Fact Check: సంకెళ్లతో బంధించిన భారతీయ వలసదారులను అమెరికా నుండి పంపిస్తున్న దృశ్యాలు? అసలు నిజం ఇది...
చేతులకు సంకెళ్లు, కాళ్లకు గొలుసులు వేసి భారతీయ వలసదారులను అమెరికా నుండి పంపిస్తున్న దృశ్యాలు అని క్లెయిమ్‌లతో ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
By K Sherly Sharon Published on 6 Feb 2025 5:55 PM ISTClaim: సంకెళ్లతో బంధించి అమెరికా నుండి భారతీయ వలసదారులను పంపిస్తున్న దృశ్యాన్ని చూపిస్తున్న వీడియో.
Fact: ఈ క్లెయిమ్స్ తప్పు. వీడియోలో కనిపిస్తున్న వారు భారతీయ వలసదారులు కాదు.
Hyderabad: అమెరికా నుంచి భారత వలసదారులను సంకెళ్లతో పంపారు అని క్లెయిమ్‌లతో సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. అమెరికా రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన కొద్దికాలానికే, డొనాల్డ్ జె. ట్రంప్ దక్షిణ సరిహద్దులో జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించి, లక్షలాది మంది "విదేశీ నేరస్థులను" బహిష్కరిస్తూ అక్రమ ప్రవేశాన్ని నిలిపివేయాలని ఆజ్ఞలు జారీ చేశారు. ఈ క్రమంలో వందలాది మంది అక్రమ వలసదారులను అమెరికా నుంచి బహిష్కరించారు.
ఈ నేపథ్యంలో భారతీయులను సంకెళ్లతో పంపుతున్నారంటూ ఒక 30 సెకండ్ల వీడియోను ఫేస్‌బుక్‌లో షేర్ చేశారు. సంకెళ్లు, గొలుసులతో బంధించిబడిన కొంత మంది విమానం ఎక్కుతున్నట్లు చూపిస్తున్న ఈ వీడియోను ఎనిమిది వేరు వేరు వీడియో క్లిప్స్ ఉపయోగించి తయారు చేశారు. "అక్రమ వలసదారులను భారతదేశానికి బహిష్కరించడం ప్రారంభించారు. ఫిబ్రవరి 3: సి-17 విమానం అక్రమ వలసదారులతో బయలుదేరింది. అక్రమ వలసదారులపై ట్రంప్ కఠిన చర్యల మధ్య బహిష్కరణ." అని వీడియోలో చదవగలం.
ఈ ఫేస్‌బుక్ పోస్ట్‌లో కాప్షన్:
"భారతీయులను ఇలా సంకెళ్లు వేసి పంపడం దేశ గౌరవం మర్యాద మంటగలినట్లు కాదా. వాహ్ మోడీ వాహ్" అని వ్రాశారు. (ఆర్కైవ్)
Fact Check
న్యూస్‌మీటర్ ఈ క్లెయిమ్స్ తప్పు అని కనుగొంది. వైరల్ వీడియోలో సంకెళ్లతో కనిపిస్తుంది.. భారతీయులు కాదు.
ఈ వీడియోలో "First Post" అనే వార్త వెబ్సైట్ లోగోను చూడగలం. First Post యూట్యూబ్ ఛానెల్లో ఇదే వీడియోను "అక్రమ భారతీయ వలసదారులను ట్రంప్ బహిష్కరించారు" అనే శీర్షికతో 2025 ఫిబ్రవరి 4న అప్లోడ్ చేశారు.
ఈ వీడియో కీ ఫ్రేములను రివర్స్ ఇమేజ్ సెర్చ్ ద్వారా వెతికితే ANI News అప్లోడ్ చేసిన యూట్యూబ్ వీడియో దొరికింది. ఈ వీడియో నిడివి 6 గంటలకు పైగా ఉంది. దీనిని "ఫుటేజ్‌లో వలసదారులను బహిష్కరించే విమానంలో ఎక్కిస్తున్న దృశ్యాలు | ట్రంప్ ఇమ్మిగ్రేషన్ అణిచివేత | ICE దాడులు" అనే శీర్షికతో 2025 జనవరి 31న అప్‌లోడ్ చేయబడింది.
First Post వీడియోలో ఉన్న అదే దృశ్యాలను ఈ వీడియోలో కనుగొన్నాం. ఈ వీడియో సమాచారం ప్రకారం ఈ దృశ్యాలను అమెరికా రక్షణ శాఖ విడుదల చేసిందని తెలుస్తోంది. "ఈ జనవరి 23 నాటి ఫుటేజ్‌లో అమెరికా కస్టమ్స్, బోర్డర్ ప్రొటెక్షన్ ఏజెంట్ల ద్వారా గొలుసులతో బంధించబడి, చేతికి సంకెళ్లు వేయబడిన వ్యక్తులను సైనిక విమానంలోకి నడిపిస్తున్నట్లు కనిపించిందని రక్షణ శాఖ (DoD) తెలిపింది," అని పేర్కొన్నారు.
ఈ వీడియోలో కనిపిస్తున్న ఘటన 2025 జనవరి 23న ఫోర్ట్ బ్లిస్స్, టెక్సాస్‌లో జరిగిందని తేలింది.
