Fact Check: ఇరాన్‌లో మహిళ బుర్ఖా తీసి అయతుల్లా ఖమేనీపై అభ్యంతరకర సందేశం చూపించిందా? కాదు, ఈ వీడియో పారిస్‌ది

ఇరాన్‌లో జరుగుతున్న నిరసనల మధ్య, అయతుల్లా అలీ ఖమేనీపై నిరసనగా ఒక మహిళ బహిరంగంగా బుర్ఖా తొలగించిందని చెప్పే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

By -  Newsmeter Network
Published on : 13 Jan 2026 7:10 PM IST

Woman in Iran removes burqa, shows explicit message against Ayatollah Ali Khamenei? No, video is from Paris
Claim:ఇరాన్‌లో ఒక మహిళ బహిరంగంగా బుర్ఖా తీసి, సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీపై అభ్యంతరకర సందేశం ఉన్న టీషర్ట్‌ను చూపించింది.
Fact:ఈ క్లెయిమ్ తప్పుదోవ పట్టించేది. వీడియో ఇరాన్‌లోది కాదు. ఫ్రాన్స్‌లోని పారిస్ నగరంలో, ఇరాన్ నిరసనలకు మద్దతుగా నిర్వహించిన ర్యాలీలో చిత్రీకరించబడింది.
హైదరాబాద్: డిసెంబర్ 28, 2025 నుంచి ఇరాన్‌లో కొనసాగుతున్న నిరసనల్లో ఇప్పటివరకు దాదాపు 650 మంది మరణించినట్లు నివేదికలు చెబుతున్నాయి.
ఈ నేపథ్యంలో, ఓ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. ఆ వీడియోలో ఒక మహిళ తన హిజాబ్ తొలగించి, ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీపై అభ్యంతరకర సందేశం ఉన్న టీషర్ట్‌ను చూపిస్తూ కనిపిస్తుంది. ఈ దృశ్యాన్ని ఇరాన్‌లోనే జరిగిన ధైర్యమైన నిరసనగా ప్రచారం చేస్తున్నారు.

ఒక ఫేస్‌బుక్ యూజర్ ఈ వీడియోను షేర్ చేస్తూ,"ఇరాన్‌లో ఖమేనీ వ్యతిరేక నిరసనలు తీవ్రం రూపం దాల్చాయి. ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్నా, కాల్పులకు దిగుతున్నా జనం వెనక్కి తగ్గడం లేదు. మహిళలు ఖమేనీ ఫొటోకు నిప్పుపెట్టి సిగరెట్లు వెలిగించుకోవడం ఇటీవల సంచలనం రేపింది. తాజాగా యువతులు బహిరంగంగా బురఖాలు తీసేస్తూ కొందరు తమ నిరసన తెలుపుతున్నారు. టీషర్టులపై ఖమేనీ వ్యతిరేక నినాదాలను ప్రదర్శిస్తున్నారు. ఇలాంటి చర్యలకు అక్కడ మరణశిక్ష విధిస్తారు."(ఆర్కైవ్)

ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియోను షేర్ చేసిన The Mojo Story పేజీ, “ఇరాన్‌లో ఇలాంటి బహిరంగ నిరసన ప్రాణాపాయం అయినా, ప్రజలు పాలక వ్యవస్థను సవాల్ చేస్తున్నారు” అంటూ పేర్కొంది. (
ఆర్కైవ్
)

అలాగే జర్నలిస్ట్ నబీలా జమాల్ కూడా ఈ వీడియోను Xలో పోస్ట్ చేస్తూ, ఇది ఇరాన్‌లోనిదేనని పేర్కొన్నారు. “ఇరాన్ – అయతొల్లా అలీ ఖమేనేపై అభ్యంతరకర సందేశంతో టీషర్ట్ చూపించిన మహిళ. ఇలాంటి చర్యకు ఇరాన్ చట్టాల ప్రకారం మరణశిక్ష కూడా ఉండొచ్చు” అంటూ ఆమె రాసింది. (ఆర్కైవ్)

అయితే, ఈ వీడియో నిజంగానే ఇరాన్‌లో తీసిందా?

