హైదరాబాద్: ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు ఇటీవలి రోజుల్లో తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. అమెరికా-ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ ఫిబ్రవరి 28, 2026న మరణించినట్లు ఇరాన్ అధికార మీడియా ప్రకటించింది. దీనికి ప్రతీకారంగా ఇరాన్, టెల్ అవీవ్ జెరూసలేం సహా పలు ఇజ్రాయెల్ నగరాలపై క్షిపణి దాడులు జరిపింది.
కొన్ని ప్రాంతాల్లో ప్రాణనష్టం జరిగినప్పటికీ, అనేక క్షిపణులను ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నట్లు సమాచారం. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 1–3 వరకు పరిస్థితి మరింత ఉద్రిక్తమైంది. ఈ పరిణామాల నేపథ్యంలో సోషల్ మీడియాలో పలు వీడియోలు వైరల్ అవుతున్నాయి.
ఇలాంటి పరిస్థితుల్లో, రాత్రి వేళలో రెండు భారీ పేలుళ్లు సంభవించినట్లు చూపించే ఒక వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. ఈ వీడియో టెల్ అవీవ్‌లో ఇటీవల జరిగిన దాడులను చూపిస్తోందని వినియోగదారులు పేర్కొంటున్నారు.
ఒక ఫేస్‌బుక్ యూజర్ ఈ వీడియోను షేర్ చేస్తూ, “టెల్ అవీవ్ పై ఇరాన్ భయంకర దాడులు చేస్తుంది. ఈ వార్త CNN వార్తా చానల్ నుండి నిర్ధారించబడింది” అని క్యాప్షన్ ఇచ్చారు.(Archive)
ఫ్యాక్ట్ చెక్
న్యూస్‌మీటర్ పరిశీలనలో ఈ క్లెయిమ్ తప్పని తేలింది. వైరల్ వీడియో టెల్ అవీవ్‌కు సంబంధించినది కాదు. దీనికి ప్రస్తుత ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణలతో ఎలాంటి సంబంధం లేదు. ఇది 2015లో చైనాలో జరిగిన పేలుళ్ల వీడియో.
విజువల్స్ పరిశీలన
వైరల్ వీడియోలోని కీలక ఫ్రేమ్‌లను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, “2015లో చైనాలోని టియాంజిన్‌లో జరిగిన భారీ పేలుళ్లను ఒక వ్యక్తి దగ్గరగా రికార్డ్ చేస్తున్నాడు.” అనే శీర్షికతో ఉన్న ఒక రెడ్డిట్ పోస్టు కనిపించింది. అందులోని వీడియో వైరల్ క్లిప్‌కు పూర్తిగా సరిపోలింది.
తదుపరి కీవర్డ్ సెర్చ్ ద్వారా బీబీసీ న్యూస్ యూట్యూబ్ ఛానెల్‌లో 2015 ఆగస్టు 14న ప్రచురించిన “టియాంజిన్ పేలుడు వీడియో ప్రత్యక్ష సాక్షుల భయాన్ని సంగ్రహిస్తుంది” అనే వీడియోను గుర్తించాము.
ఆ వీడియో వివరణ ప్రకారం, చైనా దేశంలోని టియాంజిన్ పోర్ట్ నగరంలో ప్రమాదకర రసాయన పదార్థాలను నిల్వ ఉంచిన గోదాములో అగ్నిప్రమాదం సంభవించి, తరువాత రెండు భారీ పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనలో డజన్ల కొద్దీ మంది మరణించగా, వందలాది మంది గాయపడ్డారు. సంఘటనను ప్రత్యక్షంగా చూసిన వ్యక్తి ఈ దృశ్యాలను చిత్రీకరించినట్లు పేర్కొన్నారు.
బీబీసీ ప్రచురించిన వీడియోలో కనిపించిన దృశ్యాలు, ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోతో పూర్తిగా సరిపోలుతున్నాయి.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో టెల్ అవీవ్‌లో ఇటీవల జరిగిన పేలుళ్లకు సంబంధించినది కాదు. ఇది 2015 ఆగస్టులో చైనాలోని టియాంజిన్ నగరంలో జరిగిన రసాయన గోదాం పేలుళ్లకు సంబంధించిన పాత వీడియో.
అందువల్ల ఈ క్లెయిమ్ తప్పు.