Fact Check: వైకాపా నాయకులను, మహిళలను దూషించినందుకు తెదేపా మద్దతుదారుడిని స్తంభానికి కట్టేసి, కొట్టారా? కాదు, ఇది రాయ్‌బరేలి వీడియో
ఒక యువకుడిని స్తంభానికి కట్టేసి, బెత్తాలతో కొట్టడం చూపిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
By - K Sherly Sharon |
Claim:వైకాపా నాయకులు, మహిళలను దూషించినందుకు తెదేపా మద్దతుదారుడిని స్తంభానికి కట్టేసి, బెత్తాలతో కొట్టినట్లు వీడియో చూపిస్తుంది.
Fact:వైరల్ క్లెయిమ్ తప్పు. ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలి జిల్లాలోని గడ్డిపూర్ గ్రామంలో ఒక బాలికను లైంగికంగా వేధించినందుకు ఒక యువకుడిని స్తంభానికి కట్టేసి కొడుతున్నట్లు వీడియో చూపిస్తుంది.
Hyderabad : ఒక వ్యక్తిని స్తంభానికి కట్టేసి కొడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో కొడుతున్నది ఒక తెలుగు దేశం పార్టీ (టీడీపీ) కార్యకర్తని అనే క్లెయిమ్‌లతో సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
ఆ వ్యక్తి వేడుకుంటుండగా, మరో ఇద్దరు అతనిని బెత్తాలతో కొడుతున్నట్లు వీడియోలో చూడవచ్చు.
వైరల్ పోస్ట్‌లో 'KadiroduOffl' అనే X ప్రొఫైల్ ట్యాగ్ చేయబడింది. KadiroduOffl ప్రొఫైల్ బయోలో 'ఎప్పటికీ టీడీపీతో' అని రాసి ఉంది. వైరల్ అవుతున్న X పోస్ట్ శీర్షిక ఇలా ఉంది, “బ్రేకింగ్ న్యూస్... రోజూ ysrcp పార్టీ leaders మీద, ఆడవాళ్ల మీద అసభ్యకరమైన పోస్ట్లు పెడుతున్న @KadiroduOffl ని కరెంట్ స్తంబానికి కట్టి కొడుతున్న గ్రామ ప్రజలు. గతంలో వీడి మీద Pocso కేసు కూడా ఉంది.#TDPAbuses.” (ఆర్కైవ్)
Fact Check
వైరల్ క్లెయిమ్ తప్పు అని న్యూస్‌మీటర్ కనుగొంది. ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలి జిల్లాలోని గడ్డిపూర్ గ్రామంలో ఒక బాలికను లైంగికంగా వేధించినందుకు ఒక యువకుడిని స్తంభానికి కట్టేసి కొడుతున్నట్లు వీడియో చూపిస్తుంది.
రివర్స్ ఇమేజ్ సెర్చ్ ఉపయోగించి X లో అప్‌లోడ్ చేయబడిన అదే వైరల్ వీడియోను కనుగొన్నాం. ఈ వీడియో అక్టోబర్ 5న “యూపిలోని రాయ్ బరేలిలో, పాఠశాల విద్యార్థినిని వేధించాడని ఆరోపిస్తూ గ్రామస్తులు మొహమ్మద్ సాహిల్‌ను కొట్టారు. పోలీసులు అతన్ని అరెస్టు చేశారు” అనే క్యాప్షన్‌తో అప్‌లోడ్ చేయబడింది.
In Raebareli, UP, villagers tied and beat Mohammad Sahil for allegedly molesting a schoolgirl. Police have arrested him. ....#Raebareli #UPNews #JusticeForGirls #StopMolestation #CommunityAction #CrimeAlert #TrendingNow #SafetyForWomen #IndiaNews pic.twitter.com/AXcHdcpXac
— NewsBreak24 (@NewsBreak24Live) October 5, 2025
ఆ వీడియోలో ఆ యువకుడు వేడుకుంటున్నట్లు ఆడియోలో వినిపిస్తుంది. అతనిపై దాడి చేస్తున్న వ్యక్తి హిందీలో, “నువ్వు దీని గురించి ముందే ఆలోచించి ఉండాలి” అని చెప్పడం వినవచ్చు.
ఇదే వీడియోను మరొక X పోస్ట్‌లో ఇదే సమాచారంతో అప్‌లోడ్ చేశారు.
ఈ లీడ్ ద్వారా, కీవర్డ్ సెర్చ్‌లు చేసాము, అక్టోబర్ 3న ఏబీపీ న్యూస్ ప్రచురించిన కథనాన్ని కనుగొన్నాం. ఈ కథనంలో వైరల్ వీడియో నుండి తీసిన స్క్రీన్‌షాట్‌ను ఉపయోగించారు. ఒక బాలికను వేధించాడనే ఆరోపణలతో మొహమ్మద్ సాహిల్ అనే యువకుడిని గ్రామస్తులు కొట్టారని పేర్కొన్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలి జిల్లా గడ్డిపూర్ గ్రామంలో జరిగింది.
వైరల్ వీడియోను షేర్ చేస్తూ, దైనిక్ భాస్కర్ అక్టోబర్ 3న ఒక కథనాన్ని ప్రచురించింది. మొహమ్మద్ అఫ్తాబ్ కుమారుడు మొహమ్మద్ సాహిల్ గ్రామానికి సమీపంలోని నాయగంజ్ పట్టణంలో నివసిస్తున్నాడని అందులో పేర్కొన్నారు. పాఠశాల నుండి తిరిగి వస్తున్న బాలిక చేయి పట్టుకుని లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు, ఆ బాలిక గట్టిగా అరిచి అక్కడే ఉన్న గ్రామస్తులను అప్రమత్తం చేసింది. వారు అతన్ని పట్టుకుని, ఒక స్తంభానికి కట్టేసి, బెత్తాలతో కొట్టారు. సలోన్ పోలీసులకు సమాచారం అందించగా, వారు మొహమ్మద్ సాహిల్‌ను అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఘటన అక్టోబర్ 2న జరిగిందని ఏబీపీ న్యూస్ పేర్కొంది, అయితే, అక్టోబర్ 1న ప్రచురించబడిన అమర్ ఉజాలా కథనంలో నిందితుడి చిత్రం ఉంది. ఈ చిత్రం, వైరల్ వీడియో నుండి స్క్రీన్‌షాట్ మధ్య పోలికలను క్రింద చూడవచ్చు.
“విద్యార్థి తండ్రి ఫిర్యాదు ఆధారంగా లైంగిక వేధింపుల కేసు నమోదు చేసినట్లు పోలీస్ ఇన్‌స్పెక్టర్ రాఘవన్ కుమార్ సింగ్ తెలిపారు” అని అమర్ ఉజాలా పేర్కొంది.
సంఘటన జరిగిన ఖచ్చితమైన తేదీని స్వతంత్రంగా ధృవీకరించలేకపోయాం. అయితే, వైరల్ వీడియో ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలి జిల్లాలోని గడ్డిపూర్ గ్రామంలో ఒక యువకుడిని లైంగిక వేధింపులకు గురిచేసినందుకు కొట్టిన ఘటనను చూపిస్తుందని తేలింది. వైకాపా నాయకులను లేదా మహిళలను దూషించినందుకు చేసినందుకు తెదేపా కార్యకర్తపై దాడి చేయడాన్ని వీడియో చూపిస్తుంది అనే క్లెయిమ్‌లో నిజం లేదు.
కాబట్టి వైరల్ వాదనలు తప్పు అని న్యూస్‌మీటర్ నిర్ధారించింది.