Hyderabad: ఫ్రీ రీఛార్జ్ అందిస్తున్నారనే క్లెయిమ్‌లతో ఒక సోషల్ మీడియా ప్రకటన వైరల్ అవుతోంది. ఎయిర్టెల్, జియో, వీఐ సిమ్ ఉన్నవాళ్ళకి ఈ ఆఫర్ వర్తిస్తుంది అని ప్రకటన పేర్కొంది.
ఈ ప్రకటనలో, టీవీ కథనం ద్వారా ఫ్రీ రీఛార్జ్ గురించి చెబుతున్నట్లు చూడవచ్చు. ఈ వీడియోలో ఇలా అన్నారు, "మీ వద్ద ఎయిర్‌టెల్, జియో లేదా వీఐ సిమ్ ఉంటే, మీకో శుభవార్త. అవును, ఈ సిమ్‌లన్నింటికీ 3 నెలల ఉచిత రీఛార్జ్ ఉంది."
ఈ ఆఫర్‌ను పొందడానికి, ప్రకటన క్రింద ఇవ్వబడిన లింక్‌పై క్లిక్ చేసి, వివరాలను నమోదు చేసి, ప్లాన్‌ను ఎంచుకోవాలని వినియోగదారులను కోరారు.
ఈ ప్రకటనను ఫేస్‌బుక్‌లో షేర్ చేసి, క్యాప్షన్‌లో ఇలా రాశారు, "ఆన్‌లైన్‌లో ఉచిత రీఛార్జ్: మీ ప్రియమైన వ్యక్తి మొబైల్‌ను టాప్ అప్ చేయండి". (ఆర్కైవ్)
ఇవే క్లెయిమ్స్ చేస్తున్న పోస్టులు ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. (ఆర్కైవ్ 1, ఆర్కైవ్ 2)
Fact Check
న్యూస్‌మీటర్ ఈ క్లెయిమ్స్ తప్పు అని నిర్ధారించింది. ఇలాంటి ఆఫర్లు ఏవి లేవు. ఇది వినియోగదారులను ఆకర్షించి, నకిలీ వెబ్‌సైట్‌పై క్లిక్ చేసేలా రూపొందించిన ప్రకటన.
ఎయిర్టెల్, జియో, వీఐ అధికారిక వెబ్‌సైట్‌లో ఇలాంటి ఆఫర్ ఏదైనా ఉందేమో పరిశీలించాం. అయితే, అధికారిక వెబ్‌సైట్‌లలో మాకు అలాంటి ఆఫర్‌లు ఏవీ కనిపించలేదు.
వైరల్ ఫేస్‌బుక్ ప్రకటన క్రింద ఉన్న లింక్‌పై క్లిక్ చేసినప్పుడు, 'openguideme' పేరుతో ఒక వెబ్‌పేజీ తెరవబడింది. ఈ వెబ్‌పేజీలోని శీర్షిక, 'మీ ప్రాంతంలో నమ్మకమైన హోమ్ వైఫై ప్రొవైడర్‌ను కనుగొన్నండి'. ఈ మొత్తం వెబ్‌సైట్‌లో, 3 నెలల పాటు ఉచిత మొబైల్ రీఛార్జ్‌ను అందించే ఆఫర్‌లు లేదా పోర్టల్‌లు మాకు కనిపించలేదు. (ఆర్కైవ్)
పిఐబి ఫాక్ట్ చెక్ ఇలాంటి ఆఫర్ల గురించి వినియోగదారులను వారిస్తూ పోస్టు కూడా చేసింది. ఈ వీడియోలో ఇలా అన్నారు, "అటువంటి అనుమానాస్పద లింక్‌లపై క్లిక్ చేయడం వలన డేటా, సమాచార దొంగతనం జరిగే అవకాశం ఉంది. మోసగాళ్ళు అప్రమత్తంగా లేని వినియోగదారులను ఇలాంటి లింకులపై క్లిక్ చేయించడానికి తమ శాయశక్తులా ప్రయత్నిస్తారు."
ఇలాంటి ఆకర్షణీయమైన ఆఫర్లను చూపిస్తున్న లింకులపై క్లిక్ చేయవద్దని మా పాఠకులకు విజ్ఞాపన చేస్తున్నాం.
అయితే వైరల్ వీడియోలో ఉన్న ప్రకటన వినియోగదారులను మోసగించి, ఒక నకిలీ వెబ్‌సైట్ వైపు మళ్లించడానికే రూపొందించబడింది అని తేలింది. కాబట్టి వైరల్ వీడియోలో ఉన్న ఫ్రీ రీఛార్జ్ క్లెయిమ్స్ తప్పు అని న్యూస్‌మీటర్ నిర్ధారించింది.