Hyderabad: ఒలింపిక్స్ ఆడుతున్న సమయంలో ఏడు నెలల గర్భవతి అయ్యుండి భారత దేశం కోసం పతకాలు సాధించినా ఒక క్రీడాకారిణికి కూడా గుర్తింపు దొరకలేదు అంటూ క్లెయిమ్ చేస్తున్న పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
"అత్యంత బాధాకరమైన విషయం అంటే ఇదే! ఒలంపిక్స్ ఆడుతున్న సయమంలో ఆమె 7 నెలల ప్రెగ్నెంట్ భారత్ కి మెడల్ కూడా సాధించారు. అయినా ఆమె పడ్డ శ్రమ, కృషిని ఎవరు గుర్తించలేదు. ఆమె క్రికెటర్ కాదు అనే కదా ఇలా?" అని వైరల్ అవుతున్న ఫేస్‌బుక్ పోస్ట్ ఈ విషయాన్ని క్లెయిమ్ చేస్తోంది. ఈ పోస్టును 48 వేల మందికి పైగానే లైక్ చేశారు. (ఆర్కైవ్)
ఇదే క్లెయిమ్ చేస్తున్న పోస్ట్‌లను ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు.(ఆర్కైవ్ 1, ఆర్కైవ్ 2)
Fact Check
న్యూస్‌మీటర్ ఈ క్లెయిమ్స్ తప్పు అని కనుగొంది. ఫొటోలో కనిపిస్తున్నది ఈజిప్ట్ ఫెన్సింగ్ క్రీడాకారిణి నదా హఫీజ్.
వైరల్ అవుతున్న ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఒలింపిక్స్ ఇంస్టాగ్రామ్ అకౌంటులో 2024 జులై 31న పోస్ట్ చేయబడిన చిత్రాలు కనిపించాయి. వైరల్ ఫొటోలో కనిపిస్తున్న అదే చిత్రాలను ఇక్కడ చూడవచ్చు. క్యాప్షన్ ద్వారా ఈ ఫోటోలు ఈజిప్ట్ ఫెన్సింగ్ క్రీడాకారిణి నదా హఫీజ్ 2024 పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొనప్పుడు తీయబడినవి అని తెలుస్తోంది.
ఈ పోస్టు క్యాప్షన్‌లో ఈ విధంగా వ్రాశారు, "ఈజిప్టు ఫెన్సర్ నాడా హఫీజ్ తాను ఏడు నెలల గర్భవతినని ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో హృదయపూర్వకంగా ప్రకటించింది. ఆమె అంతకు ముందు రోజే #ఒలింపిక్స్‌లో పోటీలో పాల్గొంది! #Paris2024.”
ఈ లీడ్ అనుసరించి కీ వర్డ్ సెర్చ్ చేస్తే నదా హఫీజ్ తన ఇంస్టాగ్రామ్ అకౌంటులో తానూ ఏడు నెలల గర్భవతి అని ప్రకటిస్తూ చేసిన పోస్ట్ దొరికింది. “7 నెలల గర్భవతి ఒలింపియన్! పోడియం మీద ఇద్దరు ఆటగాళ్ళుగా మీకు కనిపిస్తున్నది, నిజానికి అక్కడ ఉన్నది ముగ్గురు! అది నేను, నా పోటీదారుడు, & ఇంకా మన ప్రపంచంలోకి రాని నా చిన్న పాప!” అని క్యాప్షన్‌లో వ్రాశారు. (ఆర్కైవ్)
BBC 2024 జులై 29న ప్రచురించిన కథనంలో కూడా నదా ఈజిప్ట్ రాజధాని కైరోకు చెందిన క్రీడాకారిణి అని వ్రాసారు. "కైరోకు చెందిన హఫీజ్, తన మూడవ ఒలింపిక్స్‌లో పాల్గొంటూ, ప్రెగ్నెంట్ ఉండగానే పోటీలో పాలుపంచుకున్నందు వల్ల "నా అస్తిత్వం గర్వంతో నిండిపోయింది" అని చెప్పింది," అని పేర్కొన్నారు. (ఆర్కైవ్)
ఇదే విషయాన్నీ Harpers Bazaar కూడా తన కథనంలో ప్రస్తావించారు. (ఆర్కైవ్)
నదా ఈజిప్టుకు చెందిన క్రీడాకారిణి అని తన ఒలింపిక్స్ పేజీ, ఇంటర్నేషనల్ ఫెన్సెన్ ఫెడరేషన్ ప్రొఫైల్ తెలియజేస్తున్నాయి. (ఆర్కైవ్ 1, ఆర్కైవ్ 2)
పారిస్ 2024 ఒలింపిక్స్ ఫెన్సింగ్ పోటీల్లో పాల్గొన్న టీంలో కూడా నదా పేరును చూడవచ్చు. (ఆర్కైవ్)
First Post 2024 ఏప్రిల్ 24న ప్రచురించిన కథనం ప్రకారం, 2024 పారిస్ ఒలింపిక్స్‌కు భారత ఫెన్సర్లు ఎవరూ అర్హత సాధించలేదు. (ఆర్కైవ్)
నదా భారత దేశం తరుఫున ఎప్పుడూ ఆడలేదు, పతకాలు సాధించలేదు. 2024 ఒలింపిక్స్ ఫెన్సింగ్ పోటీలో భారత క్రీడాకారులు పాల్గొనలేదు.
ఈ సమాచారం ప్రకారం నదా హఫీజ్ ఒలింపిక్స్ ఆటల్లో ఈజిప్టుకు మాత్రమే ప్రాతినిధ్యం వహించారు. కాబట్టి వైరల్ అవుతున్న క్లెయిమ్స్ తప్పు అని న్యూస్‌మీటర్ నిర్ధారించింది.