వైరల్ వీడియోలో చూపిస్తున్న వ్యక్తుల ఫోటోను France 24 జనవరి 25, 2025న "చిత్రాలలో: ట్రంప్ అధ్యక్ష పదవికి సంబంధించిన మొదటి బహిష్కరణ విమానాలు లాటిన్ అమెరికాలోకి వస్తాయి" (ఇంగ్లీష్ నుండి అనువదించబడింది) అనే నివేదికలో ప్రచురించింది.
"రక్షణ శాఖ విడుదల చేసిన ఈ చిత్రం, జనవరి 23, 2025న టెక్సాస్‌లోని ఫోర్ట్ బ్లిస్‌లో బహిష్కరణ విమానం కోసం 60వ ఎయిర్ మొబిలిటీ వింగ్‌కు కేటాయించబడిన C-17 గ్లోబ్‌మాస్టర్ IIIలో ఎక్కడానికి సిద్ధమవుతున్న సంకెళ్లు వేయబడిన వలసదారులను చూపిస్తుంది." (ఇంగ్లీష్ నుండి అనువదించబడింది)
ఈ నివేదిక నుండి, వైరల్ వీడియోలో కనిపిస్తున్న వలసదారులు 2025 జనవరి 23న టెక్సాస్‌లోని ఫోర్ట్ బ్లిస్‌లో C-17 గ్లోబ్‌మాస్టర్ III ఎక్కారని కనుగొన్నాం.
కీవర్డ్ శోధనలను ఉపయోగించి, జనవరి 24, 2025న ప్రచురించబడిన "మెక్సికో సరిహద్దుకు దళాలను తరలించడానికి సైన్యం చేస్తున్న పోరాటం లోపల" (ఇంగ్లీష్ నుండి అనువదించబడింది) అనే శీర్షికతో Military.com కథనాన్ని కనుగొన్నాము. రెండు C-17 గ్లోబ్‌మాస్టర్ III విమానాలు టెక్సాస్‌లోని ఫోర్ట్ బ్లిస్, అరిజోనాలోని టక్సన్ నుండి బయలుదేరి గ్వాటెమాల చేరుకున్నాయని నివేదిక పేర్కొంది.
అందువల్ల, వైరల్ వీడియో భారతీయులది కాదు, గ్వాటెమాల వలసదారులను చూపిస్తుందని తేలింది.
భారతీయ వలసదారుల బహిష్కరణ
ఫిబ్రవరి 5, 2025న The Hindu ప్రచురించిన నివేదిక ప్రకారం.. అమెరికా బహిష్కరించిన అక్రమ భారతీయ వలసదారుల మొదటి బ్యాచ్ అదే రోజున అమృత్‌సర్‌లో దిగింది.
"104 మంది అక్రమ భారతీయ వలసదారులతో కూడిన అమెరికా సైనిక విమానం బుధవారం (ఫిబ్రవరి 5, 2025) మధ్యాహ్నం అమృత్‌సర్‌లోని శ్రీ గురు రామ్‌దాస్ జీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగిందని వర్గాలు తెలిపాయి."
అందువల్ల, వైరల్ వీడియో వాస్తవానికి జనవరి 23, 2025న టెక్సాస్‌లోని ఫోర్ట్ బ్లిస్ నుండి సంకెళ్ళు వేయబడిన వలసదారులు విమానంలోకి ఎక్కుతున్నట్లు చూపించే అమెరికా రక్షణ శాఖ విడుదల చేసిన ఫుటేజ్ నుండి తీసుకోబడింది. విమానం భారతదేశానికి కాదు, గ్వాటెమాలకు వెళ్లింది. భారతీయ బహిష్కరణకు గురైన వారి మొదటి బ్యాచ్ ఫిబ్రవరి 5, 2025న వచ్చింది.
'చేతులకు సంకెళ్లు, కాళ్లకు గొలుసులు, 40 గంటలు వాష్‌రూమ్‌ను ఉపయోగించడానికి ఇబ్బంది పడ్డాము, పెట్టెల్లాగా మమల్ని విసిరేశారు' అని ఫిబ్రవరి 5న వచ్చిన పలువురు భారతీయ వలసదారులు వారి అనుభవాలను NDTV, Indian Expressతో పంచుకున్నారు. అయితే వైరల్ వీడియోలో కనిపిస్తున్నది మాత్రం భారతీయ వలసదారులు కాదు, గ్వాటెమాలకు చెందిన వారు అని తెలుస్తోంది.
భారత వలసదారులను గొలుసులతో బంధించి తరలిస్తున్న అసలు వీడియోను యూ ఎస్ బోర్డర్ పెట్రోల్ చీఫ్ మైఖేల్ బ్యాంక్స్ Xలో షేర్ చేశారు. (ఆర్కైవ్)
USBP and partners successfully returned illegal aliens to India, marking the farthest deportation flight yet using military transport. This mission underscores our commitment to enforcing immigration laws and ensuring swift removals.
— Chief Michael W. Banks (@USBPChief) February 5, 2025
If you cross illegally, you will be removed. pic.twitter.com/WW4OWYzWOf
కాబట్టి, వైరల్ క్లెయిమ్స్ అవాస్తవమని న్యూస్‌మీటర్ నిర్ధారించింది.