ఫ్యాక్ట్ చెక్

న్యూస్‌మీటర్ చేసిన పరిశీలనలో, ఈ వీడియో ఫ్రాన్స్‌లోని పారిస్ నగరంలోని ప్లేస్ విక్టర్ హ్యూగో (Place Victor Hugo) వద్ద చిత్రీకరించబడినదిగా తేలింది. వీడియోలో కనిపిస్తున్న మహిళ ఫ్రెంచ్ కార్యకర్త కామిల్ ఎరోస్ (Camille Eros).
వీడియో లొకేషన్ గుర్తింపు (జియోలోకేషన్) రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇదే వీడియో ఫేస్‌బుక్‌లో కూడా కనిపించింది. అక్కడ ఇది పారిస్‌లో జరిగిన నిరసన కార్యక్రమం అని స్పష్టంగా పేర్కొన్నారు.
వీడియో బ్యాక్‌గ్రౌండ్‌లో కనిపించే భవనాలను గమనిస్తే, అవి పారిస్‌కు ప్రత్యేకమైన హాస్మానియన్ శైలిలో (Haussmannian architecture) ఉన్నట్లు గుర్తించవచ్చు.

గూగుల్ లెన్స్ ద్వారా భవనాలపై రివర్స్ సెర్చ్ చేయగా, అదే భవనాన్ని చూపించే
ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్
లభించింది. ఆ పోస్ట్‌లో లొకేషన్‌ను పారిస్‌గా పేర్కొన్నారు.
ఆ ఇన్‌స్టాగ్రామ్ చిత్రాన్ని జెమినీ (Gemini) టూల్‌తో విశ్లేషించగా, అవి పారిస్ 16వ అరొండిస్మెంట్‌లోని అవెన్యూ ఫోచ్, అవెన్యూ రేమండ్ పాయంకరే పరిసర ప్రాంతమై ఉండొచ్చని సూచించింది.
గూగుల్ మ్యాప్స్ పరిశీలనలో, ఈ ప్రాంతం ప్లేస్ విక్టర్ హ్యూగోకు సమీపంలో ఉందని నిర్ధారణైంది. అంతేకాదు, యూరో న్యూస్ క‌థ‌నం ప్రకారం, జనవరి 11న ప్లేస్ విక్టర్ హ్యూగో నుంచి ట్రొకడెరో వరకు ఇరాన్ నిరసనలకు మద్దతుగా ర్యాలీ నిర్వహించారు.
ఈ వివరాల ఆధారంగా, ప్లేస్ విక్టర్ హ్యూగో ప్రాంతంలోని గూగుల్ స్ట్రీట్ వ్యూ చిత్రాలను పరిశీలించగా, వైరల్ వీడియోలో కనిపించిన భవనాలు అక్కడి నిర్మాణాలతో పూర్తిగా సరిపోలాయి.

వీడియోలోని మహిళ ఎవరు?
Xలో పలువురు యూజర్లు వీడియోలోని మహిళను ఫ్రెంచ్ కార్యకర్త కామిల్ ఎరోస్‌గా గుర్తించారు. ఈ ఆధారంతో న్యూస్‌మీటర్ ఆమె సోషల్ మీడియా ఖాతాలను పరిశీలించింది.
జనవరి 11న, అదే వీడియోను కామిల్ ఎరోస్ తన X ఖాతా మరియు వెరిఫైడ్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో
స్వయంగా పోస్ట్ చేసినట్టు గుర్తించాం.
వైరల్ వీడియోలోని మహిళ ముఖచిత్రాన్ని, ఆమె ప్రొఫైల్ ఫొటోలు మరియు ఇతర పోస్టులతో పోల్చిచూసినప్పుడు, వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి కామిల్ ఎరోస్ అనే విషయం స్పష్టమైంది.
ఇరాన్‌లో ఒక మహిళ అయతుల్లా అలీ ఖమేనీపై నిరసనగా బుర్ఖా తొలగించిందని చెబుతున్న వైరల్ వీడియో తప్పుదోవ పట్టించేది. ఈ వీడియో ఇరాన్‌లో కాదు, ఫ్రాన్స్‌లోని పారిస్ నగరంలో ఇరాన్ నిరసనలకు మద్దతుగా జరిగిన ర్యాలీలో చిత్రీకరించబడింది. వీడియోలో కనిపిస్తున్న మహిళ కూడా ఇరాన్‌కు చెందినవారు కాదు; ఆమె ఫ్రెంచ్ కార్యకర్త కామిల్ ఎరోస్.
Claimed By:Social media users
Claim Reviewed By:NewsMeter
Claim Source:Facebook, Instagram
Claim Fact Check:False
Fact:ఈ క్లెయిమ్ తప్పుదోవ పట్టించేది. వీడియో ఇరాన్‌లోది కాదు. ఫ్రాన్స్‌లోని పారిస్ నగరంలో, ఇరాన్ నిరసనలకు మద్దతుగా నిర్వహించిన ర్యాలీలో చిత్రీకరించబడింది.
Next Story