Hyderabad: ఫార్ములా-ఈ కేసులో మాజీ మంత్రి, భారత్ రాష్ట్ర సమితి పార్టీ (బీఆర్‌ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావుపై విచారణ ముమ్మరంగా సాగుతున్న తరుణంలో ‘మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి’, ‘ఫార్ములా ఈ-రేస్ కేసులో రకుల్ ప్రీత్…’ అంటూ క్లెయిమ్ చేస్తున్న న్యూస్ కార్డ్, క్లిప్పింగ్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లికి రూ.10 కోట్లు ఇవ్వాలని ఫార్ములా ఈ-రేస్ నిర్వహించిన గ్రీన్కో కంపెనీని మాజీ మంత్రి కేటీఆర్ ఆదేశించారని ఆరోపిస్తున్న న్యూస్ కార్డును నెటిజెన్లు షేర్ చేస్తున్నారు.
“ఈ ఏడాది ఫిబ్రవరి 21న సినిమా హీరోయిన్ రకుల్ ప్రీత్ కు వ్యాపారవేత్త జాకీ భగ్నానీతో వివాహం జరిగిన విషయం తెలిసిందే. అయితే రకుల్ ప్రీత్ వివాహానికి హైదరాబాద్ లో కేటీఆర్ ద్వారా ఫార్ములా ఈ- రేస్ నిర్వహించిన గ్రీన్కో కంపెనీ 10 కోట్ల నగదు హవాలా రూపంలో చెల్లించినట్టు విచారణలో తేలినట్టు సమాచారం. కేటీఆర్ ఆదేశాల మేరకు రకుల్ ప్రీత్ పెళ్ళికి 10 కోట్లు ఇచ్చామని ఆ సంస్థ ప్రతినిధి వెల్లడించినట్టు తెలుస్తుంది” అని న్యూస్ కార్డు ఆరోపించింది.
ఈ న్యూస్ కార్డును షేర్ చేస్తూ ఫేస్‌బుక్‌లో డిసెంబర్ 25న పోస్ట్ చేశారు. ఈ న్యూస్ కార్డు మీద Way2News లోగో కనిపిస్తుంది. (ఆర్కైవ్)
ఇదే క్లెయిమ్‌లను చేస్తున్న పోస్ట్‌ను ఇక్కడ చూడవచ్చు. (ఆర్కైవ్)
"ఫార్ములా ఈ-రేస్ కేసులో రకుల్ ప్రీత్..." అని ఆరోపిస్తున్న ఓ న్యూస్ క్లిప్పింగ్ కూడా సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. ఈ న్యూస్ క్లిప్పింగ్ ఫోటో ఫేస్‌బుక్‌లో అప్లోడ్ చేస్తూ "ఊహించని మలుపులు తిరుగుతున్న ఫార్ములా ఈ-రేస్ కేసు విచారణ" అని క్యాప్షన్‌లోరాశారు. (ఆర్కైవ్)
Fact Check
న్యూస్‌మీటర్ ఈ క్లెయిమ్స్ తప్పు అని కనుగొంది.
వైరల్ అవుతున్న న్యూస్ కార్డు మీద Way2News లోగో, కథనం లింక్, ప్రచురణ తేదీ కనిపిస్తాయి. పూర్తి సమాచారం కోసం న్యూస్ కార్డ్‌లో పేర్కొన్న ఆర్టికల్ లింక్ ఉపయోగించాము, ఈ లింక్ న్యూస్ కార్డులో కనిపిస్తున్న కథనం కాకుండా "అల్లు అర్జున్‌కు మధ్యంతర బెయిల్" అనే వేరొక కథనాన్ని చూపిస్తుంది. ఈ రెండు కథనాల పోలికలు క్రింది చిత్రంలో చూడవచ్చు.
వైరల్ అవుతున్న న్యూస్ కార్డు Way2News ద్వారా ప్రచురింపబడినట్లు మాకు ఎలాంటి కథనం దొరకలేదు.
ఇదే సమాచారాన్ని ధ్రువీకరిస్తూ Way2News Fact Check వైరల్ అవుతున్న న్యూస్ కార్డు నకిలీ అని, ఇలాంటి వార్త ప్రచురించలేదు అని Xలో పోస్టులో చేస్తూ "ఫేక్ న్యూస్ అలర్ట్! కొంతమంది దుండగులు మా ఫార్మాట్‌లో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారు" అని వ్రాసారు. (ఆర్కైవ్)(ఇంగ్లీష్ నుండి అనువదించబడింది)
సినీ నటి రకుల్ ప్రీత్ పెళ్ళికి 10 కోట్ల రూపాయలు ఇవ్వాలని బీఆర్‌ఎస్ ప్రెసిడెంట్ కేటీఆర్ గ్రీన్కో కంపెనీని ఆదేశించారా అని కీ వర్డ్ సెర్చ్ చేసాము. ఈ క్లెయిమ్ వాస్తవమని చూపించే ఎలాంటి వార్త కథనాలు మాకు దొరకలేదు.
ఈ న్యూస్ న్యూస్ కార్డ్స్, క్లిప్పింగ్స్ తప్పుడు సమాచారం ప్రచురించడానికి ఉద్దేశపూర్వకంగా సృష్టించబడినవని అని అర్ధం అవుతుంది. కాబట్టి న్యూస్‌మీటర్ ఈ క్లెయిమ్ తప్పు అని నిర్ధారించింది.