Fact Check: వైర‌ల‌వుతున్న ఫొటోలు అమెరికా వెనక్కి పంపిస్తున్న అక్రమ భారతీయ వలసదారులవా? ఇక్కడ నిజం తెలుసుకోండి

అమెరికా వెనక్కి పంపిస్తున్న భారతీయ అక్రమ వలసదారులు అంటూ అనేక ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

By M Ramesh Naik  Published on  6 Feb 2025 6:53 PM IST
Several photos purportedly showing Indian illegal migrants deported from the United States are going viral on social media.
Claim: ఈ ఫొటోలు అమెరికా నుండి డిపోర్ట్ చేసిన భారతీయ అక్రమ వలసదారులను చూపిస్తున్నాయి.
Fact: ఈ క్లెయిమ్ తప్పు. ఈ ఫొటోలు భారతీయ అక్రమ వలసదారులతో సంబంధం లేనివి.

హైదరాబాద్: రెండోసారి అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత, డొనాల్డ్ ట్రంప్ అమెరికాలో అక్రమ వలసదారులపై కఠిన చర్యలు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో, అమెరికా నుంచి డిపోర్ట్ అయిన భారతీయులను మోసుకెళ్లిన C-17 మిలిటరీ విమానం అమృత్‌సర్‌లో ల్యాండ్ అయ్యింది. ఈ విమానం టెక్సాస్‌లోని సాన్ ఆంటోనియో నుంచి బయలుదేరి, పంజాబ్‌లోని శ్రీ గురు రాందాస్ జీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ చేరుకుంది. అమెరికాలో అక్రమంగా ప్రవేశించిన భారతీయులను డిపోర్ట్ చేసే విధానం మీద భారత్‌లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. మొదటి విడతలో 104 మంది భారతీయులను చేతులు, కాళ్లు గొలుసులతో కట్టేసి, దాదాపు ఒక రోజు పాటు సాగిన విమాన ప్రయాణంలో పంపించారు.

ఈ పరిణామాల మధ్య, కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిని భారతీయ అక్రమ వలసదారులను అమెరికా నుంచి డిపోర్ట్ చేస్తున్నట్లు పేర్కొంటూ షేర్ చేస్తున్నారు.

ఫొటో 1: ఓ ఫేస్ బుక్ యూజర్ ఈ ఫొటోను షేర్ చేస్తూ, "చేతులకు సంకెళ్లు వేసి మెడలు వంచి అమెరికా నుండి భారతీయులను వెనక్కి పంపుతున్న మోడీ ప్రియ మిత్రుడు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్. ఇలా చేతులు కట్టేసి వెనక్కి పంపుతున్న జాబితాలో ఇండియా ఉండటం బీజేపీ అంధ భక్తులు గర్వించాల్సిన విషయం. ఆబ్ కి బార్ ట్రంప్ సర్కార్" అని రాశాడు. (ఆర్కైవ్)

ఫొటోలో కొంతమంది వ్యక్తులు చేతులు వెనుక పెట్టుకొని నడుస్తుండగా, వారి చేతులకు బేడీలు వేసి ఉన్నట్లు కనిపిస్తోంది.

ఫ్యాక్ట్ చెక్:

ఒక రివర్స్ ఇమేజ్ సెర్చ్ ద్వారా ఈ ఫొటో నిజాన్ని పరిశీలించగా, @viralnewsnyc అనే వెరిఫైడ్ X యూజర్ ఈ వీడియోను 2025, జనవరి 30న షేర్ చేసినట్లు న్యూస్ మీటర్ గుర్తించింది. ఈ వీడియోలో "బోర్డర్ పట్రోల్ వాళ్లు వారిని మళ్లీ మెక్సికోకే పంపిస్తున్నారు." అని క్యాప్షన్ ఉంది.

ఈ వైరల్ ఫొటో ఆ వీడియోలోని ఓ ఫ్రేమ్‌కు సరిపోతుంది. అంతేకాకుండా, వీడియోపై "ICE, బోర్డర్ పట్రోల్ అక్రమ వలసదారులను మెక్సికోకి తిరిగి పంపుతున్నారు." అనే టెక్స్ట్ ఉంది.

కాబట్టి, ఈ ఫొటో భారతీయ అక్రమ వలసదారుల డిపోర్టేషన్‌కు సంబంధించినది కాదని స్పష్టంగా తెలుస్తోంది.

ఫొటో 2: ఓ ఫేస్ బుక్ యూజర్ ఈ ఫొటోను షేర్ చేస్తూ, "ప్రవాస భారతీయులను కార్గో విమానాలలో వారి చేతులకు, కాళ్లకు సంకెళ్ళు వేసి భారతదేశానికి పంపుతున్నారు. ఒకే ఒక టాయిలెట్ సౌకర్యం.అంతర్జాతీయ స్థాయిలో భారతీయులను ఇంతకు ముందు ఎప్పుడైనా ఇంత ఘోరంగా అవమానించారా..? అమెరికా సామ్రాజ్యవాదం నశించాలి.." అని రాశాడు.(ఆర్కైవ్)

ఫొటోలో ఒక మిలిటరీ విమానం లోపల అనేక మంది వ్యక్తులు మాస్క్‌లు ధరించి, కాళ్లకు గొలుసులు వేసుకొని కూర్చొన్నట్లు కనిపిస్తున్నారు.

