Fact Check: ‘తెలంగాణ న్యూస్ టుడే డైలీ’ అనే నకిలీ ఈ-పేపర్ తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తోంది

తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమైన సంఘటనలపై ‘తెలంగాణ న్యూస్ టుడే డైలీ’ ఈ-పేపర్ వార్తాపత్రిక క్లిప్పింగ్‌లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

By K Sherly Sharon  Published on  24 Dec 2024 11:58 PM IST
Fact Check: ‘తెలంగాణ న్యూస్ టుడే డైలీ’ అనే నకిలీ ఈ-పేపర్ తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తోంది
Claim: 'తెలంగాణ న్యూస్ టుడే డైలీ' వైరల్ వార్తాపత్రిక క్లిప్పింగ్‌లు నిజమైన వార్తలను చూపిస్తున్నాయి.
Fact: ఈ క్లెయిమ్స్ తప్పు. ‘తెలంగాణ న్యూస్ టుడే డైలీ’ అనే మీడియా సంస్థ మనుగడలో లేదు, తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయడానికి ఈ సంస్థ ఉపయోగించబడుతోంది.

The article is being updated as new claims featuring 'Telangana News Today Daily' news clippings emerge.

Hyderabad: తప్పుడు సమాచారాన్ని విస్తృతంగా ప్రచురించడానికి ప్రముఖ మీడియా సంస్థల న్యూస్ కార్డ్‌ల నకలు ఉపయోగించబడుతుంటాయి. ఈ మధ్య నకిలి వార్త పత్రికల క్లిప్పింగులు, న్యూస్ కార్డులు కూడా ఉపయోగిస్తున్నారు. ‘తెలంగాణ న్యూస్ టుడే డైలీ’ అనే ఈ-పేపర్‌ కూడా అలాంటి ఒక వార్త పత్రిక. ఈ వార్తాపత్రిక క్లిప్పింగ్‌లు రకరకాల క్లెయిమ్‌లతో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

ఈ 'న్యూస్ క్లిప్పింగ్స్' చేస్తున్న కొన్ని క్లెయిమ్స్ న్యూస్‌మీటర్ కనుగొంది. ఈ క్లెయిమ్స్ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షుడు కే చంద్రశేఖర రావు, మాజీ మంత్రి, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే టీ రామారావుకు సంబంధించినవి.

ఈ క్లెయిమ్స్ విశ్లేషించే ముందు, అసలు ‘తెలంగాణ న్యూస్ టుడే డైలీ’ అనే వార్త పత్రిక ఉందొ లేదో చూద్దాం.

అసలు 'తెలంగాణ న్యూస్ టుడే డైలీ' ఉందా, లేదా?

‘తెలంగాణ న్యూస్ టుడే డైలీ’ అనే ఈ-పేపర్ మనుగడలో లేదని గుర్తించాం.

అన్ని ఈ-పేపర్ క్లిప్పింగ్‌ల మాదిరిగానే , ‘తెలంగాణ న్యూస్ టుడే డైలీ’ క్లిప్పింగ్‌లో కూడా టైటిల్, కీలకాంశాలు, బ్యానర్‌లో తేదీ, క్లెయిమ్‌కు సంబంధించిన కథనం లింక్‌, లోగో ఉన్నాయి. ఈ వార్త క్లిప్పింగ్‌ల చిత్రం క్రింద చూడవచ్చు.

లింక్‌పై క్లిక్ చేసినప్పుడు, పని చేయని వెబ్ పేజీలకు మళ్ళించబడ్డాము. అంటే ఈ లింక్‌లు అసలు మనుగడలో లేవని అర్థం.

బ్యానర్‌పై ఉన్న లోగో -పసుపు మరియు నారింజ రంగులో ఉన్న గుడ్లగూబ- రీడ్‌వేర్‌కు చెందినది. వెబ్‌సైట్ ప్రకారం, ఇది భారతదేశపు అతిపెద్ద డిజిటల్ న్యూస్‌స్టాండ్. అయితే, వెబ్‌సైట్‌లో తెలంగాణ న్యూస్ టుడే డైలీని కనుగొనలేకపోయాం.

Google, Bingలో వివిధ కీవర్డ్ సెర్చ్‌లను కూడా నిర్వహించాము, 'తెలంగాణ న్యూస్ టుడే డైలీ 'ఈ-పేపర్ లేదా దాని వెబ్‌సైట్ ఎక్కడా లేదని కనుగొన్నాం.

Whoisని ఉపయోగించి telangananewstodaydaily డొమైన్ ఇంకా నమోదు కాలేదని కూడా మేము కనుగొన్నాము. ‘తెలంగాణ న్యూస్‌ టుడే’, ‘తెలంగాణ న్యూస్‌ టుడే డైలీ’ వార్త పత్రికల రిజిస్ర్టేషన్‌ కోసం భారతదేశానికి సంబంధించిన వార్తాపత్రికల రిజిస్ట్రార్‌ కార్యాలయ వెబ్‌సైట్‌లో వెతికితే టైటిల్‌లు నమోదు కాలేదని తేలింది.

