Fact Check: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రూ. 699 బహుమతిని ఇవ్వబోతున్న మోడీ? లేదు, ఇది ఒక స్కామ్
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలందరికీ రూ. 699 ఇస్తున్నట్లు సోషల్ మీడియా పోస్ట్‌లు వైరల్ అవుతున్నాయి.
By K Sherly Sharon
Claim:స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రూ. 699 బహుమతిని ఇవ్వబోతున్న ప్రధాని మోడీ
Fact:వైరల్ పోస్టు క్లిక్‌బెయిట్, ఇది డీప్ లింక్ ఆధారిత యూపీఐ మనీ స్కామ్‌ని ఉపయోగించే వెబ్‌సైట్‌కు మళ్ళిస్తుంది.
Hyderabad: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ నుండి దేశ ప్రజలందరికీ 699 రూపాయల బహుమతి ఇవ్వబడుతుంది క్లెయిమ్ చేస్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పోస్ట్‌లోని వీడియోలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రం, పేటీఎం, ఫోన్‌పే వంటి యూపీఐ యాప్ లోగోలు, ఒక స్క్రాచ్ కార్డు ఉన్నాయి. వీడియోలోని టెక్స్ట్ ఇలా ఉంది, “ప్రతి భారతీయుడికి స్వాతంత్య్ర దినోత్సవం నాడు ప్రధాని మోదీ నుంచి 699 రూపాయల వరకు బహుమతి ఇవ్వబడుతోంది... ఇప్పుడే ఇక్కడ క్లిక్ చేసి మీ బహుమతి డబ్బును మీ బ్యాంక్ ఖాతాలో జమ చేయండి."
ఇది ఫేస్‌బుక్‌లో ఒక ప్రకటనగా పోస్ట్ చేయబడింది. (ఆర్కైవ్)
ఇవే క్లెయిమ్స్ చేస్తున్న పోస్టు ఇక్కడ చూడవచ్చు. (ఆర్కైవ్)
Fact Check
న్యూస్‌మీటర్ ఈ క్లెయిమ్ తప్పు అని కనుగొంది. ఇదొక బహుమతి ఆధారిత యూపీఐ స్కామ్.
వైరల్ అయిన ఫేస్‌బుక్ పోస్ట్‌లో పోస్ట్ చేయబడిన లింక్‌పై క్లిక్ చేయడం మమ్మల్ని ఒక వెబ్‌సైట్‌కు దారితీసింది. వెబ్‌సైట్ లింక్ ‘rewardss-gift-offer.live’ని డొమైన్‌గా చూపిస్తుంది, ఇది సందేహాస్పదంగా ఉంది. (వెబ్‌సైట్ ఆర్కైవ్)
వెబ్ పేజీలో స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు, ప్రధానమంత్రి మోడీ చిత్రం, భారతీయ సంస్కృతి, స్మారక చిహ్నాలను చూపించే వివిధ చిత్రాలు ఉన్నాయి.
వెబ్‌సైట్‌లోని టెక్స్ట్ ఇలా ఉంది: “స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మోదీ జీ తరఫున మీకు గిఫ్ట్ లభించింది, ఇప్పుడు స్క్రాచ్ చేసి మీ బ్యాంక్ ఖాతాలో ₹5000 వరకు నగదు బహుమతి పొందండి.”
ఇక్కడ ఒక స్క్రాచ్ కార్డ్ కూడా ఉంది, దానిపై 666 రూపాయల రివార్డును చూపిస్తుంది. స్క్రాచ్ కార్డ్ క్రింద ఉన్న బటన్‌పై "ఇప్పుడు ఈ బటన్ను తాకండి మరియు మీ బ్యాంక్ ఖాతాలో జమ చేయండి" అని రాశారు.
దీనిపై క్లిక్ చేస్తే ఒక పాప్ అప్ ప్రదర్శించబడుతుంది. "పేటీఎం, ఫోన్‌పే ఉపయోగించి చెల్లింపును స్వీకరించండి" అని రాసి ఉంది.
ప్రధాని మోదీ తరుఫు నుండి స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎలాంటి బహుమతి ప్రకటించబడ లేదు. దీనికి సంబంధించి ఎటువంటి వార్తా కథనాలు, విశ్వసనీయ సోషల్ మీడియా పోస్టులు లేవు.
డీప్ లింక్ అంటే ఏమిటి?
వెబ్‌సైట్‌లోని బటన్‌ను క్లిక్ చేయడం ద్వారా ముందుగా నింపబడిన యూపీఐ చెల్లింపు అభ్యర్థనతో ఫోన్‌పే యాప్ దానికదే తెరవబడుతుంది.
