Fact Check: నిజామాబాద్‌లో రియాజ్ ఎన్‌కౌంటర్; ముస్లింలు ఇంటికి వెళ్లి నివాళి అర్పించారా? నిజం ఇక్కడ తెలుసుకోండి
By - K Sherly Sharon |
Claim:నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో పోలీసు ఎన్‌కౌంటర్‌లో మరణించిన షేక్ రియాజ్‌కు నివాళులు అర్పించడానికి ముస్లిం సమాజానికి చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చినట్లు ఈ వీడియో చూపిస్తుంది.
Fact:ఈ క్లెయిమ్ తప్పు. అక్టోబర్ 18న తప్పిపోయిన వ్యక్తి మృతదేహం కనుగొనబడిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలోని పలమనేర్ ప్రభుత్వ ఆసుపత్రి వద్దకు వచ్చిన జనసమూహాన్ని చూపిస్తున్న వీడియో.
Hyderabad: షేక్ రియాజ్ ఇంటికి నివాళులు అర్పించడానికి పెద్ద ఎత్తున ముస్లింలు వచ్చారనే క్లెయిమ్‌లతో సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది.
షేక్ రియాజ్ అనే రౌడీ షీటర్, నవంబర్ 20న నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌లో పోలీసులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించాడు. నవంబర్ 17న కానిస్టేబుల్ ఎం ప్రమోద్‌ను హత్య చేసినట్లు అతనిపై ఆరోపణలు ఉన్నాయి.
వీడియోలో ఒక అంబులెన్స్ వస్తుండగా పెద్ద సంఖ్యలో ప్రజలు బైక్‌లపై, కాలినడకన దానిని అనుసరిస్తున్నట్లు చూడవచ్చు. అంబులెన్స్ నుండి స్ట్రెచర్‌పై, చుట్ట బడిన వస్తువును బయటకు తీశారు. అదొక మృతదేహమా కాదా అనేది అస్పష్టంగా ఉంది. ఇది జరుగుతుండగా అంబులెన్స్ చుట్టూ జనం గుమ్మిగూడినట్లు చూడవచ్చు.
ఈ వీడియో ఫేస్‌బుక్‌లో షేర్ చేస్తూ, ఇలా రాశారు, “నిన్న నిజాంబాద్ లో ఎన్కౌంటర్ అయిన రియాజ్ గాని మృతదేహానికి వాళ్ళు ఇస్తున్న విలువ చూడండి. చచ్చినవాడు టెర్రరిస్టు అయినా దేశద్రోహి అయినా ఎవరైనా వారికి సంబంధం లేదు.వాళ్లంతా ఒకటవుతారు. మిత్రులారా, దయచేసి అర్థం చేసుకోండి.” (ఆర్కైవ్)
వైరల్ వీడియో నుండి చిన్న క్లిప్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. దానిపై ఇలా రాశారు, “వేలాదిమంది ముస్లింలు రియాజ్ గాడి ఇంటి దగ్గర నివాళులు అర్పించడానికి వచ్చారు... బహుశా ఇంతమంది ముస్లింలు ఏపీజే అబ్దుల్ కలాం గారికి కూడా వచ్చి ఉండరు.” (ఆర్కైవ్)
ఇవే క్లెయిమ్స్ చేస్తున్న పోస్ట్‌లను ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. (ఆర్కైవ్ 1, ఆర్కైవ్ 2, ఆర్కైవ్ 3)
Fact Check
న్యూస్‌మీటర్ ఈ క్లెయిమ్ తప్పు అని కనుగొంది. అక్టోబర్ 18న తప్పిపోయిన వ్యక్తి మృతదేహం దొరికిన తర్వాత ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాలోని పలమనేర్ ప్రభుత్వ ఆసుపత్రిలో జనసమూహం గుమిగూడిన సందర్భాన్ని ఈ వీడియో చూపిస్తుంది.
నవంబర్ 21 తెల్లవారుజామున నిజామాబాద్‌లోని బోధన్ శ్మశానవాటికలో షేక్ రియాజ్ అంత్యక్రియలు అతని కుటుంబ సభ్యులు నిర్వహించారు. తెల్లవారుజామున 2 గంటలకు, పోస్ట్‌మార్టం తర్వాత పోలీసులు అతని మృతదేహాన్ని వారికి అప్పగించారు.
వైరల్ వీడియోని ఉపయోగించి రియాజ్ ఇంటికి నివాళులు అర్పించడానికి ప్రజలు వచ్చిన్నట్లు చూపిస్తున్న వార్తా కథనాలు ఏవి దొరకలేదు.
వీడియోలోని అంబులెన్స్
వైరల్ వీడియో కీఫ్రేమ్‌ల విశ్లేషణ ద్వారా, అంబులెన్స్ ‘జీలు భాయ్’ నడుపుతున్న ఉచిత సేవ అని కనుగొన్నాం. అంబులెన్స్ యాజమాన్యాన్ని సంప్రదించాం, వైరల్ వీడియో షేక్ రియాజ్ అంత్యక్రియలకు సంబంధించినది కాదని పేర్కొన్నారు.
