Hyderabad: పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ మర్చి 25న ఆంధ్ర ప్రదేశ్ రాజమండ్రి శివార్లలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఈ నేపథ్యంలో, ప్రవీణ్ కుమార్‌ని ఉద్దేశించి ఒక మహిళా చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో ఆయన మరణానంతరం చేసినట్లు క్లెయిమ్ చేస్తూ షేర్ చేస్తున్నారు.
ఈ వీడియోలో ఒక మహిళ వ్యంగ్యంగా పాట పాడడం చూడగలం. వీడియో మీద "పగడాలు పగిలిందా?.." అని రాసి ఉంది.
ఈ వీడియోని షేర్ చేస్తూ "ఈమె తీరు స్త్రీ సహజ తత్వానికే భిన్నం.. స్త్రీలకు సహజ సౌమ్యత ఉంటుంది. ఈమె అది పూర్తిగా కోల్పోయింది. ఒకని మరణం ఈమెకు ఇంత వెక్కిరింపు, ఎగతాళిగా ఉంటే, ఈమె ఉండాల్సింది ఇంకా మానవత్వం మిగిలివున్న మనుష్యుల మధ్యలోనైతే కాదు. ఇది వినగానే, ఈమె వంకర నాలుక చూస్తే ఈమెను పోల్చి పలకడానికి ఏమైనా మాటలు ఏ డిక్షనరీలోనైనా దొరుకుతాయా? - మృత్యుంజయ, ఎల్. కె." అనే క్యాప్షన్ రాశారు. (ఆర్కైవ్)
ఇవే క్లెయిమ్స్ చేస్తున్న వీడియోస్ ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు.
Fact Check
న్యూస్‌మీటర్ ఈ క్లెయిమ్స్ తప్పు అని నిర్ధారించింది. వైరల్ అవుతున్న పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ మరణానికి ముందు తీసినది.
వైరల్ అవుతున్న వీడియోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా 2025 ఫిబ్రవరి 12న యూట్యూబ్‌లో అప్లోడ్ చేసిన వీడియో దొరికింది. ఈ వీడియోని "పగడాలు పగిలిందా🤣.. || పాస్టర్ ప్రవీణ్ పగడాల || కరుణాకర్ సుగ్గున || పార్వతి హిందూ ధర్మ రక్షణ" అనే శీర్షికతో అప్లోడ్ చేశారు.
"నా పేరు పార్వతీ. గత వెయ్యేళ్ల నుండి మన సనాతన ధర్మాన్ని నాశనం చేయడానికి వివిధ రకాల మతస్తులు ప్రయత్నిస్తున్నారు" అనే వివరణతో వీడియోని అప్లోడ్ చేసినట్టు చూడగలం.
ఈ యూట్యూబ్ ఛానెల్లో మతతత్వాన్ని రెచ్చగొట్టే ఇలాంటి అనేక వీడియోలను కనుగొన్నాం. అయితే పాస్టర్ ప్రవీణ్ కుమార్‌ని ఉద్దేశించి వైరల్ అవుతున్న వ్యంగ్యమైన వీడియో, ఆయన మరణానికి ముందే, ఫిబ్రవరి 12న అప్లోడ్ చెయ్యబడింది అని తేలింది.
కాబట్టి వైరల్ క్లెయిమ్స్ తప్పు అని న్యూస్‌మీటర్ నిర్ధారించింది.