ఒక వీడియోలో, పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడి, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తూ "సీఎం డౌన్, డౌన్" అని నినాదాలు చేస్తున్నారు.ఆ జనం మధ్యలో కొందరు వ్యక్తులు దిష్టిబొమ్మను పట్టుకొని ఊరేగింపుగా తమ నిరసన తెలుపుతున్న పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలను అమలు చేయనప్పటికీ, చిత్తూరు జిల్లా కుప్పం ప్రజలు చంద్రబాబు నాయుడుకు మద్దతు చూపించారు. కానీ, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా నినాదాలు వినిపిస్తున్నాయి అంటూ ఒక వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వైరల్ అవుతున్న పోస్ట్ ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించినది కాదు తెలంగాణకు సంబంధించినది అని న్యూస్‌మీటర్ కనుగొన్నది.
మా పరిశోధనలో మేము వైరల్ వీడియో యొక్క రివర్స్ ఇమేజ్ శోధనను నిర్వహించాము. శోధిస్తున్నప్పుడు, 17 ఆగస్టు 2024 న
India Today ఆన్‌లైన్ వార్తాపత్రిక ద్వారా ఒక వార్తా నివేదిక కనుగొన్నాము, పంట రుణమాఫీ హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందంటూ తెలంగాణలోని పలువురు రైతులు ఆగస్టు 17న నిరసనలు చేపట్టారు. ఆగ్రహించిన రైతులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాక్ శవయాత్ర కూడా నిర్వహించారు అంటూ నినాదాలు సంబంధిత వైరల్ వీడియోతో పాటు మరింత వివరాలతో ఆ నివేదిక పేర్కొంది.
అంతేకాకుండా, మేము వైరల్ అవుతున్న పోస్ట్ ను మరింత శోధిస్తున్నప్పుడు, X లో 2024 ఆగస్టు 17న
Godam Nagesh (పార్లమెంటు సభ్యుడు - ఆదిలాబాద్ ,తెలంగాణ) అధికారిక ఖాతా ద్వారా ఒక పోస్ట్‌ని కనుగొన్నాము. అందులో ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన రుణమాఫీ హామీని అమలు చేయకపోవడం పై రైతులు కాంగ్రెస్ ప్రభుత్వం పై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీని ఇంకా అందజేయక పోవడంతో రైతులు ఆర్థికంగా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు అంటూ వైరల్ అవుతున్న వీడియోతో పాటు పోస్ట్ చేయబడింది.
అదనంగా, 2024 ఆగస్టు 17న
Telangana Today ఆన్‌లైన్ వార్తాపత్రిక ద్వారా మరో నివేదిక కనుగొన్నాము, ఆ నివేదికలో పలు గ్రామాల నుంచి సుమారు 500 మంది రైతులు తరలివచ్చి తలమడుగు మండల కేంద్రంలో ముఖ్యమంత్రి ఎ రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మతో పెద్దఎత్తున శవయాత్ర నిర్వహించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం రైతు భరోసా మొత్తాన్ని త్వరగా విడుదల చేయాలని కోరారు. తమను ప్రభుత్వం మోసం చేసిందని అంటూ ఫోటోతో పాటు ఆ నివేదిక పేర్కొంది.
అందువల్ల, వైరల్ అవుతున్న పోస్టులో ఎలాంటి వాస్తవం లేదు అని మేము నిర్ధారించాము.