(హెచ్చరిక: ఈ కథనంలో కొంతమంది పాఠకులు ఇబ్బందికరంగా భావించే సున్నితమైన విషయాలు ఉన్నాయి. వీక్షకుల జాగ్రత్త వహించి చదవాలని సూచిస్తున్నాం.)
Hyderabad: తిరుపతిలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో జనవరి 8న పెను విషాదం చోటు చేసుకుంది. వైకుంఠ ద్వార దర్శనం టిక్కెట్ల కోసం ఎదురుచూస్తున్న వందలాది మంది భక్తులు ఒక్కేసారి దూసుకురావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు చనిపోయారు. మరో 40 మంది తీవ్రంగా గాయపడ్డారు.
తిరుపతిలో జరిగిన తొక్కిసలాటకు సంబంధించిన ఘటన అంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ వ్యక్తి స్ట్రెచర్ మీద ఉన్న బాలుడి మృతదేహాన్ని తీసుకొని, బైక్ వెనక సీట్లో పట్టుకొని తీసుకెళ్తున్నట్లు కనిపిస్తుంది.
"తిరుపతి ప్రభుత్వ ఆసుపత్రిలో మరణించిన 12 ఏళ్ల పిల్లవాడిని తరలించడానికి అంబులెన్స్ కోసం ₹ 20,000 అడిగారు. డబ్బు లేకపోవడంతో ఆ పిల్లవాడి తండ్రి తన కొడుకును 90 కి.మీ. మోసుకెళ్లాడు!" అని వీడియోలో వ్రాసినట్లు చూడగలము.
ఈ వీడియోని షేర్ చేస్తూ, "తన కొడుకు మృతదేహాన్ని తీసుకువెళ్ళడానికి ఒక తండ్రికి అంబులెన్సు కూడా దొరకలేదా? తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో ఆ అమాయకుడు ప్రాణాలు కోల్పోయాడు" అని క్యాప్షన్‌లో వ్రాశారు. (హిందీ నుండి అనువదించబడింది) (ఆర్కైవ్)
Fact Check
న్యూస్‌మీటర్ ఈ క్లెయిమ్ తప్పు అని కనుగొంది. 2022లో తిరుపతిలోని రూయా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన కొడుకు మృతదేహాన్ని ఒక తండ్రి మోటార్‌బైక్‌పై తీసుకెళ్తున్నట్లు వీడియో చూపిస్తుంది.
వీడియో కీఫ్రేమ్‌ను రివర్స్ సెర్చ్ చేయగా, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు ఏప్రిల్ 26, 2022న షేర్ చేసిన అదే ఫుటేజ్ మాకు కనిపించింది.
తిరుపతిలోని రూయా ఆసుపత్రిలో బాలుడు జేసవ విషాదకరంగా మరణించాడని ఆయన పోస్టులో పేర్కొన్నారు. అంత్యక్రియల కోసం చిన్నారిని అంబులెన్స్‌లో కాకుండా బైక్ మీద తీసుకెళ్లడానికి కారణం అధిక రుసుములే అని చంద్రబాబు అన్నారు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలు శిథిలావస్థకు చేసురుకున్నాయని ఆయన విమర్శించారు.
ఈ సంఘటన గురించి ఏప్రిల్ 2022లో Deccan Herald, The Hindu వంటి వార్త సంస్థలు కథనాలు ప్రచురించాయి.
వారి కథనాల ప్రకారం, 10 ఏళ్ల బాలుడిని కిడ్నీ, కాలేయ వ్యాధుల చికిత్స కోసం శ్రీ వెంకటేశ్వర రామ్‌నారాయణ్ రుయా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో చేర్పించారు. విషాదకరంగా, ఆ బాలుడు మరణించాడు. అంబులెన్స్ డ్రైవర్లు తన కొడుకు మృతదేహాన్ని తరలించడానికి రూ. 10,000 (కొన్ని కథనాలు రూ. 20,000 అని పేర్కొన్నాయి) డిమాండ్ చేయడంతో దుఃఖంలో ఉన్న తండ్రి షాక్‌కు గురయ్యాడు. వేరే మార్గం లేకపోవడంతో, తండ్రి తన బంధువు ద్విచక్ర వాహనం వెనక సీటుపై తన బిడ్డ మృతదేహాన్ని మోసుకెళ్లాల్సి వచ్చింది.
ఏప్రిల్ 2022లో The Hindu పత్రిక ప్రచురించిన మరో కథనం ప్రకారం, ఈ సంఘటన తర్వాత, తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర రామనారాయణ రుయా ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ (GGH) రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సరస్వతిని సస్పెండ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఒక వ్యక్తి తన కొడుకు మృతదేహాన్ని మోటార్ సైకిల్‌పై మోసుకెళ్లిన హృదయ విదారక సంఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత ఈ చర్య తీసుకున్నారు.
ఈ వీడియో తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో తీయబడింది అనే క్లెయిమ్‌లపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు, ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ఫ్యాక్ట్-చెక్ యూనిట్ X పోస్టు ద్వారా స్పందించారు. వైరల్ అవుతున్న వీడియో 2022 నాటిదని, తిరుపతి తొక్కిసలాటతో దీన్ని తప్పుగా ముడిపెడుతున్నారని పేర్కొన్నారు.
కాబట్టి, వీడియో 2022 నాటిదని నిర్ధారించాము. వైరల్ క్లెయిమ్స్ తప్పు.