Hyderabad: దక్షిణ కొరియాలో పాకిస్తాన్ రాయబార కార్యాలయ ఉద్యోగులు దొంగతనం చేసినందుకు అరెస్టు అయ్యారు అనే క్లెయిమ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్లెయిమ్‌లతో దక్షిణ కొరియా, పాకిస్తాన్ జాతీయ జెండాల చిత్రాలతో షేర్ చేస్తున్నారు.
ఈ చిత్రంపై అదే క్లెయిమ్ ఇంగ్లీషులో ప్రస్తావించారు. దీనిపై 'Kreately Media' అని రాసి ఉంది. ఈ పోస్టుని ఫేస్‌బుక్‌లో షేర్ చేస్తూ, క్యాప్షన్‌లో ఇలా రాశారు, "దక్షిణ కొరియాలో 2 పాకిస్తాన్ దౌత్యవేత్తలు... టోపీలు & చాక్లెట్లు దొంగిలించినందుకు అరెస్టుపై". (ఆర్కైవ్)
@HPhobiaWatch అనే X అకౌంట్లో ఇదే క్లెయిమ్ జులై 9న పోస్ట్ చేయబడింది. ఈ పోస్టులో కొరియా టైమ్స్ ప్రచురించిన వార్త కథనం స్క్రీన్‌షాట్ కూడా షేర్ చేశారు. (ఆర్కైవ్)
Fact Check
న్యూస్‌మీటర్ ఈ క్లెయిమ్ తప్పు అని కనుగొంది. ఇది ఇటీవల జరిగిన ఘటన కాదు, 2021లో జరిగింది.
కీ వర్డ్ సెర్చ్ ద్వారా ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ప్రచురించిన ఒక వార్త కథనం కొనుగొన్నాం. ఈ కథనాన్ని 'దక్షిణ కొరియాలో దుకాణాల్లో దొంగతనం చేస్తూ పట్టుబడిన ఇద్దరు పాకిస్తాన్ రాయబార కార్యాలయ ఉద్యోగులు' అనే శీర్షికతో 2021లో ఏప్రిల్ 26న ప్రచురించారు.
ఈ కథనం ప్రకారం, దక్షిణ కొరియాలోని పాకిస్తాన్ రాయబార కార్యాలయానికి చెందిన ఇద్దరు రాయబార కార్యాలయ ఉద్యోగులు సియోల్‌లోని ఒక దుకాణంలో దొంగతనం చేసినందుకు పట్టుబడ్డారు. ఈ విషయాన్ని పోలీసులు 2021 ఏప్రిల్ 24న తెలిపారు.
ఘటన గురించి పోలీసులు 2021 ఏప్రిల్ 24న తెలిపారని ఇండియా టుడే కూడా 2021 ఏప్రిల్ 27న ప్రచురించిన కథనంలో రాసింది.
కొరియా టైమ్స్ ప్రచురించిన కథనాన్ని కూడా కనుగొన్నాం. @HPhobiaWatch షేర్ చేసిన ఈ కథనం కూడా 2021లో ప్రచురించబడింది.
ఈ కథనాన్ని "దొంగతనం ఆరోపణలతో ఇద్దరు పాకిస్తాన్ రాయబార కార్యాలయ ఉద్యోగులను పట్టుకున్న పోలీసులు" అనే శీర్షికతో 2021 ఏప్రిల్ 25న ప్రచురించారు.
యోంగ్సాన్ జిల్లాలోని ఇటావోన్‌లోని ఒకే దుకాణంలో వేర్వేరు తేదీల్లో సుమారు 12 డాలర్ల విలువైన వస్తువులను దొంగిలిస్తూ ఇద్దరూ పట్టుబడ్డారు అని పోలీసులు చెప్పారని ఈ కథనంలో పేర్కొన్నారు.
"ఒకరు జనవరి 10న 1,900 వోన్ ($1.70) విలువైన చాక్లెట్ ట్రీట్‌లను దొంగిలించారని, మరొకరు ఫిబ్రవరి 23న 11,000 వోన్ ($10) విలువైన టోపీని దొంగిలించారని ఆరోపించారు," అని రాశారు. ఇద్దరూ పాకిస్తాన్ రాయబార కార్యాలయ ఉద్యోగులేనని రాశారు.
ఒకరిపై కేసు కూడా బుక్ చేశారు, పాకిస్తాన్ రాయబార కార్యాలయంలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి, నిందితుడు చోరీ చేసిన వస్తువులకు డబ్బు చెల్లించినట్లు తెలుస్తోంది.
వియన్నా కన్వెన్షన్ ఆన్ డిప్లొమాటిక్ రిలేషన్స్ ప్రకారం, దౌత్యవేత్తలు, వారి కుటుంబాలు వారి ఆతిథ్య దేశంలోని కొన్ని చట్టాల ప్రకారం అరెస్టు, నిర్బంధం లేదా నేరారోపణలను నివారించవచ్చు. అయితే ఈ డిప్లొమాటిక్ ఇమ్యునిటీ కారణంగా నిందితుడిని అరెస్టు చేయకుండానే అధికారులు కేసును మూసివేశారు. దొంగతనానికి పాల్పడ్డ రెండొవ వ్యక్తికి కూడా డిప్లొమాటిక్ ఇమ్యునిటీ వర్తిస్తుంది.
వైరల్ అవుతున్న ఘటన 2021లో జరిగిందని తేలింది. దొంగతనానికి పాల్పడ్డారనే ఆరోపణలతో ఇద్దరు పాకిస్తాన్ రాయబార కార్యాలయ ఉద్యోగులను సౌత్ కొరియా పోలీసులు పట్టుకున్నారనే వార్త వాస్తవనప్పటికీ, వారికి డిప్లొమాటిక్ ఇమ్యునిటీ ఉండటంతో అరెస్ట్ చేసినట్లు ఏ ఆధారాలు లేవు
అయితే ఇటీవల ఇవే ఆరోపణలతో పాకిస్తాన్ దౌత్యవేత్తలు పట్టుబడ్డట్టు ఎలాంటి సమాచారం దొరకలేదు. కాబట్టి 2021లో జరిగిన పాత విషయాన్ని మళ్ళీ ఇప్పుడు కొత్తగా షేర్ చేస్తున్నట్లు తేలింది.
న్యూస్‌మీటర్ ఈ క్లెయిమ్ తప్పు అని నిర్ధారించింది.