Fact Check: ట్రంప్ అమెరికా కంపెనీల నుండి భారతీయ కస్టమర్ సర్వీస్ ఏజెంట్లను నిషేధించారా? కాదు, ఇది ఎడిట్ చేయబడిన వీడియో
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశాన్ని 'విషపూరిత దేశం' అంటూ, అమెరికా కంపెనీలు 'బాగా ఇంగ్లీష్ మాట్లాడే' భారతీయులకు కస్టమర్ కేర్ ఉద్యోగాలను అవుట్‌సోర్స్ చేయడం నిషేధించడాన్ని చూపించే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
By K Sherly Sharon Published on 22 Feb 2025 7:30 PM IST
Claim: ట్రంప్ భారతదేశాన్ని 'విషపూరితం' అన్నారు, అమెరికా కంపెనీలు భారతదేశానికి కస్టమర్ సర్వీస్ ఉద్యోగాలను అవుట్‌సోర్స్ చేయకుండా నిషేధించారు.
Fact: వైరల్ క్లెయిమ్ తప్పు. ఇది ఎడిట్ చేసి రూపొందించిన వ్యంగ్య వీడియో.
Hyderabad: అమెరికా అధ్యక్షుడిగా రెండవసారి ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుండి, డొనాల్డ్ ట్రంప్ వరుసగా ఉత్తర్వులు జారీ చేస్తున్నారు. జన్మతః పౌరసత్వాన్ని రద్దు చేయడం, అక్రమ భారతీయ వలసదారులను బహిష్కరించడం, USAIDకి నిధులను స్తంభింపజేయడం వంటి నిర్ణయాలు తీవ్ర ప్రతిచర్యలకు దారితీశాయి.
ఈ రాజకీయ పరిణామాల మధ్య, ట్రంప్ కొత్త 'కస్టమర్ సర్వీస్ బిల్లు'కు సంబంధించి కార్యనిర్వాహక ఉత్తర్వు జారీ చేశారని పేర్కొన్న ఒక వార్త ప్రసారం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ వీడియోలో, ఒక రిపోర్టర్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను తన కొత్త కస్టమర్ సర్వీస్ బిల్లు గురించి అడగడం వినవచ్చు. ప్రశ్నకు సమాధానమిస్తూ కంపెనీలు ఇకపై ఇమెయిల్ ద్వారా మాత్రమే ఉత్తర ప్రత్యుత్తరాలు జరపలేవని, బాగా ఇంగ్లీష్ మాట్లాడే విదేశీయులను కస్టమర్ సర్వీస్ ప్రతినిధులుగా నియమించడం కుదరదని, ఇది వ్యాపారాన్ని దెబ్బతీస్తుందని అన్నట్లు చూడగలం.
ఈ వీడియోలో బహిరంగ ప్రదేశాల్లో భారీ చెత్త కుప్పల చిత్రాలను ప్రదర్శిస్తుండగా, ట్రంప్ ఇలా అన్నారు, "భారతీయులు తమ దేశంలోని చెత్తను శుభ్రం చేసేందుకు ఉద్యోగాలు చేయాలి, ఇది భారతదేశంలోని ప్రతి చోటా ఉంది. వారు పట్టించుకోరు. వారు నదులలో చాలా చెత్త, ప్లాస్టిక్‌లను కూడా వేస్తారు." (ఇంగ్లీష్ నుండి అనువదించబడింది)
"వారు అన్నింటినీ శుభ్రం చేసే వరకు భారతదేశానికి పంపే నిధుల్ని ఆపివేస్తున్నాం... వారు వారి విషపూరిత దేశాన్ని శుభ్రం చేస్తే, బహుశా వారికి కొన్ని అమెరికన్ ఉద్యోగాలు ఇస్తాం" అని ట్రంప్ వీడియోలో అన్నట్లు చూడగలం.. వీడియో నేపథ్యంలో ప్రజలు నవ్వుతున్నట్లు వినిపిస్తుంది.
ఒక ఫేస్‌బుక్ యూజర్ ఈ వీడియోను షేర్ చేసి, “అమెరికా అధ్యక్షుడి ప్రకారం, మన దేశాన్ని మనం శుభ్రం చేసుకునే వరకు అమెరికాలోని భారతీయులకు ఉద్యోగాలు లేవు” అని రాశారు. (ఆర్కైవ్)
ఇప్పుడు తొలగించబడిన ట్వీట్‌లో, ఒక X యూజర్ వీడియోను షేర్ చేసి, “భారతీయుల కోసం ట్రంప్ చేసిన అగౌరవ వ్యాఖ్యలు. మోడీ తనను మరియు భారతీయులను అంచనా వేసుకున్నది ఇదే” అని రాశారు.(ఇంగ్లీష్ నుండి అనువదించబడింది)
ట్వీట్ యొక్క ఆర్కైవ్ చేసిన వెర్షన్‌ను ఇక్కడ చూడవచ్చు.
