ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఫిబ్రవరి 3వ తేదీన ఆంధ్రప్రదేశ్‌లోని దెందులూరులో 'సిద్ధం' బహిరంగ సభను నిర్వహించారు. గాజువాకలో నిర్వహించిన 'సిద్ధం' బహిరంగ సభ విజయవంతం కావడంతో అధికార పార్టీ ఉత్సాహంలో ఉంది. ఈ సమావేశాలకు జనం భారీగా తరలివచ్చారు.
జగన్ సభల్లో ర్యాంప్ వాక్ చేస్తూ ప్రజలకు చేరువయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యమంత్రి చుట్టూ తిరిగేందుకు, ప్రజలను పలకరించేందుకు వీలుగా నిర్వాహకులు ప్లస్ షేప్‌లో ర్యాంప్‌ను ఏర్పాటు చేస్తున్నారు.
జగన్ తన ప్రసంగానికి ముందు మరియు ప్రసంగానికి తర్వాత దెందులూరులో ర్యాంప్ వాక్ చేశారు. ప్రసంగం ముగించుకుని ర్యాంప్‌పై నడుస్తుండగా, తిరిగి వేదికపైకి వస్తుండగా, అక్కడ ఉన్న కొద్ది మంది సభ్యులు ఒక్కసారిగా ర్యాంప్‌పైకి ఎక్కి జగన్ వైపు పరుగులు తీశారు. జగన్ వైపు వెళ్తున్న వారిని భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు.
అయితే, ఈ సంఘటనకు సంబందించిన వీడియోలో కొంత భాగం పోస్ట్ చేస్తూ "చిర్ల జగ్గిరెడ్డికి సీటు ఇవ్వకపోవటం పై, జగన్ రెడ్డి మీద ఎదురుతిరిగిన కార్యకర్తలు. గంజాయి తాగి వచ్చి జగన్ పైనే దాడి చేసే ప్రయత్నం. అడ్డుకున్న సెక్యూరిటీ" అని సోషల్ మీడియాలో కొన్ని పోస్ట్‌లు వైరల్ అయ్యాయి.
నిజ నిర్ధారణ:
న్యూస్‌మీటర్ ఈ పోస్ట్‌ను తప్పుడు మరియు తప్పుదారి పట్టించే దావాగా గుర్తించింది. పోస్ట్‌లోని వైరల్ వీడియోకు సంబంధించి మా శోధనలో భాగంగా, దెందులూరు మీటింగ్‌లో సీఎం జగన్ ర్యాంప్ వాక్ పూర్తి వీడియోను ధృవీకరించాము.
ఫిబ్రవరి 3న జరిగిన దెందులూరు సభ మొత్తం టెలికాస్ట్‌ని సరిచూసుకున్నాక నిజానిజాలు బయటపడ్డాయి.
జగన్ తన ప్రసంగాన్ని ముగించి వేదిక నుంచి బయలుదేరే ముందు ర్యాంప్‌పై నడిచారు. ఆయన ర్యాంప్‌పై నడుస్తుండగా వైసీపీ కార్యకర్తలు, సీఎం జగన్ అభిమానులు కొందరు ర్యాంప్‌పైకి దూసుకెళ్లి జగన్‌ను కలిసేందుకు, ఆయనతో సెల్ఫీలు దిగేందుకు ప్రయత్నించగా, ఒకరు జగన్ వద్దకు చేరుకుని సెల్ఫీ దిగగా, మరొకరు జగన్ పాదాలను తాకారు. మరికొందరిని భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. కొద్దిసేపటికే జగన్ ఎలాంటి అవాంతరాలు లేకుండా వేదిక నుంచి వెళ్లిపోయారు.
వారంతా నవ్వుతూ 'జై జగన్' అని నినాదాలు చేయడం కూడా మనం చూడవచ్చు. అసలు అక్కడ జరిగింది ఇది. ఇదంతా ఆ ఈవెంట్ పూర్తి వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది.
మీడియా ఛానెల్‌ల ద్వారా కూడా మేము అదే నివేదికను కనుగొన్నాము.
అంతే కాని పోస్ట్‌లోని దావాతో సరిపోలిన వార్తలను ఎవరూ నివేదించలేదు.
ర్యాంపు ఎక్కేందుకు ప్రయత్నించిన వారు సీఎం జగన్ అభిమానులే. జగన్‌పై దాడి చేయాలని భావించి ఉంటే ఆ ప్రయత్నం చేసి ఉండేవారు కానీ సెల్ఫీ దిగడం, జగన్ పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకోవడం పూర్తి వీడియోలో మనం చూడగలం.
అందుకే, చిర్ల జగ్గిరెడ్డికి సీటు ప్రకటించనందుకు గంజాయి మత్తులో వైసీపీ కార్యకర్తలు సీఎం జగన్‌పై దాడికి యత్నించారని పోస్ట్‌లో వచ్చిన వాదన అవాస్తవమని తేల్చిచెప్పాం.