హైదరాబాద్ : నటుడు నుంచి రాజకీయ నేతగా మారిన పవన్ కల్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయనకు అపారమైన అభిమానగణం ఉంది. ఆయన్ను వారు దేవుడిలా చూస్తారు. ఆయన చేసే ప్రతి చిన్న పని కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
ఈ నేపథ్యంలో, పవన్ కల్యాణ్‌ను పోలి ఉన్న ఒక వ్యక్తి ‘అరకు కాఫీ’ అని ముద్రించిన టీషర్ట్ ధరించి కాఫీ కప్ పట్టుకుని ఉన్న చిత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కప్ కారణంగా ముఖం సరిగ్గా కనిపించకపోవడం లేదు.
ఒక ఫేస్‌బుక్ యూజర్ ఈ చిత్రాన్ని షేర్ చేస్తూ, “ఒక్క యాడ్ చేస్తే కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది, కానీ వ్యవస్థ బాగుంటే అన్ని బాగుంటాయ్ అని.. ఒక్కరోజులో అరకు కాఫీకి ఎప్పుడు రానంతగా పబ్లిసిటీ వస్తుంది” అని క్యాప్షన్ ఇచ్చారు. (Archive)
ఇలాంటివే మరికొన్ని పోస్టులు ఇక్కడ, ఇక్కడ ఇంకా ఇక్కడ ఉన్నాయి. (Archive link1, Archive link2, Archive link3)
ఫ్యాక్ట్ చెక్
న్యూస్‌మీటర్ ఈ క్లెయిమ్ తప్పు అని కనుగొంది. ఈ చిత్రం AI సాయంతో తయారు చేయబడింది.
సంబంధిత కీవర్డ్స్‌ను ఉపయోగించి పవన్ కల్యాణ్ అరకు కాఫీకి ప్రచారం చేస్తున్నట్లు చూపించే వార్తలను వెతికాం, కానీ ఎలాంటి సమాచారం దొరకలేదు.
వైరల్ చిత్రాన్ని జాగ్రత్తగా పరిశీలించగా, AI-చిత్రాలకు సాధారణంగా కనిపించే కొన్ని లోపాలు కనిపించాయి. ఎడమ చేతి, కాఫీ కప్ హ్యాండిల్ కలయిక సహజంగా అనిపించలేదు. అలాగే కప్ పట్టుకున్న తీరు తేడాగా అనిపించింది. ఇంకా, చిత్రంలో కుడివైపు దిగువన ‘గ్రోక్’ అనే వాటర్‌మార్క్, లోగో కనిపించాయి. ‘గ్రోక్ ఇమేజ్ జనరేటర్’ అనే AI సాధనం టెక్స్ట్ ఇన్‌పుట్‌ల నుండి ఆర్ట్ ఇంకా విజువల్స్‌ను సృష్టించేందుకు ప్రత్యేకంగా రూపొందించబడింది.
ఈ చిత్రాన్ని AI డిటెక్షన్ టూల్ Hive Moderation ఉపయోగించి విశ్లేషించగా, 98.2 శాతం AI-జనరేట్ చేసిన చిత్రంగా నిర్ధారణ అయింది.
2024 అక్టోబర్ 9న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అధికారిక సోషల్ మీడియా ఖాతా షేర్ చేసిన పోస్టును న్యూస్‌మీటర్ గుర్తించింది. ఆ పోస్ట్‌లో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన కార్యాలయంలో గిరిజన సహకార సంఘం (GCC) నిర్వహించిన ప్రదర్శనను సందర్శించినట్లు పేర్కొన్నారు. ఈ ప్రదర్శనలో కుంకుడు కాయలు, నన్నారి, కరకాయలు, తేనె, కాఫీ బీన్స్ వంటి 50కి పైగా గిరిజన ఉత్పత్తులను ప్రదర్శించారు.
ఆ పోస్ట్‌లో పవన్ కల్యాణ్ స్టాళ్లను పరిశీలిస్తున్న ఫోటోలు ఉన్నాయి. ఆ చిత్రాల్లో ఒకదానిలో ఆయన అరకు కాఫీ ప్యాకెట్‌ను పట్టుకుని ఉన్నారు. కానీ, ఎలాంటి ప్రత్యేక ప్రచార కార్యక్రమం లేదా వైరల్ చిత్రం గురించి సమాచారం కనిపించలేదు.
ఇక పవన్ కల్యాణ్ అధికారిక సోషల్ మీడియా ఖాతాలను కూడా పరిశీలించగా, వైరల్ క్లెయిమ్‌కు మద్దతు ఇస్తూ ఎలాంటి పోస్టులు లేదా చిత్రాలు లభించలేదు.
కాబట్టి, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అరకు కాఫీకి ప్రచారం చేస్తున్నారని పేర్కొన్న వైరల్ చిత్రం AI సాయంతో తయారు చేయబడిందని నిర్ధారణ అయింది.