హైదరాబాద్: అరావళి పర్వతాలను రక్షించాలనే #SaveAravalli ఉద్యమం ఉత్తర భారతదేశంలో ఊపందుకుంది. నవంబర్ 20, 2025న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో, స్థానిక ఎత్తు నుంచి 100 మీటర్లకు పైబడిన భౌగోళిక నిర్మాణాలకే అరావళి పర్వతాలుగా గుర్తింపు ఉంటుందని పేర్కొనడంతో పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయం వల్ల తక్కువ ఎత్తున్న అరావళి ప్రాంతాలు గనుల తవ్వకాలు, నిర్మాణాలకు తెరుచుకునే ప్రమాదం ఉందని, ఇది ఢిల్లీ–ఎన్‌సీఆర్‌తో పాటు పరిసర ప్రాంతాల పర్యావరణం, భూగర్భజలాలు, గాలి నాణ్యతపై ప్రభావం చూపుతుందని వారు హెచ్చరిస్తున్నారు.
ఈ నేపథ్యంలో, అరావళి పర్వతాల్లో గనుల తవ్వకాలకు వ్యతిరేకంగా లక్షల మంది నిరసన చేపట్టారని చెబుతూ ఒక పెద్ద జనసమూహం వీడియోను తెలుగులో ఉన్న క్యాప్షన్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ప్రధాన మీడియా కార్పొరేట్ నియంత్రణలో ఉండటం వల్ల ఈ ఉద్యమాన్ని ప్రసారం చేయడం లేదని ఆ పోస్ట్‌లో ఆరోపించారు.(Archive)
Fact Check
న్యూస్‌మీటర్ పరిశీలనలో ఈ క్లెయిమ్ తప్పుఅని తేలింది. వైరల్ వీడియోకు అరావళి పర్వతాల్లో మైనింగ్ నిరసనలతో ఎలాంటి సంబంధం లేదు.
రివర్స్ ఇమేజ్ సెర్చ్ ద్వారా వీడియో మూలాన్ని పరిశీలించగా, ఇది రాజస్థాన్‌లోని కరౌలి జిల్లాలో ప్రతిపాదిత డుంగ్రీ డ్యాం ప్రాజెక్ట్‌కు వ్యతిరేకంగా నిర్వహించిన మహాపంచాయతీకి సంబంధించినదిగా గుర్తించబడింది. ఈ మహాపంచాయతీ 2025 నవంబర్ 21న సపోత్రా ఉపవిభాగంలోని జోడ్లి పవర్ హౌస్ గ్రామ పంచాయతీ ప్రాంగణంలో జరిగింది.
ఈ సమావేశంలో వేలాది మంది రైతులు, స్థానిక ప్రజలు పాల్గొని, ఈస్టర్న్ రాజస్థాన్ కెనాల్ ప్రాజెక్ట్ (ERCP)లో భాగంగా ప్రతిపాదిత డుంగ్రీ డ్యాం వల్ల కరౌలి, సవాయి మాధోపూర్ జిల్లాల్లోని 70కు పైగా గ్రామాల భూములు మునిగిపోతాయని నిరసన వ్యక్తం చేశారు.
ఈ మహాపంచాయతీలో రైతు నేత రాకేశ్ టికాయత్‌తో పాటు హన్సరాజ్ మీనా, రమేష్ చంద్ మీనా, నరేష్ మీనా వంటి స్థానిక రాజకీయ నేతలు పాల్గొన్నారు. ప్రభుత్వ డిమాండ్లు నెరవేర్చకపోతే డిసెంబర్ 10 నుంచి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు.
వీడియో విశ్లేషణ
వైరల్ ఇన్‌స్టాగ్రామ్ వీడియోలోని ముఖ్య ఫ్రేమ్‌లను డుంగ్రీ డ్యాం వ్యతిరేక మహాపంచాయతీకి సంబంధించిన ధృవీకరించిన వీడియోలతో న్యూస్‌మీటర్ పోల్చిచూసింది. వేదిక అలంకరణ, తెరిచి ఉన్న మైదానం, చెట్లు, నీటి ట్యాంకులు, జనసమూహం సాంద్రత వంటి అంశాలు పూర్తిగా సరిపోలుతున్నాయి.
నవంబర్ 21, 2025న న్యూస్18 రాజస్థాన్ ప్రసారం చేసిన “డూంగ్రీ డ్యాం వ్యతిరేక మహాపంచాయతీ” వీడియోలో కనిపించిన దృశ్యాలు కూడా వైరల్ క్లిప్‌తో అచ్చుగానే సరిపోతున్నాయి. NDTV రాజస్థాన్ సహా ఇతర విశ్వసనీయ మీడియా కథనాల్లోనూ ఈ మహాపంచాయతీ వివరాలే ఉన్నాయేగానీ, అరావళి పర్వతాల్లో మైనింగ్ నిరసనల గురించి ఎక్కడా ప్రస్తావన లేదు.
అందువల్ల, రాజస్థాన్‌లో డుంగ్రీ డ్యాం వ్యతిరేకంగా జరిగిన మహాపంచాయతీ వీడియోను అరావళి పర్వతాల్లో గనుల తవ్వకాలకు వ్యతిరేక నిరసనలుగా చూపడం తప్పుదారి పట్టించేదే. కాబట్టి ఈ క్లెయిమ్ తప్పు.