క్లెయిమ్ చేస్తున్న పోస్ట్‌లు ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. (ఆర్కైవ్ 1, ఆర్కైవ్ 2)
Fact Check
వైరల్ క్లెయిమ్ తప్పు అని న్యూస్‌మీటర్ కనుగొంది. వీడియో ఎడిట్ చేసి తయారు చేయబడింది.
భారతీయులను లక్ష్యంగా చేసుకుని కొత్త కస్టమర్ సర్వీస్ బిల్లుపై ట్రంప్ చేసిన ప్రకటన గురించి విశ్వసనీయ వార్తల కథనాల కోసం శోధించాం. అలాంటి కథనాలేవి కనిపించలేదు. ఈ విషయంలో డోనాల్డ్ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ గురించి మాట్లాడుతున్నట్లు ఎటువంటి కథనాలు, సోషల్ మీడియా పోస్ట్‌లు లేదా వీడియో ఫుటేజ్ కూడా లేవు.
వీడియోలో ట్రంప్ మాట్లాడుతుంటే.. తల మాత్రమే కదలడం, శరీరం కదలకుండా ఉండటం, వీడియోలో వినిపిస్తున్న నవ్వు ముందే రికార్డ్ చేయబడినట్లు ఉంది వంటి అనేక దృశ్య, ఆడియో వ్యత్యాసాలు ఉన్నాయని గమనించాం.
వైరల్ వీడియోలో 'సోబరింగ్ సెటైర్' అని రాసి ఉంది, టీవీ ఛానల్ పేరు 'Faux News' అని ప్రస్తావించబడింది. ఇది వ్యంగ్యం కోసం ఎడిట్ చేసి తయారు చేసిన వీడియో, నిజమైన ప్రసారం కాదు అని ఈ విషయాలు సూచిస్తున్నాయి.
వైరల్ వీడియో చివరలో, స్క్రీన్‌పై "పెర్ఫార్మెన్స్ & ఇంప్రెషన్స్ బై మైఖేల్ క్లైవ్. మాస్క్ బై అల్. www.MichaelClive.com" అని రాసి ఉన్నట్లు కనిపించింది.
ఇప్పటివరకు సేకరించిన సమాచారాన్ని ఉపయోగించి, తనను తాను హాస్యనటుడు, వాయిస్ ఆర్టిస్ట్, అనుకరణా నిపుణుడు అని పిలుచుకునే మైఖేల్ క్లైవ్ వెబ్‌సైట్‌ను కనుగొన్నాం. ఈ వెబ్‌సైట్ మైఖేల్ క్లైవ్ యూట్యూబ్ ఖాతాకు లింక్ చేయబడింది, అక్కడ అతను ట్రంప్‌తో సహా పలువురు ప్రముఖ వ్యక్తుల అనుకరిస్తున్న అనేక వీడియోలను ఉన్నాయి.
సోబరింగ్ సెటైర్ యూట్యూబ్ ఛానెల్లో జనవరి 25, 2025 నాటి 'ట్రంప్స్ కొత్త ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అద్వితీయం!' అనే శీర్షికతో వైరల్ వీడియో ఉన్నట్లు కనుగొన్నాం.
వీడియో వివరణలో, "ఈ వీడియో వ్యంగ్యం. భారతదేశం అజాగ్రత్త, కాలుష్యం మాత్రం నిజం. ట్రంప్ ఇంప్రెషన్ & పెర్ఫార్మెన్స్ బై క్లైవ్. ఈ వీడియోను ఏఐ రాయలేదు, వాయిస్ ఇవ్వలేదు లేదా ప్రదర్శించలేదు. ఇది క్లైవ్ ముఖం/ప్రదర్శనను మాత్రమే కప్పేందుకు ఉపయోచించాం. www.michaelclive.comలో మరిన్ని వివరాలు తెలుసుకోండి. మీరు కోరిన వాయిస్, రచన, కామెడీని తయారు చేయడం కోసం నన్ను సంప్రదించండి,” అని రాశారు.
ఈ ఛానెల్, వీడియో మైఖేల్ క్లైవ్‌తో కూడా లింక్ చేయబడిందని, వైరల్ వీడియోను తయారు చేసింది అతనేనని ఇది చూపించింది.
కాబట్టి, వైరల్ క్లెయిమ్ తప్పు అని న్యూస్‌మీటర్ తేల్చింది. ఈ వీడియో వ్యంగ్యంగా ఉద్దేశించిన ఎడిట్ చేసి తయారు చేయబడిన వీడియో మాత్రమే.