్పటికీ దానికి జతపరిచిన పోస్ట్ తప్పు దారి పట్టే విధంగా ఉంది. పవన్ కళ్యాణ్ తన కుమార్తె మైనర్ అవటం వలన చేసిన సంతకాన్ని, తానే క్రిస్టియన్ అన్నట్టుగా డిక్లరేషన్ ఇచ్చినట్టుగా షేర్ చేశారు.