గుర్తు తెలియని యూపీఐ ఐడీకి రూ. 666 చెల్లించమని అభ్యర్థనను చూపించే స్క్రీన్ కనిపించింది. ‘₹666 చెల్లించండి' అనే బటన్‌ను నొక్కినప్పుడు, యాప్ యూపీఐ పిన్‌ను అడుగుతుంది. ఇది ఉపయోగదారుని బ్యాంకు ఖాతా నుండి స్కామర్ ఖాతాలోకి చెల్లింపు జరగడానికి అనుమతి ఇస్తుందని సూచిస్తుంది.
ఈ వెబ్‌సైట్ డీప్ లింక్‌ను ఉపయోగిస్తుందని తేలింది. డీప్ లింక్‌ను క్లిక్ చేయడం ద్వారా వినియోగదారులు ఏదైనా యాప్‌లోని, లేదా వెబ్సైటులో నిర్దిష్ట స్థానానికి మళ్లుతారు.
ఈ వెబ్సైటులో ఉన్న డీప్ లింకులు ముందుగా భర్తీ చేసిన వివరాలతో యూపీఐ చెల్లింపు పేజీని ఓపెన్ చేయడానికి రూపొందించబడ్డాయి. బహుమతి వస్తుందనే ఆశతో, చాలామంది ఈ దశలో తమ యూపీఐ పిన్‌ను నమోదు చేస్తారు. అయితే ఇది చెల్లింపు అభ్యర్థన కావడంతో, డబ్బు వినియోగదారుల ఖాతాలో పడడం కాదు కదా, తమ ఖాతాలో ఉన్న డబ్బే స్కామర్ ఖాతాకు వెళ్లిపోతుంది.
యూపీఐ స్కామ్‌ల నుండి ఎలా సురక్షితంగా ఉండాలి?
ఇలాంటి స్కాములలో బహుమతి లభిస్తుంది అనే ఆశ చూపించి, వినియోగదారుల చేతే పేటీఎం, ఫోన్‌పే వంటి యూపీఐ యాప్‌ల నుండి మోసగాళ్ల ఖాతాకు డబ్బు మళ్లిస్తారు.
కాబట్టి, ఏదైనా వెబ్‌సైట్‌ను విశ్వసించే ముందు, URLని జాగ్రత్తగా తనిఖీ చేయండి, అనుమానాస్పదంగా లేదా అసాధారణంగా కనిపిస్తే వెంటనే మూసేయండి.
డబ్బును స్వీకరించడానికి యూపీఐ పిన్‌ను నమోదు చేయవలసిన అవసరం లేదు. యూపీఐ లావాదేవీల్లో మన ఖాతా నుండి వేరే వాళ్ళ ఖాతాకు డబ్బు పంపించడాని మాత్రమే యూపీఐ పిన్ నమోదు చేయాలి.
కాబట్టి, మీరు ఎప్పుడైనా డబ్బు రీసీవ్ చేసేందుకు యాప్‌ను తెరిచినప్పుడు, లావాదేవీ సమయంలో యూపీఐ పిన్ అడిగితే, దాని అర్థం మీరు డబ్బు తీసుకోవడం కాదు, చెల్లిస్తున్నారు! వెంటనే యాప్‌ను మూసేయండి.
ఒకవేళ మీరు ఇలాంటి స్కామ్‌కు గురైనట్లయితే, వెంటనే మీ బ్యాంకుకు తెలియజేయండి. స్థానిక పోలీస్ స్టేషన్‌కు కూడా తెలియజేయండి, నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌లో ఫోన్‌లో (హెల్ప్‌లైన్ కోసం 1930కి డయల్ చేయండి) లేదా వారి వెబ్‌సైట్ ద్వారా ఫిర్యాదు చేయండి.
డబ్బు పంపుతామని చెప్పే ఏ సోషల్ మీడియా పోస్ట్‌లపైనా క్లిక్ చేయవద్దని మా పాఠకులకు తెలియజేస్తున్నాం. న్యూస్‌మీటర్ ఇటువంటి స్కామ్‌ల గురించి గతంలో కూడా కథనాలను ప్రచురించింది.
ఈ వైరల్ క్లెయిమ్ తప్పు అని న్యూస్‌మీటర్ నిర్ధారించింది. వైరల్ పోస్టు క్లిక్‌బెయిట్, ఇవి డీప్ లింక్ ఆధారిత యూపీఐ మనీ స్కామ్‌ని ఉపయోగించే వెబ్‌సైట్‌కు మళ్లిస్తున్నాయి.