హైదరాబాద్: సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. అందులో రైల్వే ట్రాక్ పక్కనుంచి భారీగా నీరు ఎగిసిపడుతున్నట్లు కనిపిస్తోంది. దీనిని “మేఘాల నుండి జారిపడ్డ వర్షం నీరు” అని చెబుతూ షేర్ చేస్తున్నారు.
ఒక ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఈ వీడియోను “మేఘాల నుండి జారిపడ్డ వర్షం నీరు వింతగా చూస్తున్న జనం” అనే క్యాప్షన్‌తో షేర్ చేశాడు. (ఆర్కైవ్)
Fact Check
న్యూస్‌మీటర్ పరిశీలనలో ఈ క్లెయిమ్ తప్పు అని తేలింది. వీడియోలో కనిపిస్తున్నది వర్షం నీరు కాదు. గువాహటి నగరంలోని చాంద్మారి ప్రాంతంలో నీటి పైపు పేలిపోవడంతో ఈ దృశ్యం చోటుచేసుకుంది.
వీడియోలోని కీ ఫ్రేములను గూగుల్ లెన్స్‌లో వెతికినప్పుడు, అదే వీడియోను ఇండియా టుడే NE ఇన్‌స్టాగ్రామ్ పేజీలో సెప్టెంబర్ 20, 2025న పోస్టు చేసినట్లు కనిపించింది. వారు, “గువాహటి చాంద్మారి ప్రాంతంలో మధ్యాహ్నం 4:15కు పెద్ద నీటి పైపు పేలింది. కారణం, నష్టం గురించి అధికారులు ఇంకా వివరాలు చెప్పలేదు” అని పేర్కొన్నారు.
ఈ ఆధారంతో మరింతగా శోధించగా ప్రతిదిన్ టైమ్ (Pratidin Time) లో 20 సెప్టెంబర్ 2025న వచ్చిన వార్త దొరికింది. ఆ నివేదికలో, చాంద్మారి ప్రాంతంలో ఒక ప్రధాన నీటి పైపు ఒక్కసారిగా పేలిపోవడంతో భయాందోళన నెలకొన్నట్లు తెలిపారు. నీరు 70–80 అడుగుల ఎత్తులో ఎగసిపడి సమీపంలోని మూడు నుంచి నాలుగు అంతస్తుల భవనాల పైకప్పుల వరకు చేరిందని పేర్కొన్నారు.
అదే వీడియోను అస్సాం ట్రిబ్యూన్ న్యూస్ యూట్యూబ్ ఛానెల్‌లో కూడా అప్‌లోడ్ చేశారు. వీడియో వివరణలో ఈ ఘటన గువాహటి రాజ్‌ఘర్–చాంద్మారి లింక్ రోడ్‌లోని రైల్వే క్రాసింగ్ వద్ద జరిగిందని, ఫలితంగా పరిసరాల్లో భారీగా నీరు చేరిందని తెలిపారు.
వైరల్ వీడియోలో కనిపిస్తున్నది “మేఘాల నుండి జారిపడ్డ వర్షం నీరు” కాదు. ఇది గువాహటి, చాంద్మారి ప్రాంతంలో నీటి పైపు పేలిన ఘటన.
అందువల్ల, న్యూస్‌మీటర్ ఈ క్లెయిమ్‌ను తప్పు అని నిర్ధారించి.