అందువల్ల, ‘తెలంగాణ న్యూస్ టుడే డైలీ’ పేరుతో ఈ-పేపర్ మనుగడలో లేదని, ఈ సంస్థకు చెందిన వార్తాపత్రిక క్లిప్పింగ్‌లు నకిలీవని నిర్ధారించాం.

అయితే ఈ అవుట్‌లెట్ నకిలీ క్లెయిమ్‌లను ప్రచురించడానికి ఉపయోగించబడుతుందా?

ప్రతి క్లెయిమ్, దాని వెనుక ఉన్న నిజం ఏంటో చూద్దాం.

Claim 1

‘నన్ను చంపేందుకు కల్వకుంట్ల కుటుంబం కుట్ర చేస్తుంది’ అని మాజీ డీసీపీ ఆరోపిస్తున్నట్లు క్లిప్పింగ్‌ చూపిస్తుంది.

తాజాగా, ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు, టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధా కిషన్‌రావుపై కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో తన హత్యకు కల్వకుంట్ల కుటుంబీకులు కుట్ర పన్నుతున్నారని మాజీ డీసీపీ చెప్పారని ఆరోపిస్తున్న ఓ వార్త క్లిప్పింగ్ వైరల్‌ అవుతోంది. సంచలన విషయాలను లేఖ ద్వారా విడుదల చేసిన మాజీ డీసీపీ అంటూ క్లిప్పింగ్ పేర్కొంది.

మాజీ సీఎం కేసీఆర్ కుటుంబం మొత్తం ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉన్నారని, ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌రావు, మాజీ కలెక్టర్‌ వెకటరామిరెడ్డిలతో కుమ్మక్కై వేల కోట్ల లావాదేవీలు జరిపి హవాలా బ్రోకర్లకు డబ్బును అందజేసినట్లు డీసీపీ చెప్పినట్లు ఆరోపిస్తున్న న్యూస్ క్లిప్పింగ్‌లను డిసెంబర్ 8, 2024 న ఫేస్‌బుక్ లో పోస్ట్ చేసారు. (ఆర్కైవ్)

ఇదే క్లెయిమ్‌లను చేస్తున్న పోస్ట్‌ను ఇక్కడ చూడవచ్చు.(ఆర్కైవ్)

Fact Check

న్యూస్‌మీటర్ ఈ క్లెయిమ్ తప్పు అని కనుగొంది.

కల్వకుంట్ల కుటుంబం తనను హత్య చేసేందుకు కుట్ర పన్నిందని మాజీ డీసీపీ రాధాకిషన్‌రెడ్డి రాసిన లేఖపైనా, ఆయన చేసిన వ్యాఖ్యలపైనా మాకు విశ్వసనీయమైన వార్తా కథనాలు కనిపించలేదు.

Claim 2

'నన్ను అరెస్ట్ చేస్తే అల్లకల్లోలం చేయండి' అని కేటీఆర్ అన్నట్లు ఆరోపిస్తున్న న్యూస్ క్లిప్పింగ్.

2023 ఫిబ్రవరిలో హైదరాబాద్‌లో జరిగిన ఫార్ములా-ఈ రేస్ నిర్వహణలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై ఇటీవలే బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావుపై ఏసీబీ ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసింది.

ఈ నేపథ్యంలో కేటీఆర్ తాను అరెస్టయితే అల్లకల్లోలం చేయండి అని ఆదేశాలు జారీ చేసినట్లు ఆరోపిస్తున్న ఓ న్యూస్ కార్డ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. (ఆర్కైవ్)

బీఆర్‌ఎస్‌ ముఖ్య నాయకులతో కాన్ఫరెన్స్ కాల్ ద్వారా కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారని, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఫోన్ కాల్ రికార్డింగ్‌లను ప్రభుత్వానికి లీక్ చేశారని ఈ-పేపర్ పేర్కొంది.

ఇదే క్లెయిమ్స్ చేస్తున్న పోస్ట్ ఇక్కడ చూడవచ్చు. (ఆర్కైవ్)

Fact Check

న్యూస్‌మీటర్ ఈ క్లెయిమ్ తప్పు అని కనుగొంది.

వైరల్ పోస్ట్‌లో పేర్కొన్న 'కేటీఆర్ ఫోన్ కాల్ రికార్డింగ్‌లు', క్లిప్పింగ్‌లో పేర్కొన్న వార్తల కోసం వివిధ కీ వర్డ్స్ ఉపయోగించి సెర్చ్ చేసినా ఎలాంటి వార్తా కథనాలు దొరకలేదు.