న్యూస్‌మీటర్‌తో మాట్లాడుతూ, ఎఎస్ జీలానీ అలియాస్ జీలు భాయ్, ఇలా అన్నారు “ఆ వీడియో ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో జరిగిన ఒక ఘటనను చూపిస్తుంది. ఇది నిజామాబాద్‌లో షేక్ రియాజ్ అంత్యక్రియలకు సంబంధించినది కాదు.”
22 ఏళ్ల యూనిస్ మృతదేహాన్ని పలమనేర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చిన ఘటనను వీడియో చూపిస్తుందని ఆయన మాకు తెలియజేశారు.
జలపాతాల వద్ద విషాదకరమైన మరణం
పలమనేర్‌లోని కళ్యాణరేవుల జలపాతాల సమీపంలో వీడియో రికార్డ్ చేయడానికి వాలుపైకి దిగిన తర్వాత యూనిస్ అనే వ్యక్తి అదృశ్యమయ్యాడు. అతను పట్టు తప్పు నీటిలో పడిపోయాడని ది హిందూ ప్రచురించిన కథనం పేర్కొంది.
పోలీసులు, అటవీ అధికారులు రోజుల తరబడి గాలింపు చర్యల అనంతరం అక్టోబర్ 18న అతని మృతదేహం బయటపడింది. జీలు భాయ్ అంబులెన్స్ సేవలు మృతదేహాన్ని రవాణా చేయడంలో సహాయపడ్డాయి.
అంబులెన్స్ యజమానికి బెదిరింపులు
చిత్తూరు జిల్లాలో, చుట్టుపక్కల ప్రాంతాలలో తాను ఉచిత అంబులెన్స్ సేవ నిర్వహిస్తున్నట్లు జీలానీ తెలిపారు. ఈ వీడియో నకిలీ వాదనలతో ప్రసారం కావడం ప్రారంభించినప్పటి నుండి, షేక్ రియాజ్ అంత్యక్రియలకు తాను సహాయం చేశానని నమ్మిన వ్యక్తుల నుండి అతనికి అనేక బెదిరింపు కాల్స్ వచ్చినట్లు చెప్పారు.
అక్టోబర్ 18న ‘చంద్ర క్రియేషన్స్ - పలమనేర్’ అప్‌లోడ్ చేసిన యూట్యూబ్ వీడియోను జీలని మాతో షేర్ చేశారు. యూనిస్ మృతదేహం దొరికిన దృశ్యం, అంబులెన్స్ ఆసుపత్రికి చేరుకోవడం, మీడియాతో ఈ ఘటన గురించి కొందరు మాట్లాడుతున్న వీడియో క్లిప్‌లను ఈ యూట్యూబ్ వీడియో చూపిస్తుంది. యూట్యూబ్ వీడియో, వైరల్ వీడియో స్క్రీన్‌షాట్‌ల మధ్య పోలికను క్రింద చూడవచ్చు.
వైరల్ వీడియోలోని భవనం రంగు ఫిబ్రవరి 2024లో గూగుల్ మ్యాప్స్ లో అప్‌లోడ్ చేయబడిన పలమనేర్ ప్రభుత్వ ఆసుపత్రి చిత్రంతో ఉన్న రంగుతో సరిపోలుతుంది అని గమనించవచ్చు.
కీవర్డ్ శోధనలను ఉపయోగించి, ‘యూనిస్ ను చూసేందుకు ఏరియా ఆసుపత్రికి భారీగా చేరుకున్న స్నేహితులు,బంధువులు’ అనే శీర్షికతో పలమనేర్ న్యూస్ అప్‌లోడ్ చేసిన యూట్యూబ్ వీడియోను కనుగొన్నాం. వైరల్ వీడియోలోని అన్ని వీడియో క్లిప్‌లను పలమనేర్ న్యూస్ అప్‌లోడ్ చేసిన ఫుటేజ్లో గుర్తించవచ్చు.
వైరల్ వీడియోలోని టైమ్‌స్టాంప్ 0:01 నుండి 0:50 వరకు ఉన్న పెద్ద సమూహాన్ని యూట్యూబ్ వీడియోలో 0:30 నిమిషాల మార్క్ నుండి 1:21 నిమిషాల మార్క్ వరకు చూడవచ్చు.
వైరల్ వీడియోలోని టైమ్‌స్టాంప్ 0:51 నుండి 2:58 వరకు ఉన్న ఆసుపత్రిలో గుమిగూడిన జనసమూహాన్ని యూట్యూబ్ వీడియోలో 3:01 నిమిషాల మార్క్ నుండి 5:08 నిమిషాల మార్క్ వరకు చూడవచ్చు.
కాబట్టి, వైరల్ వీడియో షేక్ రియాజ్ ఇంటికి నివాళులు అర్పించడానికి చేరుకున్న ముస్లింలను చూపించడం లేదని స్పష్టంగా తేలింది. అక్టోబర్ 18న యూనిస్ మృతదేహం దొరికిన తర్వాత పలమనేర్ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద జనసమూహం గుమిగూడినట్లు ఇది చూపిస్తుంది.
వైరల్ వాదన తప్పు అని న్యూస్‌మీటర్ నిర్ధారించింది.