ఈ నెల 13వ తేదీన ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో ఓ సంచలన ఘటన చోటుచేసుకుంది. మేమంత సిద్ధం బస్సు యాత్రలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై రాళ్ల దాడి జరిగింది. ఈ కేసును పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో Way2News పేరుతో ఓ వార్తా కథనం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
"AP: సీఎం జగన్ పై రాళ్ల దాడి ఘటనలో పోలీసులకు కీలక సమాచారం అందింది. ఈ దాడికి ఒడిగట్టిన ఆగంతకులు హైదరాబాద్ మదీనాగూడలోని చంద్రబాబు వ్యవసాయ క్షేత్రంలో తలదాచుకున్నట్లు పోలీసులకు విశ్వసనీయంగా తెలిసింది. నిందితులను పట్టించిన వారికి రూ.రెండు లక్షల నగదు బహుమతి ఇస్తామని పోలీసులు ప్రకటించడంతో ఓ వ్యక్తి ఈ కీలక సమాచారం అందించినట్లు పోలీసులు పేర్కొన్నారు. సమాచారం తెలిసిన వెంటనే విజయవాడ పోలీసులు తదుపరి చర్యలకు సిద్ధమయ్యారు" అంటూ వైరల్ కథనం పేర్కొంది.
రాళ్ల దాడి నిందితులు దొరికారు! అనే శీర్షికతో చాలా మంది ఫేస్‌బుక్ వినియోగదారులు ఈ వార్తా కథనాన్ని పోస్ట్ చేస్తున్నారు.
నిజ నిర్ధారణ :
Way2News పేరుతో వచ్చిన వార్తా కథనం నకిలీదని న్యూస్‌మీటర్ కనుగొంది.సంబంధిత కీలకపదాలను ఉపయోగించి కీవర్డ్ సెర్చ్ నిర్వహించాము, కానీ సీఎం జగన్ పై జరిగిన రాళ్ల దాడి ఘటనలో నిందితులు చంద్రబాబు నాయుడు వ్యవసాయ క్షేత్రంలో తలదాచుకున్నట్లు ఎలాంటి వార్తా కథనాలు, లేదా వార్తా ప్రసారాలు మాకు కనిపించలేదు.
అయితే మరింత శోధిస్తున్నప్పుడు, ఈ వార్తా కథనాన్ని
Way2News ప్రచురించలేదని Way2News యొక్క అధికారిక ఖాతా ద్వారా X పై ఒక పోస్ట్‌ని కనుగొన్నాము.
ఆ పోస్ట్‌లో Way2News సంస్థ స్పందిస్తూ “మా లోగోను ఉపయోగించి కొందరు తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారని మా దృష్టికి వచ్చింది మరియు ‘అటాచ్ చేసిన పోస్ట్’ వైరల్‌గా మారింది” అంటూ ఈ వార్త కథనం ఫేక్ అని స్పష్టత ఇచ్చారు.
ఆర్కైవ్ లింక్
ఇక్కడవైరల్ వార్త కథనం పై ఉన్న ఆర్టికల్
లింక్ ద్వారా ‘Way2News’లో వెతికితే “దర్యాప్తు అధికారులను మార్చాలి: పవన్ కళ్యాణ్” అనే టైటిల్‌తో ప్రచురించిన అసలైన వార్త దొరికింది. దీన్ని బట్టి అసలైన ‘Way2News’ కథనాన్ని ఎడిట్ చేస్తూ పోస్టులో షేర్ చేసిన ఫోటోలని రూపొందించారు అని నిర్థారించవచ్చు.
ఈరోజు ఏప్రిల్ 16వ తేదీన విజయవాడ పోలీసులు సీఎం జగన్ పై జరిగిన రాళ్ల దాడి కేసులో ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. రాళ్ల దాడికి పాల్పడిన సతీష్‌తో పాటు మరో నలుగురు నిందితులు అజిత్ సింగ్ నగర్, వడ్డెర కాలనీకి చెందిన వారు.
మేమంతా సిద్ధం బస్సు యాత్రలో స్థానికులు తీసిన రాళ్ల దాడికి సంబంధించిన వీడియోలను పోలీసులు పరిశీలించిన తర్వాత వారిని అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. నిందితులు ఇప్పుడు పోలీసుల అదుపులో ఉన్నారు. దర్యాప్తు కొనసాగుతోందని
వార్తా కథనం పేర్కొంది.
అందువల్ల, సీఎం జగన్ పై జరిగిన రాళ్ల దాడి ఘటనలో నిందితులు హైదరాబాద్ మదీనాగూడలోని చంద్రబాబు నాయుడు వ్యవసాయ క్షేత్రంలో తలదాచుకున్నట్లు చెప్తున్న ఈ వార్తా కథనం ఫేక్ అని మేము నిర్ధారించాము.