హైదరాబాద్: ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతోంది. ఇందులో ఓ వ్యక్తిని పోలీసులు పట్టుకుని వాహనంలోకి తోసివేస్తున్న దృశ్యాలు చూడవచ్చు. ఐతే ఈ వీడియోను కుంభమేళా వెళ్తున్న ట్రెయిన్‌పై రాళ్లు రువ్విన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు చెప్పి షేర్ చేస్తున్నారు.
ఒక ఫేస్‌బుక్ యూజర్ ఈ వీడియోను షేర్ చేస్తూ, "కుంభమేళా వెళ్లే దారిలో ట్రెయిన్ పై రాళ్లు రువ్విన పందులకు ట్రీట్మెంట్... యోగినా మజాకా..." అని క్యాప్షన్ ఇచ్చాడు.
ఇలాంటి పోస్ట్ ఇక్కడ చూడొచ్చు. (Archive)
ఫ్యాక్ట్ చెక్:
న్యూస్‌మీటర్ ఈ వీడియోను పరిశీలించి, ఈ క్లెయిమ్ తప్పని నిర్ధారించింది. ఈ ఘటన పశ్చిమ బంగాల్‌లో జరిగింది, కుంభమేళాతో ఎలాంటి సంబంధం లేదు.
మేము వీడియోలోని ఒక కీ ఫ్రమేను రివర్స్ ఇమేజ్ సెర్చ్ నిర్వహించిగా, మాకు 2025 జనవరి 28న ఆసియానెట్ న్యూస్ బంగ్లా ప్రచురించిన ఒక కథనం లభించింది. "సూరి పోలీస్: పోలీస్ యూనిఫాంపై చేతులు! బిర్భూమ్‌లో తృణమూల్ కార్యకర్తను పోలీసులు కఠినంగా శిక్షించారు." (బెంగాలీ నుండి తెలుగు అనువాదం) అనే శీర్షికతో వచ్చిన ఈ కథనంలో ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వీడియో ఉంది.
ఈ కథనం ప్రకారం, బీర్భూమ్ జిల్లాలోని సూరి నగరంలో భూ వివాదం కారణంగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఆ ఘర్షణను నియంత్రించేందుకు వెళ్లిన పోలీస్ ఇన్‌స్పెక్టర్‌ను ఓ కార్యకర్త కాలర్ పట్టుకుని లాగాడు. పోలీస్ అధికారిని అవమానించిన ఘటన తర్వాత పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
ఇంకా కీవర్డ్ సెర్చ్ ద్వారా 2025 జనవరి 29న ప్రచురితమైన ది టెలిగ్రాఫ్ కథనం కూడా ఈ సంఘటనను ధృవీకరించింది. ఈ కథనంలోనూ భూ వివాదం నేపథ్యంలో తృణమూల్ వర్గాల మధ్య ఘర్షణ జరిగిందని, పోలీస్ అధికారి దాడికి గురయ్యాడని పేర్కొన్నారు.
అదనంగా, ABP ఆనంద 2025 జనవరి 28న విడుదల చేసిన ఒక యూట్యూబ్ వీడియోలో ఈ ఘర్షణ గురించి మరింత సమాచారం ఉంది.
ఈ వీడియో వివరణలో పోలీసులు ఘర్షణను నియంత్రించేందుకు లాఠీచార్జ్ చేసినట్లు పేర్కొన్నారు. ఒక వ్యక్తిని తుపాకీతో సహా అరెస్ట్ చేసినట్లు కూడా వెల్లడించారు.
కాబట్టి, ఈ వైరల్ వీడియో కుంభమేళాతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టమైంది. ట్రెయిన్‌పై రాళ్లు రువ్వడంపై పోలీసులు చర్యలు తీసుకున్నట్లు చేస్తున్న దావా అసత్యం.