ఫ్యాక్ట్ చెక్: ఒక రివర్స్ ఇమేజ్ సెర్చ్ ఆధారంగా, ఈ ఫొటోను అసోసియేటెడ్ ప్రెస్ (AP) తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో 2025, జనవరి 31న పోస్ట్ చేసినట్లు న్యూస్ మీటర్ గుర్తించింది.

ఈ ఫొటో వివరాలలో, "టెక్సాస్ నుండి గ్వాటెమాలాకు అక్రమ వలసదారులను తీసుకెళ్లిన యుఎస్ ఎయిర్‌ఫోర్స్ విమానం. ఇందులో 80 మంది డిపోర్టీలున్నారు." అని పేర్కొంది. అంతేకాకుండా, ఈ విమానం ఎల్ పాసోలోని ఫోర్ట్ బ్లిస్ నుంచి బయలుదేరిందని, అమెరికా బోర్డర్ పట్రోల్ అధికార ప్రతినిధి ఒర్లాండో మర్రెరో తెలిపినట్లు ఉంది.

ఈ విమానం మెక్సికో మీదుగా ప్రయాణించలేకపోవడం వల్ల సాధారణ సమయం కంటే రెండు రెట్లు ఎక్కువ సమయం (7 గంటలు) పట్టినట్లు కూడా నివేదిక పేర్కొంది. ఇందులో ఎనిమిది మంది చిన్నారులు కూడా ఉన్నారని చెప్పబడింది.

కాబట్టి, ఈ ఫొటో భారతీయ వలసదారుల డిపోర్టేషన్‌కు సంబంధించిందని చెప్పడం తప్పు.

ఫొటో 3: ఓ ఫేస్ బుక్ యూజర్ మరో ఫొటోను షేర్ చేస్తూ, "అమెరికాలో భారతీయులపై అవమానకర ప్రవర్తన! అమెరికా ప్రభుత్వం 205 మంది భారతీయులను అక్రమ వలసదారులుగా దేశం నుంచి పంపించేసింది. ఇది వారి దేశపు చట్టప్రకారం సమంజసమే, కానీ భారత దేశపు ప్రజలను చేతులకు బేడీలు వేసి, నేరస్తుల్లా ప్రవర్తించడం పూర్తిగా అన్యాయం! బహిరంగంగా భారత్ ను అవమానించడమే..." అని రాశాడు (ఆర్కైవ్)

ఫ్యాక్ట్ చెక్: ఒక రివర్స్ ఇమేజ్ సెర్చ్ ఆధారంగా, ఈ ఫొటో 2025, జనవరి 24న అమెరికా వైట్ హౌస్ అధికారిక X అకౌంట్‌లో పోస్ట్ చేసినట్లు న్యూస్ మీటర్ గుర్తించింది.

ఈ పోస్ట్‌ వివరణలో, "అమెరికాలో అక్రమంగా ప్రవేశించిన వారు తీవ్ర పరిణామాలను ఎదుర్కొంటారు. అధ్యక్షుడు ట్రంప్ తన మాట నిలబెట్టుకుంటున్నారు." అని పేర్కొంది.

ఈ ఫొటో భారతీయ వలసదారులకు సంబంధించి కాదు. వైట్ హౌస్ పోస్ట్ కూడా దీనిని స్పష్టంగా తెలియజేస్తోంది.

తుది నిర్ణయం:

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మూడు ఫొటోలకు.. భారతీయ అక్రమ వలసదారుల డిపోర్టేషన్‌కు ఏటువంటి సంబంధం లేదు. ఇవి వాస్తవానికి ఇతర దేశాల వలసదారులను, ఇతర సందర్భాలను చూపించే చిత్రాలు మాత్రమే. కాబట్టి, ఈ ప్రచారం అసత్యమని నిర్ధారించబడింది.

ఐతే తాజాగా, అమెరికా బోర్డర్ పట్రోల్ Xలో ఓ వీడియోను షేర్ చేసింది. ఇందులో డిపోర్టీని విమానంలోకి తీసుకెళ్తున్న దృశ్యాలు కనిపించాయి.

USBP చీఫ్ మైఖేల్ డబ్ల్యూ బ్యాంక్స్ 24 సెకన్ల వీడియోను షేర్ చేస్తూ, "... భారతీయ అక్రమ వలసదారులను విజయవంతంగా వెనక్కి పంపించాం. ఇది మిలిటరీ విమానం ఉపయోగించి ఇప్పటివరకు జరిగిన అతి దూరపు డిపోర్టేషన్ మిషన్. ఇది మా ఇమ్మిగ్రేషన్ చట్టాలను అమలు చేయడానికి తీసుకుంటున్న కఠిన నిర్ణయాన్ని తెలియజేస్తోంది..." అని పేర్కొన్నారు.

ఈ వీడియోతో పాటు, "అక్రమ మార్గం గుండా వెళ్తే, మీరు వెంటనే డిపోర్ట్ అవుతారు." అనే గట్టిపాటి హెచ్చరిక కూడా ఇచ్చారు.

Claim Review:ఈ ఫొటోలు అమెరికా నుండి డిపోర్ట్ చేసిన భారతీయ అక్రమ వలసదారులను చూపిస్తున్నాయి.
Claimed By:Social Media users
Claim Reviewed By:NewsMeter
Claim Source:Facebook
Claim Fact Check:False
Fact:ఈ క్లెయిమ్ తప్పు. ఈ ఫొటోలు భారతీయ అక్రమ వలసదారులతో సంబంధం లేనివి.
Next Story