హైదరాబాద్: స్వామి అవిముక్తేశ్వరానంద్‌పై పోలీసులు లాఠీచార్జ్ చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన మహా కుంభమేళా 2025లో జరిగిందని, యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నాయని కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.
వీడియోలో, కొంతమంది పోలీసులు స్వామి అవిముక్తేశ్వరానంద్‌ను లాఠీలతో కొడుతున్నట్లు కనిపిస్తోంది. ఈ సమయంలో ఆయన చేతులను ఎత్తి, “కొట్టండి కొట్టండి” (హిందీ నుండి అనువదించబడింది) అనడం మనం చూడవచ్చు.
ఒక ఫేస్‌బుక్ యూజర్ ఈ వీడియోను షేర్ చేస్తూ, "బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినందుకు ఓ హిందూ స్వామీజీ పరిస్థితి చూడండి." (కన్నడ నుంచి అనువాదం) అని పేర్కొన్నారు.(ఆర్కైవ్)
ఇంకో ఇన్‌స్టాగ్రామ్ యూజర్ కూడా ఇదే వీడియోను షేర్ చేస్తూ, "బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శించాడని హిందూ స్వామీజీపై లాఠీచార్జ్." అని రాశారు.(ఆర్కైవ్)
ఫ్యాక్ట్ చెక్
న్యూస్‌మీటర్ ఈ వీడియోని పరిశీలించగా, ఇది 2025కి సంబంధించినదికాదు. ఈ వీడియో 2015లో వారణాసిలో చోటుచేసుకున్న ఓ సంఘటనకు సంబంధించినదని తేలింది.
మేము కీవర్డ్ సెర్చ్ చేసి, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రిక 2015 సెప్టెంబర్ 24న ప్రచురించిన ఒక కథనాన్ని గుర్తించాం.
ఈ కథనంలో స్వామి అవిముక్తేశ్వరానంద్‌పై పోలీసుల లాఠీచార్జ్ చేస్తుండగా తీసిన ఫోటోను ప్రచురించారు. ఫోటో కింద, "గణేశ్ విగ్రహ నిమజ్జనం అనుమతించాలంటూ ధర్నా చేస్తున్న స్వామి అవిముక్తేశ్వరానంద్‌ను భక్తులు రక్షించేందుకు ప్రయత్నించగా, పోలీసులు లాఠీచార్జ్ చేశారు." (ఆంగ్లం నుండి అనువదించబడింది) అని వివరించారు.
ఈ కథనం ప్రకారం, వారణాసిలో గణేశ్ విగ్రహ నిమర్జనం పై ప్రభుత్వ నిషేధాన్ని వ్యతిరేకిస్తూ 30 గంటల పాటు నిరసన కొనసాగింది. చివరికి, పోలీసులు లాఠీచార్జ్ చేయగా, స్వామి అవిముక్తేశ్వరానంద్‌తో పాటు 30 మంది గాయపడ్డారని, 25 మందిని పోలీసులు అరెస్ట్ చేశారని పేర్కొన్నారు.
ఇక టైమ్స్ ఆఫ్ ఇండియా కూడా అదే రోజు కథనాన్ని ప్రచురించింది. వారు కూడా పోలీసులు గణేశ్ విగ్రహ నిమర్జనంపై నిషేధానికి వ్యతిరేకంగా నిరసన చేసిన పూజా నిర్వాహకులు, స్వామీజీలపై లాఠీచార్జ్ చేశారని వివరించారు.
అంతేకాకుండా, మేము ఆజ్ తక్ యూట్యూబ్ ఛానెల్ 2015 సెప్టెంబర్ 24న పోస్ట్ చేసిన వీడియో రిపోర్ట్‌ను కూడా కనుగొన్నాం.
ఈ వీడియో వివరణలో, "గణేశ్ విగ్రహ నిమర్జనం కోసం నిరసన తెలుపుతున్న స్థానికులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు." అని పేర్కొన్నారు.
ఈ వీడియోలో 1:08 నిమిషం టైమ్‌స్టాంప్ వద్ద ఉన్న దృశ్యాలు వైరల్ వీడియోలో ఉన్న దృశ్యాలతో పూర్తిగా సరిపోతున్నాయి. దీనివల్ల, ఈ వీడియో కొత్తది కాదని, 2015లో జరిగినదని స్పష్టమైంది.
కాబట్టి, 2015లో జరిగిన లాఠీచార్జ్ ఘటనను మహా కుంభమేళా 2025లో జరిగినట్లు చూపుతూ కొన్ని సోషల్ మీడియా పోస్టులు తప్పుదారి పట్టిస్తున్నాయి.