Hyderabad: కార్లు, భవనాలు, గడియారాలను చూపిస్తున్న ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తరువాత సీఎం ఏ. రేవంత్ రెడ్డి తమ్ముడు, ఏ. కొండల్ రెడ్డి కొనుగోలు చేసిన ఆస్తులని ఇది చూపిస్తుంది అనే క్లెయిమ్‌లతో ఈ పోస్టుని వైరల్ చేస్తున్నారు.
ఈ పోస్టులో నాలుగు చిత్రాలు ఉన్నాయి – రెండు చిత్రాలు వరుసలో ఉన్న లగ్జరీ కార్లను చూపిస్తుండగా, ఒకటి ఖరీదైన గడియారాలను, మరొక చిత్రంలో విలాసవంతమైన భవనాలు చూడవచ్చు.
ఈ చిత్రంపై ఇలా రాశారు, ""తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రేవంత్ తమ్ముడు కొన్న" ఖరీదైన కార్లు, బంగ్లాలు, వాచ్‌లు...".
Xలో ఈ చిత్రాన్ని షేర్ చేస్తూ క్యాప్షన్‌లో ఇలా రాశారు, "కేవలం 2 సంవత్సరాలలో, ఇది నిజమేనా భవానీ... తెలంగాణ దోపిడీదారులు". (ఇంగ్లీష్ నుండి అనువదించబడింది) (ఆర్కైవ్)
Fact Check
న్యూస్‌మీటర్ ఈ క్లెయిమ్ తప్పని కనుగొంది. ఈ చిత్రాలు ఆగస్టు 20న గురుగ్రామ్, ఢిల్లీ ప్రాంతాల్లో ఈడీ నిర్వహించిన దాడుల్లో స్వాధీనం చేసుకున్న ఆస్తులను చూపిస్తున్నాయి.
రివర్స్ ఇమేజ్ సెర్చ్‌లో, ఆగస్టు 25న CNBC TV18 ప్రచురించిన ఒక రిపోర్ట్ కనిపించింది. అందులో గురుగ్రామ్, ఢిల్లీలో ఆగస్టు 20న ఈడీ ఏడు ప్రదేశాల్లో నిర్వహించిన దాడుల్లో స్వాధీనం చేసుకున్న ఆస్తుల ఫొటోలు అంటూ వైరల్ పోస్టులో ఉన్న చిత్రాలను షేర్ చేశారు.
ఆగస్టు 23న ప్రచురించిన ఓ TV9 రిపోర్ట్ ప్రకారం, ఈ దాడులు ఒక నకిలీ కాల్ సెంటర్ స్కామ్ కేసులో జరిగాయి అని రాశారు.
ఈడీ కూడా ఆగస్టు 20న X లో ఈ ఫొటోలు షేర్ చేసి అమెరికా పౌరులను లక్ష్యంగా చేసుకున్న ఈ స్కామ్‌లో రైడ్ జరిగిందని చెప్పింది.
“... టెక్ సపోర్ట్ సేవలను అందిస్తున్నారనే ముసుగులో విదేశీ కస్టమర్లను (ప్రధానంగా US పౌరులు) మోసం చేసి, నవంబర్ 2022 నుండి ఏప్రిల్ 2024 మధ్య సమయంలో, 15 మిలియన్ల అమెరికన్ డాలర్లు దోచుకున్నారు. ” అని పోస్ట్ పేర్కొంది.
ఈడీ ప్రెస్ రిలీజ్ ప్రకారం, ఈ కేసులో నిందితులు అర్జున్ గులాటి, దివ్యాంశ్ గోయెల్, అభినవ్ కల్రా. నోయిడా, గురుగ్రామ్‌లలో అక్రమ కాల్ సెంటర్ నడుపుతూ విదేశీయులను మోసగించారు.
వైరల్ ఫోటోలలో ఉన్న ఆస్తుల నుంచి ఈడీ ఇలా పేర్కొంది “8 లగ్జరీ కార్లు, ఖరీదైన గడియారాలు, విలాసవంతమైన ఇళ్లు స్వాధీనం చేసుకున్నాం. ఇవన్నీ సైబర్ స్కామ్ ద్వారా అక్రమంగా సంపాదించిన డబ్బుతో కొనుగోలు చేసినవని అనుమానం ఉంది.”
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్ట్ తెలంగాణ సీఎం ఏ. రేవంత్ రెడ్డి తమ్ముడు ఏ. కొండల్ రెడ్డి ఆస్తులను చూపించడం లేదు. ఈ చిత్రాలు గురుగ్రామ్, ఢిల్లీలో ఈడీ నకిలీ కాల్ సెంటర్ స్కామ్‌పై చేసిన దాడుల్లో స్వాధీనం చేసుకున్న ఆస్తులను చూపిస్తున్నాయి.
కాబట్టి న్యూస్‌మీటర్ వైరల్ క్లెయిమ్స్ తప్పు అని నిర్ధారించింది.