Claim 3

కేటీఆర్ కూడా నాకు మంచి మిత్రుడే: దివ్వెల మాధురి అన్నట్లు ఆరోపిస్తున్న న్యూస్ క్లిప్.

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా తనకు మంచి మిత్రుడేనని సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ దివ్వల మాధురి అన్నట్లు ‘తెలంగాణ న్యూస్ టుడే డైలీ’ వార్తా పత్రిక క్లిప్పింగ్ ఆరోపించింది. ఈ న్యూస్ క్లిప్‌లో మీడియాతో చిట్-చాట్ సందర్భంగా మాధురి ఈ సమాచారాన్ని పంచుకున్నారని, ఒక హోటల్‌లో సినీ నిర్మాత బెల్లంకొండ సురేష్ ద్వారా కేటీఆర్‌ను కలిశానని చెప్పినట్లు పేర్కొన్నారు. (ఆర్కైవ్)

ఇదే క్లెయిమ్‌లను చేస్తున్న పోస్ట్‌ను ఇక్కడ చూడవచ్చు.(ఆర్కైవ్)

Fact Check

న్యూస్‌మీటర్ ఈ క్లెయిమ్ తప్పు అని కనుగొంది.

దివ్వల మాధురి కేటీఆర్‌ని కలిసినట్లు విశ్వసనీయమైన కథనాలు లేవని గుర్తించాం.

NTV తెలుగు యూట్యూబ్‌ ఛానెల్‌లో డిసెంబర్ 17, 2024న అప్‌లోడ్ చేయబడిన వీడియోను కూడా కనుగొన్నాం, అక్కడ మాధురి వైరల్ క్లెయిమ్‌ల గురించి మాట్లాడారు. "నేను కేటీఆర్‌ని ఎప్పుడూ కలవలేదు, చూడలేదు, తెలంగాణ రాజకీయాలకు నాకు ఎలాంటి సంబంధం లేదు" అని అన్నారు.

Claim 4

ఒకరిద్దరు చనిపోతే అరెస్టు చేయడం దుర్మార్గం: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ అరెస్ట్ పై కేటీఆర్ అన్నట్లు ఆరోపిస్తున్న న్యూస్ క్లిప్.

‘పుష్ప 2: ది రూల్’ నటుడు అల్లు అర్జున్ సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయిన కేసులో అరెస్టయ్యాడు. ఆమె తొమ్మిదేళ్ల కొడుకు తీవ్ర గాయాలతో ప్రస్తుతం కోమాలో ఉన్నాడు.

ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ అరెస్టుపై కేటీఆర్ స్పందించినాట్లు చూపిస్తున్న వార్తాపత్రిక క్లిప్పింగ్ వైరల్‌గా మారింది. 'ఒకరిద్దరు చనిపోతే అరెస్టు చేయడం దుర్మార్గం' అని బీఆర్‌ఎస్ నాయకుడు ప్రభుత్వంపై మండిపడ్డారని ఈ క్లిప్పింగ్ ఆరోపించింది. (ఆర్కైవ్)

ఇదే క్లెయిమ్‌లను చేస్తున్న పోస్ట్‌ను ఇక్కడ చూడవచ్చు.(ఆర్కైవ్)

“చనిపోయిన మహిళను సంధ్య థియేటర్కు రమ్మని అల్లు అర్జున్ చెప్పాడా? సినిమా వాళ్ళపై కేసులు పెడితే సినీ ఇండస్ట్రీ ఆంధ్రకు తరలిపోయే ప్రమాదం ఉంది. సెలబ్రిటీల విషయంలో కొన్ని సంఘటనలను చూసి చూడనట్టు వదిలేయాలి' అని కేటీఆర్‌ వ్యాఖ్యలు చేసారని వార్తాపత్రిక క్లిప్పింగ్‌లో ఆరోపించారు.

Fact Check

న్యూస్‌మీటర్ ఈ క్లెయిమ్ తప్పు అని కనుగొంది.

అల్లు అర్జున్ అరెస్ట్ విషయంలో కేటీఆర్ ఈ విధంగా వ్యాఖ్యలు చేసినట్టు ఎలాంటి కథనాలు, ఆధారాలు లేవు.

అల్లు అర్జున్ అరెస్టుపై కేటీఆర్ నుండి అధికారిక వ్యాఖ్య డిసెంబర్ 13న అతను చేసిన X పోస్ట్‌లో చూడవచ్చు: “జాతీయ అవార్డు గ్రహీత స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ పాలకుల అభద్రతకు పరాకాష్ట! తొక్కిసలాట బాధితుల పట్ల నాకు పూర్తిగా సానుభూతి ఉంది కానీ అసలు విఫలమయ్యింది ఎవరు ? @alluarjun గారు నేరుగా బాధ్యుడు కానప్పుడు ఒక సాధారణ క్రిమినల్‌గా వ్యవహరించడం అనూచితం."

