మే 13న జరిగిన 2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రం గణనీయమైన మర్పులకు గురైంది. రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా ప్రచారం, పెద్ద ఎత్తున బహిరంగ సభలు, క్యాడర్ సమావేశాలు భారీ రోడ్‌షోతో ఈ ఎన్నికలు రసవత్తరంగా సాగాయి.
మొత్తమ్మీద 2024 ఏపీ ఎన్నికలు గతంలో ఎన్నడూ జరగలేని విధంగా అధిక పోలింగ్‌తో పూర్తయింది.
ఈ నేపథ్యంలో మొన్న జరిగిన ఎలక్షన్ ముందు సాక్షి పేపర్ లో వచ్చిన కధనం” మీ భూమి మీది కాదు, ల్యాండ్ టైటిలింగ్ చట్టంతో జరగబోయేది ఇదే, కూటమి అధికారంలోకి రాగానే ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు”” అంటూ ఒక కథనం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది,
ఇది ఇలా ఉండగా ఎన్నికలు పూర్తయిన తర్వాత ఈనాడు పేరుతో” ఏపీ అసెంబ్లీ ఎన్నికలపై ప్రముఖ సంస్థల సర్వేలు- అన్ని సర్వేల్లో వైకాపా వైపు ప్రజల మొగ్గ అంటూ ఇంకో కథనం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
నిజ నిర్ధారణ :
సాక్షి మరియు ఈనాడు పేరిట వచ్చిన న్యూస్ పేపర్ ఫ్రంట్ పేజీలు ఫేక్ అని, వార్తా సంస్థలు ఈ ప్రకటనలేవీ చేయలేదని న్యూస్‌మీటర్ కనుగొంది.
మేము ఈ వైరల్ న్యూస్ పేపర్ ఫ్రంట్ పేజీలు గురించి శోధించినప్పుడు, X లో మే 15న 2024, ఈటీవీ తెలంగాణ [ ఈనాడు] అధికారిక హ్యాండిల్ ద్వారా "ఫేక్... ఫేక్... ఫేక్...ఈనాడు పేరుతో సర్క్యులేట్ అవుతున్న ఈ వార్తలు పూర్తిగా ఫేక్. ఈనాడు, ఈటీవీ పేర్లతో వైకాపా మూకలు ఈ వార్తలను ప్రచారం చేస్తున్నారు. ఈ వార్తలతో ఈనాడుకు ఎలాంటి సంబంధం లేదు"అంటూ ఒక పోస్ట్‌ని కనుగొన్నాము.
తర్వాత సాక్షి పేరుతో వైరల్ అవుతున్న ఫ్రంట్ పేజీకి సంబంధించి, మేము సాక్షి కార్యాలయాన్ని సంప్రదించాము. వైరల్ అయిన మొదటి పేజీ నకిలీదని మరియు దానిని వారు ప్రచురించలేదని వారు ధృవీకరించారు.
అంతేకాకుండా, సాక్షి దినపత్రికలో ఈ వైరల్ ఫ్రంట్ పేజీ ఉందా లేదా అని వెతికినప్పుడు, సాక్షి దినపత్రికలో ఈ వైరల్ మొదటి పేజీ కనిపించలేదు.
అందువల్ల, ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన సాక్షి మరియు ఈనాడు పేరిట సర్క్యులేట్ అవుతున్న న్యూస్ పేపర్ ఫ్రంట్ పేజీలు, తమ సంస్థలు ప్రచురించలేదని మేము నిర్ధారించాము.