ఫ్యాక్ట్ చెక్: మహారాష్ట్ర ఎన్నికల తర్వాత ఈవీఎంలపై నిరసనలు చెలరేగలేదు.. వైరల్ వీడియో ఢిల్లీకి సంబంధించినది
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఈవీఎంలపై ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రజలు ప్రదర్శనలు నిర్వహించారు.
By Newsmeter Network Published on 29 Nov 2024 4:21 PM GMTClaim: వైరల్ వీడియోలో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం ఈవీఎంలపై నిరసనలు చెలరేగినట్లు చూపిస్తున్నారు.
Fact: ఈ క్లెయిమ్ తప్పుదారి పట్టించేది. వైరల్ వీడియో 2024 జనవరిలో ఢిల్లీలో జరిగిన ఈవీఎంలపై నిరసనకు సంబంధించింది.
హైదరాబాద్: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత మహా వికాస్ అఘాడి (MVA) నేతలు ఈవీఎంలపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు.
ఈవీఎంలను తొలగించి పాత బ్యాలెట్ పేపర్ విధానాన్ని తీసుకురావాలని MVA నేతలు ప్రచారం చేపట్టాలని నిర్ణయించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా ఈవీఎంలపై సందేహాలు వ్యక్తం చేస్తూ, ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ నేపథ్యంలో, ఈవీఎంలను తొలగించాల్సిందిగా నినాదాలు చేస్తూ ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. మహారాష్ట్రలో ఈ ఆందోళనలు జరిగినట్లు కొందరు వ్యక్తులు షేర్ చేస్తున్నారు.
ఒక ఎక్స్ యూజర్ ఈ వీడియోను షేర్ చేస్తూ, “మహారాష్ట్ర లో ఈవీయంల పై ప్రజాపోరాటం. రోడ్డు ఎక్కిన లక్షలాది మంది. ఏపీలో ఎపుడు ఇలా ??” అని రాశారు.
మరో యూజర్ ఈ వీడియో స్షేర్ చేస్తూ, “మహారాష్ట్ర లో ఈవీయంల పై ప్రజాపోరాటం. ఏపీలో ఎపుడు??” అని రాశారు.
ఫ్యాక్ట్ చెక్:
న్యూస్‌మీటర్ ఈ వాదన తప్పుదారి పట్టించేది అని కనుగొంది, ఎందుకంటే వైరల్ వీడియో 2024 జనవరిలో ఢిల్లీలో జరిగిన ఈవీఎంలపై నిరసనను చూపిస్తోంది.
నిజాన్ని తెలుసుకునేందుకు వీడియో క్లిప్ కీ ఫ్రేమ్‌లను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, 2024 ఫిబ్రవరిలో X మరియు ఫేస్‌బుక్ వినియోగదారులు దీన్ని పంచుకున్నట్లు కనిపించింది. ఈ పోస్ట్‌లు ఈవీఎంలను బ్యాన్ చేయాలనే ఉద్యమం పెరుగుతోందని, అయితే 'ప్రధాన మీడియా సంస్థలు' ఈ విషయాన్ని కవర్ చేయడం లేదని పేర్కొన్నాయి. (Archive)
ఈ సమాచారం ఆధారంగా, మేము కీవర్డ్ సెర్చ్ చేసి, జనవరి 31న భారత్ ముక్తి మోర్చా, ఇతర సంఘాలు ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఈవీఎంలపై నిరసనలను నిర్వహించాయని చెప్పే అనేక X పోస్టులను కనుగొన్నాం. ఈ పోస్టులను ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.
వైరల్ వీడియోలో జనవరి 31, ఫిబ్రవరి 1న పోస్ట్ చేసిన వీడియోల్లో, జనతా దళ్ యునైటెడ్ (జేడీయూ) కార్యాలయ బోర్డ్ వంటి ఒకే రకమైన దృశ్యాలు కనిపించాయి.
మరింత పరిశోధన చేయగా, ఢిల్లీలోని జంతర్ మంతర్ 7వ నంబర్ రోడ్ లో జేడీయూ కార్యాలయం ఉన్నట్లు గుర్తించాము. అదనంగా, జీ బీహార్ ఝార్ఖండ్ ఒక నివేదికలో ఈ కార్యాలయ చరిత్రను వివరించింది. ఆ నివేదికలో పార్టీ కార్యాలయ ప్రవేశ ద్వారంలోని అదే బోర్డులు కనిపించాయి.
జనవరి 31న Xలో పోస్టు చేసిన NCP(SP) నేత శరద్ పవార్, ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద భారత్ ముక్తి మోర్చా నిర్వహించిన ఈవీఎంలపై నిరసన కార్యక్రమాన్ని ప్రస్తావించారు. ఈవీఎంలను బ్యాన్ చేయాలని, బాలెట్ పేపర్లను తిరిగి ప్రవేశపెట్టాలని వారు డిమాండ్ చేశారు. ఈ నిరసన నుండి కొన్ని చిత్రాలను కూడా ఆయన పంచుకున్నారు, అవి వైరల్ వీడియోలలో కనిపించే దృశ్యాలకు చాలా దగ్గరగా ఉన్నాయి.
Addressed the protest organized by Bharat Mukti Morcha at Jantar Mantar in New Delhi. This protest was organised to ban EVM, bring ballot back, the National President of Bharat Mukti Morcha, Hon. Vaman Meshram ji was also present. pic.twitter.com/B65313XSdX
— Sharad Pawar (@PawarSpeaks) January 31, 2024
జనవరి 31న ఆమర్ ఉజాలా మరియు దైనిక భాస్కర్ అనే మీడియా సంస్థలు కూడా నివేదికలు ప్రచురించాయి. ఈ నివేదికలు ప్రకారం, జంతర్ మంతర్ వద్ద భారత్ ముక్తి మోర్చా, రాష్ట్రీయ కిసాన్ మోర్చా, బహుజన్ ముక్తి పార్టీ తదితర కొన్ని సంఘాల ద్వారా ఈవీఎంలపై నిరసన కార్యక్రమం నిర్వహించబడింది. ఉత్తర ప్రదేశ్, హరియాణా, పంజాబ్, ఢిల్లీ, రాజస్థాన్, బీహార్ వంటి ప్రాంతాల నుండి నిరసనకారులు వచ్చి, "ఈవీఎంలను తొలగించండి" అనే బానర్‌లతో నిరసన తెలిపారు.
అందువల్ల, ఈవీఎంలపై నిరసనను చూపించే వీడియో 2024 జనవరిలో ఢిల్లీ లోని జంతర్ మంతర్ వద్ద జరిగింది, మహారాష్ట్రలో కాదు. కాబట్టి, ఈ వాదన తప్పు.