Claim 5:

'తన కోసం సినిమా తీయమని కేసీఆరే డబ్బులు ఇచ్చారు': నటుడు రాకింగ్ రాకేష్ చెప్పారని వైరల్ అవుతున్న న్యూస్ క్లిప్.

కేశవ చంద్ర రమావత్ అనే తెలుగు చిత్రం నవంబర్ 22న థియేటర్లలో విడుదలైంది. తెలంగాణా నేపధ్యంలో రూపొందిన ఈ చిత్రం మాజీ ముఖ్యమంత్రి బీఆర్‌ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర్ రావును సూచిస్తున్న'కేసీఆర్' అనే టైటిల్ ద్వారా ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోంది.

సినిమా విడుదలైన తర్వాత, రాకింగ్ రాకేష్ ఇంటర్వ్యూకు సంబంధించిన ఓ వార్తాపత్రిక క్లిప్పింగ్ వైరల్ అయ్యింది. కేసీఆర్ తన రాజకీయ జీవితాన్ని కీర్తిస్తూ సినిమా నిర్మించేందుకు ఫామ్‌హౌస్‌లో రూ. 20 కోట్లు అందించారని రాకింగ్ రాకేష్ అంగీకరించినట్లు ఈ న్యూస్ క్లిప్పింగ్ ఆరోపిస్తోంది.

Fact Check

న్యూస్‌మీటర్ నవంబర్ 2024లో ఈ క్లెయిమ్ తప్పు అని నిర్ధారించింది.

న్యూస్ మీటర్ రాకింగ్ రాకేష్‌ను సంప్రదించినప్పుడు, అతను అలాంటి ఇంటర్వ్యూ ఇవ్వలేదని ఖండించాడు. "కేసీఆర్ నాకు రూ.20 కోట్లు ఇస్తే నా సినిమాకు థియేటర్లు దొరక్క నేనెందుకు కష్టపడతాను.. అది నిజమైతే కేటీఆర్ లేదా దిల్ రాజులు 'బలగం' సినిమాకు చేసినట్టుగా నా సినిమాను ప్రమోట్ చేసి ఉండేవారు" అని అన్నారు.

Claim 6

"ఫార్ములా ఈ-రేస్ కేసులో రకుల్ ప్రీత్..." అని ఆరోపిస్తున్న ఓ న్యూస్ క్లిప్పింగ్ కూడా సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. ఈ న్యూస్ క్లిప్పింగ్ ఫోటో ఫేస్‌బుక్‌లో అప్లోడ్ చేస్తూ "ఊహించని మలుపులు తిరుగుతున్న ఫార్ములా ఈ-రేస్ కేసు విచారణ" అని క్యాప్షన్‌లోరాశారు. (ఆర్కైవ్)

ఇదే క్లెయిమ్‌లను చేస్తున్న పోస్ట్‌ను ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. (ఆర్కైవ్ 1) (ఆర్కైవ్ 2)

Fact Check

సినీ నటి రకుల్ ప్రీత్ పెళ్ళికి 10 కోట్ల రూపాయలు ఇవ్వాలని బీఆర్‌ఎస్ ప్రెసిడెంట్ కేటీఆర్ గ్రీన్కో కంపెనీని ఆదేశించారా అని కీ వర్డ్ సెర్చ్ చేసాము. ఈ క్లెయిమ్ వాస్తవమని చూపించే ఎలాంటి వార్త కథనాలు మాకు దొరకలేదు.

న్యూస్‌మీటర్ ఈ క్లెయిమ్ తప్పు అని నిర్ధారించింది.

అందువల్ల ‘తెలంగాణ న్యూస్ టుడే డైలీ’ అనే వార్తాసంస్థ మనుగడలో లేకపోవడమే కాకుండా, దాని పేరుతో చెలామణి అవుతున్న వార్తలు కూడా ఫేక్ అని నిర్ధారించాం.

Claim Review:'తెలంగాణ న్యూస్ టుడే డైలీ' వైరల్ వార్తాపత్రిక క్లిప్పింగ్‌లు నిజమైన వార్తలను చూపిస్తున్నాయి.
Claimed By:Social Media Users
Claim Reviewed By:NewsMeter
Claim Source:Social Media
Claim Fact Check:False
Fact:ఈ క్లెయిమ్స్ తప్పు. ‘తెలంగాణ న్యూస్ టుడే డైలీ’ అనే మీడియా సంస్థ మనుగడలో లేదు, తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయడానికి ఈ సంస్థ ఉపయోగించబడుతోంది.
Next Story